వీర రాఘవ వలలో పడలేదే…??

junior ntr chndrababu naidu telugudesam party

జూనియర్ ఎన్టీఆర్…భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణం. ఇది ఎవరన్నదో కాదు. తెలుగుదేశం పార్టీ నేతలే. అయితే చంద్రబాబు వేసిన వలలో జూనియర్ చిక్కుకోలేదంటున్నారు. చంద్రబాబు భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ట్రాప్ వేసినా అందులో పడకుండా జూనియర్ తెలివిగా తప్పించుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ సోదరి, నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దించారు చంద్రబాబునాయుడు. ఎవరూ ఊహించని విధంగా ఆమె పేరు ఖరారు చేసిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ లు కూడా టీడీపీ ప్రచారంలో పాల్గొంటారని ఆశించారు.

సోదరి పోటీ చేస్తున్నా…..

కాని తన సోదరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా ఆ ఛాయలకు కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ జాగ్రత్త పడ్డారు. సోదరి అని చెప్పి సుహాసినికి మద్దతుగా ప్రచారానికి వెళితే తెలుగుదేశం పార్టీ తనను వాడుకుంటుందని జూనియర్ గ్రహించినట్లుంది. అందుకే సోదరి పోటి చేస్తుందని తెలిసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఒక ట్వీట్ చేసి వదిలేశారు. వాళ్లిద్దరూ కూకట్ పల్లి ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ నేతలే పనిగట్టుకుని ప్రచారం చేశారు. అయతే దీనిపైజూనియర్ ఎటువంటి ఖండనలు చేయకపోవడంతో ఆయన వస్తారని అందరూ భావించారు.

బాలయ్య, బాబు మాత్రమే….

ప్రచారం ముగిసిపోయంది. జూనియర్ రాలేదు. కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పనిగట్టుకుని ప్రచారానికి తిరిగారు. బాలయ్యను మీడియా ప్రశ్నించినా షూటింగ్ ల తేదీలు చూసుకుని జూనియర్ ప్రచారానికి వస్తారని చెప్పారు. చంద్రబాబునాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి ఆహ్వానించే ప్రయత్నం చేయలేదంటున్నారు. సోదరి పోటీ చేస్తున్నప్పుడు తనంతట తానే వస్తే బాగుంటుంది కాని, తాను పిలవడమేంటని ఒకరిద్దరు సీనియర్ టీడీపీ నేతల వద్ద జూనియర్ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నట్లు సమాచారం.

కొంతకాలంగా దూరంగా…..

జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయింది. 2014 ఎన్నికల సమయానికి వచ్చేసరికి పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దగ్గరకు తీశారు. జూనియర్ ను దూరం పెట్టడం ప్రారంభించారు. అంతేకాదు జూనియర్ కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని కూడా టీడీపీకి దూరమయ్యారు. ఎన్టీఆర్ కు చెప్పే నాని పార్టీ మారినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా హరికృష్ణ మరణించినప్పుడు కూడా ఆయన భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయానికి తరలించాలని చంద్రబాబు సూచించినా అందుకు వారు అంగీకరించలేదు. అంటే టీడీపీ అధినాయకత్వంపై జూనియర్ ఎంత అసహనంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. సోదరిని పోటీలోకి దింపి జూనియర్ ను లాగుదామనుకున్న బాబు ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద జూనియర్ చాలా తెలివిగాచంద్రబాబు వలలో పడకుండా తప్పించుకున్నారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*