జానారెడ్డి…అనుకున్నదే నిజమైతే….?

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ టిక్కెట్ల రేసులో ముందుంటే విపక్ష కాంగ్రెస్‌ ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలౌతోంది. ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. తెలంగాణ ఎన్నిక‌ల స్టంట్‌లో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే కాంగ్రెస్‌ రేసులో చాలా వెనుక పడిపోయినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహజన సమితితో పొత్తులు పెట్టుకుని మహాకూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పటికీ ఆ దిశగా వేగంగా ఎత్తులు వెయ్యడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మహాకూటమి పొత్తు ఎప్పుడు కొలిక్కి వస్తుందో, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో, ఎన్నికల ప్రచారపర్వంలోకి ఎప్పుడు వెళ్తారో అన్నది ఇంకా క్లారిటీ లేదు.

మిర్యాలగూడ నుంచి…..

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కూడా టీఆర్‌ఎస్ లాగానే పెద్ద రచ్చరచ్చగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వైపు కూటమిలో టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహజనసమితి పార్టీలకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి రావడంతో అక్కడ కాంగ్రెస్‌ సీట్లు ఆశిస్తున్న వారితో పెద్ద చిక్కులే రానున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ అధినేత సీఎల్‌పీ లీడర్‌ జానారెడ్డి సీటు మారతారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో చ‌లకుర్తి నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ఆ నియోజకవర్గం రద్దు అయ్యి నాగార్జునసాగర్‌ నియోజకవర్గం ఏర్పడడంతో అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లోనూ ఆయన నాగార్జునసాగర్‌ నుంచే విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనకు పట్టున్న మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తారని… నాగార్జునసాగర్‌ నుంచి తన వారసుడిని రంగంలోకి దింపుతారని తెలుస్తోంది.

సాగర్ నుంచి తనయుడిని……

గత ఎన్నికల్లో త‌న‌ శిష్యుడిగా ఉన్న నల్లమోతు భాస్కర్‌రావును జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో భాస్కర్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా జానారెడ్డి తన వారసుడు రఘువీర్‌రెడ్డిని పొలిటికల్‌ ఎంట్రీ చేయించేందుకు మిర్యాలగూడలో పోటీ చేయించాలని ప్లాన్‌ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ల ప్రకారం వారసుడు రఘువీర్‌రెడ్డి పొలిటికల్‌ ఎంట్రీకి మిర్యాలగూడ కంటే నాగార్జునసాగర్‌ అనుకూలంగా ఉంటుందని జానారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున బరిలో ఉన్న నోముల నరసింహయ్య స్థానికేత‌రుడని… తమకే టిక్కెట్‌ ఇవ్వాలని గులాబీ దళంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

నోములకు అసమ్మతి తలనొప్పి……

ఎమ్‌సీ కోటి రెడ్డి, తేరా చిన్నపు రెడ్డి లాంటివారు టీఆర్‌ఎస్‌లో అసమ్మతి నేతలుగా తయార‌య్యారు. రేపు వీరంతా నోముల నరసింహయ్యకు వ్యతిరేకంగా పని చేస్తే ఈ అసమ్మతి తమకు కలిసివస్తుందని జానా రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన వారసుడు రఘువీర్‌ రెడ్డిని నాగార్జునసాగర్‌లో పోటీ చేయిస్తే గెలుపు సులువు అవుతుందన్న అంచనాలో ఆయన ఉన్నారు. తాను మిర్యాలగూడలో పోటీ చేస్తే భాస్కర్‌రావు తనకు ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని… అదే జరిగితే నాగార్జునాసాగర్‌లో తన కుమారుడు మిర్యాలగూడలో తన గెలుపు సులువే అన్న లెక్కల్లో జానా రెడ్డి ఉన్నారు. అదే టైమ్‌లో ఇక్కడ మిర్యాలగూడలో కూడా భాస్కర్‌రావు పార్టీ మారి టీఆర్‌ఎస్‌లోకి రావడంతో ముందు నుంచి టీఆర్‌ఎస్‌ కోసం పని చేసిన నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌లోని అస‌మ్మ‌తి వాదులే తమను గెలిపిస్తారని జానా రెడ్డి లెక్క. మరి ఈ లెక్క‌ ఎన్నికల్లో ఎంతవరకు సక్స్‌సెస్‌ అవుతుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*