ఎవడు కొడితే…మైండ్ బ్లాంక్ అవుతుందో….???

jcdivakarreddy vs prabhakar choudary

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించుకునేందుకు రాజ‌కీయ నేత‌లు వ్యూహాలు సిద్ధం చేసుకోవ‌డం సాధార‌ణ‌మే. అయితే, ఒకే పార్టీలో ఉంటూ. సొంత పార్టీ ఎమ్మెల్యేపై క‌త్తి క‌ట్టిన చ‌రిత్ర ఇప్పుడు అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపిస్తోంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర చౌద‌రిపై ఎంపీ జేసీ వ‌ర్గం ఎప్ప‌టి నుంచో కారాలు మిరియాలు నూరుతున్న విష‌యం తెలిసిందే. ఈ టికెట్‌ను త‌న‌కు అనుకూలంగా ఉన్న‌వారికి ఇప్పించుకోవాల‌ని ఎంపీగా ఉన్న జేసీ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, తిరిగి ఇక్క‌డ నుంచి త‌నే పోటీ చేసి గెలుస్తాన‌ని.. ఈ విష‌యంలో త‌న‌ను ఎవ‌రూ ఢీకొట్ట‌లేర‌ని అంతే బ‌లంగా ప్ర‌భాక‌ర చౌద‌రి అంటున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య‌ కూడా తీవ్రమైన యుద్ధం సాగుతోంది.

ఎమ్మెల్యే అవినీతిపై…..

ఈ క్ర‌మంలో జేసీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భాక‌ర చౌద‌రిని ఎక్కడ కొడితే.,. దిమ్మ‌తిరిగిపోతుందో.. అక్క‌డే కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చౌద‌రికి వ్య‌తిరేకంగా జేసీ త‌న వ‌ర్గంతో విస్తృత ప్ర‌చారానికి తెర‌దీశారు. దీంతో ఇప్పుడు ఏ స్థానిక మీడియాను ప‌ల‌క‌రించినా.. ప్ర‌భాక‌ర చౌద‌రికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నాయి. గోడ‌ల‌పై కూడా వాల్ పోస్ట‌ర్లు వేసి మ‌రీ వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి అనుమతి లేకుండా న‌గ‌రంలో చిన్న మురుగు కాలవ పనులు కూడా ముందుకు సాగవని, ప్రతీ పనికి ఈయన కమీషన్‌ ఆశిస్తారని.. జేసీ వ‌ర్గంగా ఉన్న కొంద‌రు కార్పొరేటర్లు, నేతలే బాహాటంగా విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, జేఎన్‌టీయూ పరిధిలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో 2 శాతం కమీషన్‌ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు మ‌రికొంద‌రు ఆరోపిస్తున్నారు.

జేసీ వర్గం బహిరంగ ఆరోపణలు….

కార్పొరేషన్‌ పరిధిలో ఐహెచ్‌పీ చేపట్టిన రూ.191 కోట్లతో తాగునీటి పైపులైన్‌ పనుల్లోనూ మొబలైజేషన్‌ అడ్వాన్స్‌కింద మొదట్లో కంపెనీకి ఇచ్చిన రూ.7.5 కోట్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు కార్పొరేటర్లే నిప్పులు చెరుగుతున్నారు. అలాగే రాంనగర్‌ బ్రిడ్జి నిర్మాణంలోనూ ఎమ్మెల్యేకు 3 శాతం ‘గుడ్‌విల్‌’ ముట్టజెప్పినట్లు జేసీ వ‌ర్గం నాయ‌క‌లు బాహాటంగానే చెబుతున్నారు. ఇటీవల వడ్డెర ఫెడరేషన్‌కు చెందిన రూ.12 కోట్లు దారి మళ్లినట్లు కొంద‌రు బాధితులు జేసీ వ‌ద్ద పంచాయితీ పెట్టారు. అయితే, ఆయ‌న దీనిని ఏకంగా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌భాక‌ర చౌద‌రిపై క‌సి తీర్చుకున్నారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా వెనుక ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

ఈయన వెనక కూడా…..

ఇక‌, టీడీపీలో జయరాంనాయుడు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే వైఖరితో విభేదించి అవినీతిపై విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈయ‌న వెనుక కూడా జేసీ ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో బుల్లెట్‌ లింగమయ్య అనే వ్యక్తి ద్వారా తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రయత్నించారని ఇటీవల జయరాం పోలీసులను కలిశారు. ఓ స్కార్పియో ఇవ్వడంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తానని లింగమయ్యకు చౌదరి భరోసా ఇచ్చారని జయరాం చెబుతున్నారు. శాంతిస్థాపన కోసం ‘అవే’ను స్థాపించానని చెప్పే చౌదరి… రాజకీయంగా అడ్డొచ్చేవారిని అణ‌గ‌దొక్కాలనుకోవడం దారుణమని విమర్శలు వచ్చాయి. దీంతో మొత్తానికి ప్ర‌భాక‌ర చౌద‌రికి ఇప్పుడు జేసీ దెబ్బ‌తో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది అనంత పొలిటిక‌ల్ టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌లో ప్ర‌భాక‌ర్ చౌద‌రిని త‌ప్పించి త‌న శిష్యుడు గుర్నాథ‌రెడ్డికి సీటు ఇప్పించుకోవాల‌ని జేసీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఇవి ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*