జగన్ చంద్రబాబును ఎక్కడికి లాక్కెళతారు?

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహం ఏమిటో ఇత‌ర పార్టీల‌కు మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అంతుచిక్కడం లేదు. జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌ల‌తో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే జ‌గ‌న్ వేసిన ఉచ్చులో చంద్రబాబు ప‌డిపోయారన్న వాద‌న ఏపీలో బ‌లంగా వినిపిస్తోంది. దీనిని ఎక్కువ‌గా బీజేపీ నేత‌లు చెబుతున్నారు. తాజా ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తుంటే మాత్రం అది నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధ‌న ఉద్యమంలో జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి, చంద్రబాబును ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్లు ప‌లువురు భావిస్తున్నారు.

జగన్ వల్లనే చంద్రబాబు….

అస‌లు జ‌గ‌న్ వ‌ల్లే చంద్రబాబు కేంద్రప్రభుత్వం, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావాల్సిన ప‌రిస్థితి ఏర్పడింద‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుద‌ర‌ద‌ని చెప్పిన కేంద్ర ప్రభుత్వంపై మొద‌ట వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రయ‌త్నించింది. అయితే రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానికి తాము కూడా మ‌ద్దతు ఇస్తామ‌ని సీఎం చంద్రబాబు ప్రక‌టించారు. ఒక్కరోజులోనే మాట మార్చి.. వైసీపీతో సంబంధం లేకుండానే తామే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెడతామ‌ని ఆయ‌న చెప్పారు. దీనిపై కూడా తీవ్ర విమ‌ర్శలు వ‌చ్చాయి.

వైసీపీతో బీజేపీ కుమ్మక్కై…..

అయితే వైసీపీ బీజేపీతో కుమ్మక్కు అయ్యింద‌నీ.. అందుకే తామే స్వయంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెడుతామ‌ని ఆయ‌న చెప్పారు. ఒక్కరోజులోనే మాట‌మార్చడంతో చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర విమ‌ర్శలు చేశారు. స‌భ‌లో ఇరు పార్టీలు వేర్వేరుగా తీర్మానాలు స్పీక‌ర్‌కు అందించడం.. టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే స‌భ్యుల ఆందోళ‌న‌తో స‌భ వాయిదా ప‌డ‌డం జ‌రిగింది. చివ‌ర‌కు ఎటూ తేల‌కుండానే స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది.

వైసీీపీ ఎంపీల రాజీనామాతో…..

అయితే చ‌ర్చ జ‌ర‌గ‌కుండా తాము రాజీనామా చేస్తామ‌ని ముందుగా ప్రక‌టించిన‌ట్లుగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. త‌మ రాజీనామా పత్రాల‌ను స్పీక‌ర్‌కు అందించారు. రాజీనామాల‌పై పున‌రాలోచించుకోవాల‌ని స్పీక‌ర్ కోరినా… త‌మ రాజీనామాల‌కు ఆమోదించాల‌ని కోరారు. ఇక్కడ కూడా మ‌ళ్లీ చంద్రబాబు ఇర‌కాటంలో ప‌డిపోయారు. నిజంగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని బాబుగారు ఊహించ‌లేక‌పోయారు.

జగన్ ముందు వరుసలో….

ఇలా ఏపీ ప్రజ‌ల మెప్పు పొంద‌డంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందువ‌రుస‌లో ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. బాబు ప్రతి విష‌యంలో నాన్చుతారు. ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింది. జ‌గ‌న్ ప్రతి విష‌యంలోనూ దూకుడుగా ముందుకు వెళుతూ బాబును డిఫెన్స్‌లో ప‌డేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సీపీఐ, సీపీఎం నేత‌లు రామ‌కృష్ణ, మ‌ధుల నేతృత్వంలో పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇక చంద్రబాబు మాత్రం సైకిల్ యాత్ర చేప‌ట్టారు. అయితే వైసీపీ ఎంపీల రాజీనామాతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*