ఇక్కడ జ‌గ‌న్ ఎంట్రీ.. టీడీపీకి చెమ‌ట‌లే!

వైసీపీ అధినేత‌, విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర కృష్ణా జిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుడివాడలోకి ప్ర‌వేశించనుంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ పాద‌యాత్ర ల‌క్ష్యం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం, పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డం. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. అంద‌రినీ ఒకే తాటిపైకి న‌డుపుతున్నారు. పార్టీలో నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. నేత‌ల్లోనూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి జ‌గ‌న్‌కు జైకొట్టారు. జై కొడుతున్నారు. జ‌గ‌న్ త‌మ ఆశ‌లు నెర‌వేరుస్తాడ‌ని, త‌మ క‌ష్టాలు తీరుస్తాడ‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ పాద‌యాత్ర రాజ‌కీయంగా చైత‌న్యం క‌లిగిన కృష్ణాజిల్లా గుడివాడ‌లోకి ప్ర‌వేశించింది.

కొడాలి నానికి పోటీగా…..

ఇక్క‌డ‌, కొన్నేళ్ల కింద‌టి వ‌ర‌కు టీడీపీ బ‌లంగానే ఉన్నా.. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇక్క‌డ వైసీపీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు. ముఖ్యంగా యువ రాజ‌కీయ నేత కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ నానికి ఇక్క‌డ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. గుడివాడ అంటే నాని, నాని అంటే గుడివాడ అన్న‌ట్టుగా ఇక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిని తీవ్రంగా ఓడించిన నాని, అప్ప‌టి నుంచి అధికార పార్టీ ఆగ‌డాల‌కు ఎదురొడ్డుతూనే ఉన్నారు. నిధులు ఇవ్వ‌క‌పోయినా.. త‌న సొంత డ‌బ్బును వెచ్చించి ఇక్క‌డ క‌నీస మౌలిక స‌దుపాయాల ను ఏర్పాటు చేస్తున్నారు. ఆది నుంచిఇక్క‌డ త‌న‌కున్న ప‌రిచ‌యాల‌ను వినియోగించుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు త‌ల‌లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు నాని. ఇక్క‌డ ఏ స‌మ‌స్య వెలుగు చూసినా ప్ర‌జ‌లు మొద‌ట నాని ఇంటి త‌లుపునే త‌డ‌తారు. ఆయ‌న స్పందించే తీరు ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ఆ విధంగా ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యాడు నాని.

కంచుకోటగా మార్చుకుని……

2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వ‌ర‌రావును కాద‌ని చంద్ర‌బాబు ఎన్టీఆర్ సిపార్సుతో నానికి టిక్కెట్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి నాని గుడివాడ‌ను త‌న వ్య‌క్తిగ‌త కంచుకోట‌గా మార్చేసుకున్నారు. 2009లో జిల్లాలోనే 17 వేల భారీ మెజార్టీతో నాటి మంత్రి పిన్న‌మ‌నేని వెంకటేశ్వ‌ర‌రావును ఓడించారు. ఆ త‌ర్వాత నాని వైసీపీలోకి జంప్ చేసేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఇక్క‌డ క్యాండెట్ లేక ప్ర‌జారాజ్యంలోకి వెళ్లిన రావి వెంక‌టేశ్వ‌ర‌రావును టీడీపీలోకి తీసుకు వ‌చ్చి టిక్కెట్ ఇచ్చింది. జిల్లాలో ద‌శాబ్ద‌కాలంలో టీడీపీ గాలి వీస్తున్నా గుడివాడ‌లో మాత్రం నాని స‌త్తా చాటుతున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో 11 వేల మెజార్టీతో రావిని ఓడించి హ్యాట్రిక్ కొట్టాడు.

అభ్యర్థి ఎవరనేది….?

ఇక‌, రాష్ట్ర అధికార పార్టీ ప‌రిస్థితి చూస్తే.. ఇక్క‌డ న‌లుగురు నేత‌లు మూడు కూట‌ములు అన్న చందంగా భ్ర‌ష్టు ప‌ట్టిపోయింది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున రావి వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేశారు. అయితే, నాని హ‌వా ముందు ఆయ‌న నిల‌వ‌లేక‌పోయారు. దీంతోఘోరంగా ఓడిపోయారు. ఇక‌, ఇక్క‌డ పార్టీని అభివృద్ధి చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డం క‌ల్లే అనే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయితే, టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకే అభ్య‌ర్థి లేని ప‌రిస్థితి నెల‌కొంది.

టీడీపీ టిక్కెట్ రేసులో….

రావి వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు మాజీ మంత్రి, అప్కాబ్ చైర్మ‌న్ పిన్న‌మ‌నేని వెంక‌టేశ్వ‌ర‌రావు, గుడివాడ అర్బ‌న్ బ్యాంకు అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని పూర్ణ‌వీర‌య్య‌, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన గుడివాడ మునిసిప‌ల్ చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు ఇలా ఎవ‌రికి వారు టిక్కెట్ రేసులో ఉన్నారు. వీళ్ల‌లో ఎవ‌రికి సీటు ఇచ్చినా మ‌రొక‌రు స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. ఇక వ్య‌క్తిగ‌త ఇమేజ్‌లో కూడా నానికి వీరు ఎవ్వ‌రూ సాటిరారు. ఇవ‌న్నీ నానికి ప్ల‌స్ కానున్నాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెడుతున్నారు. ఈయ‌న రాక‌తో పార్టీ మరింత‌గా బ‌ల‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రోప‌క్క.. టీడీపీలోని దిగువ స్థాయి నేత‌లు వైసీపీలో చేరేలా నాని చ‌క్రం తిప్పారు. దీంతో దాదాపు 100 మంది వ‌రకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు వైసీపీలోకి చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. గుడివాడ వైసీపీకి కంచుకోట‌గా మారిపోయింద‌నే కంటే నాని కోట‌గా మారిపోయింది. మ‌రి ఈ కోట‌ను టీడీపీ ఎలా కొడుతుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*