కేసీఆర్ కోపానికి అసలు కారణం అదేనా?

అత్త మీద ఉన్న కోపాన్ని దుత్త మీద చూపించ‌న‌ట్లు ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి. తొలి నుంచి త‌న వెన్నంటే న‌డిచి.. పార్టీలో స‌మ‌స్య వ‌చ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి దానిని ప‌రిష్క‌రించే స‌మ‌ర్థ‌త ఉన్న మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావుపై ఉన్న కోపాన్ని గులాబీ బాస్ తెలివిగా బ‌య‌ట‌పెట్టారా? మేన‌ల్లుడికి మ‌రోసారి చెక్ చెప్పారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపు నుంచి హ‌రీశ్ వ‌ర్గానికి ఏదోలా అడ్డుక‌ట్ట వేస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఆర్టీసీ అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

హరీశ్ గౌరవాధ్యక్షుడిగా……

ఇందులో హ‌రీశ్‌రావుకు చెక్ ఎలా అనుకుంటున్నారా అని ఆలోచిస్తే.. ఆర్టీసీ కార్మిక సంఘాల‌కు గౌర‌వాధ్య‌క్షుడిగా ఉన్న‌ది హ‌రీశే! స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కేసీఆర్‌ను వేడుకుంటే.. ఆయ‌న సామ‌ర‌స్యంగా మాట్లాడ‌కుండా ఏకంగా సంస్థ‌నే ర‌ద్దు చేసేస్తామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన తీరు అంద‌రిన విస్తుపోయేలా చేసేస్తోంది. గోటితో పోయేదానికి గొడ్డ‌లి దాకా తెచ్చుకోవ‌డం అంటారు.. కానీ కేసీఆర్ రూటే వేరే అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి వ‌ర‌కూ తీసుకెళుతున్నారు. స‌మ‌స్య సామ‌రస్యంగా ప‌రిష్క‌రించే అవ‌కాశ‌మున్నా.. దానిని ప‌క్క‌న పెట్టేశారు!

సానుకూలంగా వ్యవహరిస్తారనుకుంటే…..

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇప్పటి బెదిరింపు ధోరణి ప్ర‌ద‌ర్శించ‌డంతో అంద‌రిలోనూ సందేహాలు వెల్లువెత్తుతు న్నాయి. ఉద్యోగ సంఘాల కోరికలు పెద్దవే అయినా.. వాటి విషయంలో ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా వ్యవహరించే తీరును ప్రదర్శించే సీఎం కేసీఆర్.. అందుకు భిన్నంగా ఈసారి ఫైర్ కావటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సమ్మె ఆలోచన మానకపోతే ఏకంగా సంస్థనే మూసేస్తానంటూ హెచ్చరికలు చేయటం షాకింగ్ గా మారాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఇంత తీవ్రంగా హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఉందా? అనే ప్ర‌శ్న వినిపిస్తోంది.

వార్నింగ్ ఇచ్చారంటే…..

కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మంత్రి హరీశ్ రావు మాటను కార్మికులు కాదన‌రు. మ‌రి అలాంటిదేమీ లేకుండా ఎకాఎకిన వార్నింగ్ ఇచ్చేయటం చూస్తే కేసీఆర్ కోపంలో బయటకు చెప్పలేని చికాకు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షకు మంత్రి హరీశ్ రావును ఆహ్వానించక పోవటాన్ని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. కీలకమైన ఆర్టీసీ సమ్మె సమీక్షకు మంత్రి హరీశ్ ను పిలిచి కార్మిక సంఘాలకు కాస్త గట్టిగా చెప్పాలని చెబితే స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోతుంది. ఆ మాట కోసం సమీక్షను నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు.

బలమైన కారణం ఉందా?

కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ రియాక్ట్ కావటం చూస్తే.. ఆర్టీసీ కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ కు చెక్ చెప్పేందుకే ఇంత ఆగ్రహాన్ని ప్రదర్శించారా? అన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యన హరీశ్ పేషీలో ఉన్న ఒక అధికారి.. తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న పేరుతో ఒక పత్రికలో రాసిన వ్యాసం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఆయన్ను సాగనంపే వరకూ ఊరుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. హరీశ్ పెద్దన్నలా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు నేరుగా ఘాటు వార్నింగ్ ఇవ్వటం చూసినప్పుడు సమ్మె చేస్తామన్న కార్మికుల మీద కేసీఆర్ ఆగ్రహం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఒక‌వేళ డిమాండ్లు ప‌రిష్కార‌మైతే ఆ క్రెడిట్ హ‌రీశ్‌కు ద‌క్కుతుంద‌నో ఏమో.. కేసీఆర్ ఇలా ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*