ఇంత రచ్చ అవసరమా….?

జస్టిస్ ఎం. జోసెఫ్.. భారతీయ న్యాయ చరిత్రలో ఇంతగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మరో న్యాయమూర్తి లేరు. గత ఏడు నెలలుగా ఆయన పేరు ఏదో ఒక రూపంలో వార్తల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోంది. సాధారణంగా న్యాయమూర్తుల నియామకం గుట్టుచప్పుడు కాని వ్యవహారం. న్యాయపాలికకు, ప్రభుత్వానికి మధ్య అంతర్గతంగా నడిచే విషయం. న్యాయవ్యవస్థ సిఫార్సు చేయడం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం, లాంఛనంగా జరిగే వ్యవహారమే. ఎప్పుడో తప్ప ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకోవు. కేంద్ర, న్యాయపాలికలు పట్టుదలకు పోవడం, ఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం ఇటీవల కాలంలో ఇదే ప్రధమమని చెప్పవచ్చు.

కొలీజియం సిఫార్సు చేసినా…..

ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జోసెఫ్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది జనవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నాటి కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ సభ్యులు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ త నెలలో పదవీ విరమణ చేశారు. జస్టిస్ జోసెఫ్ నియామకంపై చలమేశ్వర్ బహిరంగంగానే మాట్లాడారు. ఆయన సమర్థుడైన న్యాయమూర్తి అని, ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎందుకనో కేంద్రం జస్టిస్ జోసెఫ్ విషయంలో సానుకూలంగా లేదు. ఈ సిఫార్సును మళ్లీ పరిశీలించాలంటూ ఏప్రిల్ 30న తిరిగి పంపింది. జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ జాబితాలో 42వ స్థానంలో ఉన్నారని, ఆయనకు పదోన్నతి కల్పిస్తే రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యం పరంగా సమతుల్యం దెబ్బతింటుందని పేర్కొంది. జస్టిస్ జోసెఫ్ కేరళకు చెందిన వారని, ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారని వివరించింది.

పసలేని వాదన…..

వాస్తవానికి ఈ వాదనలో ఎంతమాత్రం పసలేదు. ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉండకూడదన్న నిబంధన ఏమీ లేదు. అదే ప్రాతిపదిక అయితే ఏపీకి చెందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయమూర్తులుగా ఉన్నారు. ప్రాంతీయ ప్రాతినిధ్యం ప్రాతిపదిక అయితే ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల నుంచి ఎవరో ఒకరిని న్యాయమూర్తిగా ఎంపిక చేయాలి. ఇందుకు నిబంధనలు అనుమతించవు. ప్రధాన న్యాయమూర్తి సహా 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన సుప్రీంకోర్టులో ఏరోజూ అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ కారణాలను చూపి జస్టిస్ జోసెఫ్ కు అవకాశం ఇవ్వకపోవడం సమంజసం కాదు. ప్రభుత్వ వాదనను వ్యతిరేకిస్తూ జస్టిస్ జోసెఫ్ పేరును మళ్లీ ప్రతిపాదిస్తూ గత నెల 20న కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో ఇక చేసేది ఏమీ లేక కేంద్రం ఆయన నియామకానికి తలూపింది. దాని ఫలితమే తాజా ప్రకటన. జస్టిస్ జోసెఫ్ తో పాటు మద్రాస్, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్ లకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

అసలు రీజన్ ఇదే…..

జస్టిస్ జోసెఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైకి ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ అసలైనవి రాజకీయ కారణాలు. ఈ విషయం తెలియాలంటే రెండేళ్లు వెనక్కు వెళ్లాలి. 2016 లో ఉత్తరాఖండ్ లో హరీశ్ రావత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా రద్దు చేసింది. దీనిపై రావత్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి పాలన విధింపు అన్యాయం అంటూ నిందించింది. ఆ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాష్ట్రపతి పాలన చెల్లదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో హరీశ్ రావత్ మళ్లీ అధికారాన్నిచేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ఈ తీర్పును జీర్ణించుకోలేని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే జస్టిస్ జోసెఫ్ పదోన్నతిని అడ్డుకుందన్న ఆరోపణలు ఇటీవల కాలంలో బలంగా విన్పించాయి. పైకిఎవరు ఎన్ని చెప్పినప్పటికీ, కేంద్రం ఎంత బుకాయించినప్పటికీ అసలు కారణం ఇదే. అనారోగ్య కారణాల దృష్ట్యా జస్టిస్ జోసెఫ్ ను తొలుత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం సూచించినప్పటికీ కేంద్రం సమ్మతించలేదు. హైదరాబాద్ కు బదిలీ అయితే స్వరాష్ట్రమైన కేరళకు వెళ్లి రావడం సులభం అవుతుందన్నది ఆయన ఆలోచన. కేరళకు చెందిన జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న జన్మించారు. కేరళ హైకోర్టులో ప్రాక్టీస్ అనంతరం అదే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జులైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోథా జోసెఫ్ కు ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. జోసెఫ్ తండ్రి జస్టిస్ కె.కె. మాథ్యూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం మీద జస్టిస్ జోసెఫ్ ఉదంతం న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక కీలక పరిణామంగా మిగిలిపోతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*