ఆయనకు ‘‘జస్టిస్’’ జరిగింది…..!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే అధిపతి కాదు. భారత్ న్యాయపాలనకు ప్రతినిధి. యావత్ దేశ న్యాయవ్యవస్థకు దిక్సూచి, మార్గదర్శి. దార్శనికుడు. ఇంతటి అత్యున్నత పదవిని అందుకోవాలని ప్రతి న్యాయమూర్తి ఆశిస్తారు. కానీ ఇది అంత తేలిక కాదు. అందరికీ సాధ్యపడదు. కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. అదృష్టం కలుగుతుంది. సమర్థత, సీనియారిటీలే భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి ప్రాతిపదికలు. ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం, అదృష్టం జస్టిస్ రంజన్ గొగోయ్ కు లభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో జస్టిస్ గొగోయ్ వచ్చే నెల 3న కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందురోజైన అక్టోబరు 2న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేస్తున్నారు.

అనేక ప్రత్యేకతలు……

46వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టనున్న జస్టిస్ గొగోయ్ లో పలు ప్రత్యేకతలున్నాయి. ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపడుతున్న తొలి ఈశాన్య భారత వాసి. తొలి అసోం నివాసి. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన గొగోయ్ న్యాయవాద వృత్తిలో అత్యున్నత శిఖరాలకు చేరారు. ఆయన తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్ అసోం ముఖ్యమంత్రి. 1978లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. గౌహతీ హైకోర్టులో దశాబ్ద కాలానికి పైగా ప్రాక్టీసు చేశారు. అనేక కీలకమైన కేసులను వాదించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడారు. పేదలు, బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారు. మహిళలు, సివిల్, రాజ్యాంగ సంబంధ మైన కేసుల్లో తన వాదనాపటిమతో విజయవంతమైన న్యాయవాదిగా పేరుగడించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్ గా వ్యవహరించారు. ఆయన సమర్థతకు గుర్తింపుగా హైకోర్టు న్యాయమూర్తి పదవి వరించింది. 2001 ఫిబ్రవరి 28న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా కీలక తీర్పులను వెలువరించారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యాజ్యాలను విచారించేవారన్న పేరుండేది. కేసుల విచారణలో సహనానికి మారుపేరుగా నిలిచారు. వృత్తిపట్ల తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించేవారు. అనంతరం 2010లో పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడా మంచి న్యాయమూర్తిగా అందరి మన్ననలను అందుకున్నారు.

అనతికాలంలోనే…..

అనతికాలంలోనే పదోన్నతిని అందుకున్నారు. 2010లో అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిని అందుకున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు వెల్లడించారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోననతి పొందారు. అప్పటి నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానంలో సేవలు అందిస్తున్నారు. 2012లో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికను సవాల్ చేస్తూ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన పీఏ సంగ్మా పిటిషన్ ను రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ రంజన్ గొగోయ్ సభ్యుడు. లోక్ పాల్, లోకాయుక్తల నియామకానికి సంబంధించిన వ్యవహారాలని ఆయన నేతృత్వంలోని ధర్మాసనం పర్యవేక్షించింది. రాజకీయనాయకులు పదవుల్లో ఉంటూ, తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ఉద్దేశించి ఇచ్చే ప్రకటనలపై నిషేధం గొగోయ్ విధించారు. ఇందుకోసం కొత్త నిబంధనలను రూపొందించారు. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ కర్ణన్ హైకోర్టు థిక్కార పిటిషన్ ను విచారించిన ధర్మాసనంలోనూ గొగోయ్ సభ్యుడు. న్యాయవ్యవస్థ పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా న్యాయ నియామకాల ప్రక్రియ ఉండాలని, ఇందుకోసం సంస్కరణల ఆవశ్యకతను తరచూ ఉద్ఘాటించేవారు. నిజమైన పేదలకు లబ్ది చేకూరేలా వెనుకబాటుతనాన్ని నిర్వచించాలని పేర్కొనేవారు. పేదరికానికి కులం ప్రాతిపదిక కాదన్నది ఆయన వాదన.

తొలుత సందిగ్దం……

జస్టిస్ గొగోయ్ నియామకంలపై తొలుత కొంత సందిగ్దత నెలకొంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరి 12న గళమెత్తిన నలుగురు న్యాయమూర్తుల్లో గొగోయ్ ఒకరు. అప్పట్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బి.లోకూర్, జస్టిస్ జోసెఫ్ తో పాటు జస్టిస్ గొగోయ్ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఆయన పేరును ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫారసు చేస్తారా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమయింది. పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరును నెలరోజుల ముందు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇది సంప్రదాయం మాత్రమే. నిబంధన కానే కాదు. దీంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు సంప్రదాయాన్ని అనుసరించి సీనియర్ న్యాయమూర్తి, తన తర్వాత రెండో స్థానంలో ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును సిఫార్సు చేయడంతో కథ సుఖాంతమైంది. జస్టిస్ గొగోయ్ వచ్చే ఏడాది నవంబరు 17వరకూ పదవిలో కొనసాగుతారు.

ఈ ఏడాదిలో కీలక కేసులు…….

ఈ ఏడాది పదవీ కాలం సమయంలో జస్టిస్ గొగోయ్ పలు కీలక కేసులు విచారించాల్సి ఉంది. అందులో సొంత రాష్ట్రానికి సంబంధించి జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) ముఖ్యమైనది. ఈ కేసును జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. అసోంలో అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కు పంపేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఎన్ఆర్సీ. లోక్ పాల్ ఎంపికకు సంబంధించి సెర్చ్ కమిటీ సభ్యులను నియమించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని కూడా గొగోయ్ ధర్మాసనమే విచారిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగువారు ఆయన. 1966-67 మధ్య కాలంలో సుప్రీంకోర్టుకు సారథ్యం వహించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎన్.వి.రమణ భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఆ పదవిని అందుకున్న రెండో ఆంధ్రుడవుతారు.

 

-ఎడిటోరియల్ డెస్క్