జేసీ…స్పీచ్…ను బాబు క్యాచ్ చేశారా?

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మహానాడు సాక్షిగా చేసిన ప్రసంగం చంద్రబాబులో ఆలోచన రేకెత్తించిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను తనకు మంత్రులు, అధికారులు అందించడం లేదా? జేసీ ప్రసంగానికి కార్యకర్తల నుంచి వేదికపై ఉన్న వారంతా చప్పట్లు కొట్టడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యవహార శైలిని మార్చుకున్నారు. ఇది అమరావతిలో హాట్ టాపిక్ అయింది.

జేసీ ప్రసంగంతో…..

మహానాడు సందర్భంగా జేసీ ప్రసంగం ఆకట్టుకుంది. ఒకవైపు జగన్, ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి, చంద్రబాబును కూడా పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. రోజూ టెలికాన్ఫరెన్స్ లను ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తుండటంతో అధికారులు అందుబాటులో ఉండటం లేదని, టెలికాన్ఫరెన్స్ ను సాకుగా చూపి అధికారులు పనులు చేయడం లేదని జేసీ వేదికపై నుంచే తెలిపారు. కనీసం ఎమ్మార్వో కూడా తమకు దొరకడం లేదని ఈ టెలికాన్ఫరెన్స్ లను తగ్గించుకోవాలని జేసీ సూచించారు.

వారానికి ఒకరోజే టెలికాన్ఫరెన్స్……

ఇక జన్మభూమి కమిటీలు తమకు తలనొప్పిగా మారాయని, వాటిని తొలగిస్తేనే మంచిదని జేసీ వేదిక సాక్షిగా అభిప్రాయపడ్డారు. జన్మభూమి కమిటీల ఆగడాలపై ఇటు పవన్, అటు జగన్ కూడా తమ యాత్రల్లో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ఈ రెండింటిపైనా నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వారానికి ఒకసారి మాత్రమే టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే జూన్ 2వ తేదీ నుంచి జరిగే గ్రామసభల్లో పింఛను దారుల ఎంపిక జరగనుంది. వీటిలో కూడా జన్మ భూమి కమిటీల ప్రమేయం ఉండకూడదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. లబ్దిదారుల ఎంపిక కూడా ఇక రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారానే చేయాలని బాబు నిశ్చయించారు. మొత్తం మీద జేసీ స్పీచ్ చంద్రబాబులో ఆలోచన రేకెత్తించిందన్న వ్యాఖ్యలు అమరావతిలోనూ, టీడీపీ వర్గాల్లోనూ విన్పిస్తున్నాయి.