జ‌న‌సేనాని ఫోక‌స్‌..ప్చ్…లాభం లేదే..!

2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌కటించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కేవ‌లం ఏపీకే ప‌రిమిత‌మ‌య్యాడు. పోరాట యాత్ర పేరుతో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తున్నాడు. ఇక తెలంగాణ వైపు క‌న్నెత్తి చూడ‌రని భావిస్తున్న త‌రుణంలో.. అక్క‌డ కూడా పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెట్ట‌బోతున్నాడు. తెలంగాణ‌లోనూ ఎన్నికల హ‌డావుడి మొద‌లవుతున్న నేప‌థ్యంలో.. ఏపీలో పోరాట యాత్ర పూర్త‌యిన త‌ర్వాత ఆ రాష్ట్రంలోనూ ప‌ర్య‌టించాల‌నే ఉద్దేశంలో ఉన్నార‌ట‌. ఇప్ప‌టికే ఏపీలో కొన్ని జిల్లాల్లో ప‌వ‌న్ యాత్ర పూర్త‌వ‌లేదు. ప్ర‌స్తుతం గోదావ‌రి జిల్లాల వ‌ర‌కూ ప‌వ‌న్ స‌భ‌కు జనాద‌ర‌ణ బాగానే ఉన్నా.. మిగిలిన జిల్లాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌లేం. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న‌లు చేసినా.. అక్క‌డ కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ త‌రుణంలో.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించి ఏం లాభమ‌నే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి.

కొండగట్టు నుంచి ప్రారంభించి……

తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టు నుంచి యాత్ర‌ను ప్రారంభించిన ప‌వ‌న్‌.. త‌ర్వాత ఏపీ పాలిటిక్స్‌లోకి జంప్ అయిపోయారు. ఏపీ కేంద్రంగానే రాజ‌కీయాలు చేసేందుకు సిద్ధమ‌య్యారు. ఈ నేపథ్యంలో పోరాట యాత్ర పేరుతో.. రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తున్నాడు. సీఎం చంద్ర‌బాబు, త‌న‌యుడు లోకేష్‌తో పాటు టీడీపీ నేత‌ల అవినీతిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నాడు. అభిమానుల‌తో పాటు విశ్లేష‌కులు కూడా ప‌వ‌న్‌.. ఏపీకే ప‌రిమిత‌మ‌ని భావిస్తున్నారు. అయితే ప‌వ‌న్ మ‌ళ్లీ తెలంగాణ‌లో యాత్ర‌ను ప్రారంభించాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. రాజకీయ ప్రాబల్యం సాధించుకునేందుకు ప‌వ‌న్ ఏపీలో చేస్తున్న యాత్రలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. కొన్నిచోట్ల తమ గెలుపు ఖాయమన్నట్లు జనసేన నాయకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలోనే యాత్రలను కొనసాగిస్తున్న పవన్‌ తెలంగాణ గురించి పట్టించుకోడా? అని కొందరు ప్రశ్నిస్తు న్నారు.

రాజకీయంగా లబ్ది పొందేందుకు…..

గతంలో కేసీఆర్‌ను తిట్టిపోసిన తర్వాత మళ్లీ ఆయన్ను స్వయంగా కలిసి చర్చలు జరిపారు. దీని సారాంశం బయటికి తెలియకపోయినా ఎన్నికల ప్రచారం కోసమేనని భావిస్తున్నారు. పార్టీ యాత్రను కొండగట్టు నుంచి మొదలుపెట్టిన ఆయన మళ్లీ తెలంగాణలో ఎక్కడా ప్రచారం చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఏపీలో యాత్రలను నిర్వహించి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ లోపాలను బయటపెడుతూ ఆ పార్టీని గద్దెదించాలని కంకణం కట్టుకున్నాడు. అందులోనూ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి స‌పోర్ట్ చేసి.. నాలుగేళ్ల ముందు వ‌ర‌కూ బాబుతోనే జ‌త క‌ట్టిన ప‌వ‌న్‌.. ఇప్పుడు అక‌స్మాత్తుగా టీడీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌టాన్ని కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు న‌మ్మలేక‌పోతున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తుండ‌టంతో.. కొంత వ‌ర‌కూ రాజ‌కీయ ల‌బ్ధి పొందే అవ‌కాశాలున్నాయి. వారితో పోల్చితే తాను బెట‌ర‌ని చెప్పుకొనే అవ‌కాశాలు ఉన్నాయి.

టీఆర్ఎస్ ను విమర్శిస్తారా?

ఇప్పుడు తెలంగాణలో ఎవరిని విమర్శించాలో పవన్‌కు ఇంకా క్లారిటీ లేదు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఇప్పుడు విమర్శిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. పోనీ టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని యాత్రలు చేద్దామంటే ఇంకా సమయం చాలా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ సీట్లు వచ్చే ఆంధ్రలో ముందుగా పూర్తయిన తర్వాత తెలంగాణలోకి అడుగు పెట్టెందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఏపీ జనసేన నాయకులు. జనసేన తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా? అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. గెలుపు ఖాయం అనుకునే సీట్లలో పోటీచేసి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇబ్బంది లేకుండా నడుచుకుంటుందని జనసేన నాయకులు చెబుతున్నారు. మిగతా స్థానాల్లో పోటీ చేసినా ఓట్లు చీలడం తప్ప ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఒకవేళ ఏదైనా స్థానంలో బలమైన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఉంటే ముందుగానే అక్కడ పోటీ లేకుండా జనసేనతో ఒప్పందం చేసుకోవచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.