ఆ టీడీపీ లీడ‌ర్ బాంబు బాబుపైనేనా..!

జేసీ దివాక‌ర్‌రెడ్డి మాట‌తీరే వేరు. కొంత వింత‌గా.. మ‌రికొంత కొత్తగా ఉంటుంది. సూటిగా.. ప్రత్యర్థికి పోటుగా ఉంటుంది. నిజానికి ఆయ‌న‌కు అధిష్టానం ఉండ‌దు..త‌న‌కుతానే అధిష్టానం.. తాజాగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై, ఏపీకి ప్రత్యేక హోదా విష‌యంపై ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న వ్యాఖ్యల‌తో టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంపై ప‌లువురు విలేక‌రులు అడిగిన ప్రశ్నలకు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి చెప్పిన స‌మాధానాలు ఇప్పడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాద‌ని చెప్పిన కేంద్ర ప్రభుత్వంపై ఎవ‌రికివారుగా.. ఎవ‌రిపంథాలో వారు ఉద్యమిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

నేనే రాజీనామాలు చేయిస్తా…

కారులో వెళ్తున్న జేసీ దివాక‌ర్‌రెడ్డిని ప‌లువురు విలేక‌రులు క‌లిసి ప్రశ‌లు వేయ‌డ‌మే ఆల‌స్యం.. ఆయ‌న ఫ‌టాఫ‌ట్ స‌మాధానాలు చెప్పేశారు. ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహా దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల‌పై విరుచుకుప‌డ్డారు. ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. దొంగ దీక్షల‌ను ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నార‌నీ, ఎవ‌రేమిటో ప్రజ‌ల‌కు తెలుసున‌ని ఆయ‌న అన్నారు. అక్కడితో ఆగ‌కుండా వైసీపీ రాజ్యస‌భ స‌భ్యులు రాజీనామాలు చేస్తే తాము కూడా రాజీనామాలు చేస్తామ‌ని, తానే అంద‌రితో రాజీనామాలు చేయిస్తాన‌ని దివాక‌ర్‌రెడ్డి బాంబుపేల్చారు. ముందు వైసీపీ రాజ్యస‌భ ఎంపీలు రాజీనామాలు చేస్తారా..? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. మోడీ ఉన్నంత‌కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాద‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు.

బాబుపై ఇది బాంబేనా…

ఎంపీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్ప‌డు ఏపీలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారాయి. టీడీపీ వ‌ర్గాలు ఒక‌రకంగా స్పందిస్తుంటే.. విప‌క్షాలు మ‌రోర‌కంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే ప్ర‌త్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసి రెండు క‌మిటీలు కూడా వేశారు. స‌మ‌న్వయ క‌మిటీ, కార్యనిర్వహ‌ణ క‌మిటీలు వేశారు. ఈ విష‌యంలో ఆచితూచి బాబుగారు అడుగులు వేస్తున్న స‌మ‌యంలో జేసీ దివాక‌ర్‌రెడ్డి బాంబు పేల్చార‌నీ, ఇది చంద్రబాబును ఇర‌కాటంలో ప‌డేశార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు ఇంత‌టి రాజ‌కీయ క్లిష్ట ప‌రిస్థితుల్లో నేత‌లు ఇష్టారాజ్యంగా మాట్లాడ‌డం..టీడీపీలో స‌మ‌న్వయ‌లోపాన్ని ఎత్తిచూపుతోంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అయితే జేసీ వ్యాఖ్యల‌పై బాబుగారు ఏమంటారో మ‌రి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*