ఇప్పుడు కాక మరెప్పుడు…?

chandrababunaidu telugudesamparty

సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? ఈసారి హస్తినకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అవును. ఇది నిజమేనంటున్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాక మరెప్పుడు అని జానారెడ్డి తనను కలసిన నేతలను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి ఎరుగని జానాకు నిజంగా ఇది ఎదురుదెబ్బే. 74 ఏళ్ల వయస్సున్న జానారెడ్డి మరో ఐదు సంవత్సరాలు నిరీక్షించే పరిస్థితి లేదు.

కోరిక నెరవేరకపోవడంతో….

గత అసెంబ్లీ ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీఎం అవుతానని భావించిన జానారెడ్డికి ఆ కల నెరవేరలేదు. మరో ఐదేళ్ల పాటు వెయిట్ చేయడం కంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ వెళ్లిపోవాలని జానా నిర్ణయించుకున్నారు. నిజానికి జానారెడ్డి కోరితే అధిష్టానం కూడా కాదనలేని పరిస్థితి. అంతేకాకుండా తాను ఎంపీగా వెళ్లిపోతే వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడికి లైన్ క్లియర్ చేసినట్లవుతుందన్నది జానా ఆలోచన. అందుకే ఆయన ఇటీవల తన సన్నిహితుల వద్ద ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కోమటిరెడ్డిని బుజ్జగించి….

కానీ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి తాను పోటీ చేస్తానని ఇదివరకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆయన కూడా నల్లగొండ నుంచి ఇటీవలిఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే కోమటిరెడ్డి యువకుడని, ఆయనకు ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిలో పోటీచేయవచ్చని కూడా జానా సూచించారని తెలిసింది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో దేవరకొండ, సూర్యాపేట మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ మినహా అన్ని స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది.

అధిష్టానానికి సంకేతాలు….

కాంగ్రెస్ కు కంచుకోటలా ఉన్న నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో జానారెడ్డి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాల్లో జానారెడ్డికి మంచి గ్రిప్ ఉంది. ఇక హూజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి పట్టుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒప్పించగలిగితే తాను ఎంపీ పదవికి పోటీ చేసి సునాయాసంగా గెలవవచ్చని జానారెడ్డి భావిస్తున్నారు. ఈమేరకు పీసీసీ అధ్యక్షుడి ద్వారా అధిష్టానానికి సంకేతాలను కూడా పంపినట్లు తెలుస్తోంది. మరి కోమటిరెడ్డి పోటీ పడుతున్న సందర్భంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందన్నది కాంగ్రెస్ లో ఆసక్తి కరంగా మారింది. రాహుల్ నిర్ణయం ఎవరి వైపు ఉంటుందో చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*