జవహర్ కు డర్….డర్….!!!

పశ్చిమ – తూర్పు గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ సంచలనాలకు వేదికగా నిలుస్తు ఉంటుంది. కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు మున్సిపాలిటితో పాటు కొవ్వూరు, చాగల్లు, తాళ్ళపూడి మండలాలు విస్తరించి ఉన్నాయి. ప్రముఖ రాజకీయ వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు పుట్టిల్లు కొవ్వూరు నియోజకవర్గం. కొవ్వూరు నియోజకవర్గ రాజకీయాలను పరిశీలిస్తే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు…. ఆవిర్భావానికి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక‌ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క 1999లో మాత్రమే ఆ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ వరుస పెట్టి విజయాలు సాధిస్తుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణారావు ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధించారు.

ఒక్కసారి మాత్రమే ఓడి…..

1983 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క 1999లో మాత్రమే ఆయన ఓడిపోయారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పున‌ర్విభజనలో కొవ్వూరు ఎస్సీలకు రిజర్వ్‌డ్‌ అయ్యింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు టీవీ. రామారావు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేఎస్‌. జవహర్‌ విజయాలు సాధించారు. విచిత్రం ఏంటంటే గత నాలుగు ఎన్నికల్లోనూ ఇక్కడ న‌లుగురు అభ్యర్థులు గెలుపొందుతున్నారు. 1999లో జీఎస్‌.రావ్‌, 2004లో పీవీ. కృష్ణారావు, 2009లో టీవీ. రామారావు, 2014లో కేఎస్‌. జవహర్‌ విజయాలు సాధించారు. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ గాలులు వీచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కొవ్వూరులో మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది. 2009లో రాష్ట్రంలో వరుసగా రెండో సారి కాంగ్రెస్‌ గెలిచినా తిరిగి కొవ్వూరులో టీడీపీయే గెలిచింది. దీనిని బట్టి కొవ్వూరు టీడీపీకి ఎంత కంచుకోటో స్పష్టం అవుతుంది.

మాస్టార్ నుంచి ……

గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పీవీ, కృష్ణారావుకు ఒక సారి ఏకంగా 58వేల ఓట్ల మెజారిటీ వచ్చిందంటే కొవ్వూరు జనాలు టీడీపీకి వ‌న్‌ సైడ్‌గా ఎలా తీర్పు ఇస్తారో తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎక్స్‌సైజ్‌ శాఖా మంత్రిగా ఉన్న కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌ ప్రాధినిత్యం వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు వరకు మాస్టార్‌గా ఉన్న జవహర్‌ అనూహ్యంగా సీటు దక్కించుకుని ఎమ్యెల్యే అవ్వడంతో పాటు గత ఏడాది జరిగిన ప్రక్షాళ‌న‌లో మంత్రి పదవి చేపట్టారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో జవహర్‌ చేసిన అభివృద్ధి చూస్తే మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు బాగానే చేశారు. ఇదే టైమ్‌లో గోదావరి పుష్కరాలు రావడం కూడా జవహర్‌కు కలిసివచ్చింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేకంగా విడుదల అయిన కోట్లాది రూపాయల నిధులతో కూడా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. అలాగే మంత్రి అయ్యాక కూడా కొన్ని ప్రధాన రహదారులతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చెయ్యడంలో ఆయన సఫలీకృతులు అయ్యారు.

పార్టీ పరంగా ఇబ్బందులే…..

అభివృద్ధి పరంగా మంచి మార్కులే వేయించుకున్న జవహర్‌ పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. జవహర్‌ను సపోర్ట్‌ చేస్తున్న వర్గం, జవహర్‌ను వ్యతిరేఖిస్తున్న వర్గాలతో కొవ్వూరు టీడీపీకి పెద్ద సమస్యయే ఎదురైంది. నియోజకవర్గంలో చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరుకు చెందిన స్థానిక సమస్థల ప్రజాప్రతినిధులు జవహర్‌కు వ్యతిరేకంగా మరో గ్రూపు కట్టారు. ఆలాగే జవహర్‌ను సపోర్ట్‌ చేస్తున్న వారందరు ఓ వర్గంగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు, చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు సైతం ఎవరికి వారు వేరు వేరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వ్యతిరేఖ వర్గం తమ సత్తా చాటేందుకు బలప్రదర్శనలకు దిగుతోంది. మంత్రి పార్టీలో రెండు గ్రూపులను ఏకతాటి మీదకు తేవడంలో మాత్రం విఫలం అయ్యారు. అయితే శాఖా పరంగాను, సామాజికవర్గ పరంగాను పార్టీకి, ప్రభుత్వానికి ఆయన చాలా ప్లస్‌ అని అధిష్టానం భావిస్తుంది. చంద్రబాబు వద్ద సైతం ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా బాగున్నా ఆయనకు వ్యతిరేఖంగా ఉన్న గ్రూపు చేస్తున్న కార్యక్రమాలతోనే ఆయనకు పెద్ద తల నొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల వేల జవహర్‌ పార్టీ పరంగా ఉన్న ఈ సమస్యను మాత్రం పరిష్కరించుకోవాల్సి ఉంది.

వైసీపీ నుంచి ఎవరు….?

ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే అసలు వైసీపీలో ఏం జరుగుతుందో కూడా అంతుపట్టని పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టి నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని దుస్థితి. అంతకు ముందు గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనిత తన రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే అయిన పీవీ. కృష్ణారావు సూచన మేరకు గత ఎన్నికల్లో కొవ్వూరులో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నా అధికార టీడీపీలో లాగా వనితను సమర్థిస్తున్న వర్గం, వనితను వ్యతిరేకిస్తున్న వర్గంతో వైసీపీ కూడా రెండుగా చీలిపోయింది. నియోజకవర్గంలో వైసీపీకి గత ఎన్నికల ముందు వరకు పెద్ద దిక్కుగా ఉన్న పీవీ. కృష్ణారావు ఇప్పుడు పార్టీని పట్టించుకోకపోవడంతో కొవ్వూరు వైసీపీ కాడి వదిలేసినబండిలా మారింది.

జనసేన ఓటు బ్యాంకు ఉన్నా…..

అసలు పార్టీ కార్యక్రమాలను ఎవరు ముందుండి నడిపిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. కృష్ణబాబు రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జగన్‌ ప్రస్తుత సమన్వయకర్త వనితకే తిరిగి సీటు ఇస్తారా ? లేదా ఆమెను మారుస్తారా అన్నది సందేహంగానే ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే సామాజికవర్గ పరంగా, పవన్‌ అభిమానులు పరంగా కాస్తో కూస్తో ఓటు బ్యాంక్‌ ఉన్నా ఆ పార్టీ చీల్చే ఓట్ల ఎఫెక్ట్‌ వైసీపీ మీదే ఎక్కువ ఉండే ఛాన్సులు ఉన్నాయే తప్పా ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఉన్నా కొవ్వూరులో మాత్రం టీడీపీ సంస్థాగతంగా బలంగానే కనిపిస్తోంది. అయితే ఆ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలే మైనెస్‌గా ఉన్నాయి. ఏదేమైనా ఓవర్‌ ఆల్‌గా చూస్తే కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీలో నాయకుల మధ్య అనైక్యత ఉన్నా సంస్థాగతంగానూ, కార్యకర్తలపరంగానూ వైసీపీతో పోలిస్తే చాలా బలంగా కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*