కేసీఆర్ కు దెబ్బేయడం ఖాయమేనా?

పాలమూరు జిల్లా ఈసారి కేసీఆర్ కు దెబ్బేస్తుందా? అధికార పార్టీలో అసంతృప్తులు ఆయనకు తలనొప్పిగా మారనున్నాయా? అవుననే చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సయమంలో పాలమూరు జిల్లాలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగులుతోంది. అంతకు ముందు టీఆర్ఎస్ లో చేరికలు ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వలసల జోరు పెరిగింది. పాలమూరులో పట్టుకోసం కాంగ్రెస్ తీవ్రంగానే శ్రమిస్తుంది. సహజంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లనూ పాలమూరు జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను ఒక పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ నిలబడింది.

గత ఎన్నికల్లో అధిక సీట్లు సాధించి…..

అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఎంతోమంది ద్వితీయ శ్రేణి నేతలు ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం ప్రారంభమయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీకి జిల్లాలో మంచి హైప్ వచ్చింది. టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

నేతల్లో అసంతృప్తి…..

తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వర్ రావు, మహబూబ్ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి వెంకటేశ్ లు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా అనేక మంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీం త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. మరో ముఖ్యమైన విషయమేంటంటే మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి కూడా హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. వీరందరూ చేరితే కాంగ్రెస్ బలం మరింత పెరగనుంది.

వర్గ విభేదాలూ, ఉద్యమనేతలూ….

అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు కూడా కాంగ్రెస్ కు కలసి వచ్చినట్లే కన్పిస్తున్నాయి. నారాయణపేటకు చెందిన టీఆర్ఎస్ నేత శివకుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే రాజేందర్ రెడ్డి అధికార పార్టీలో చేరడంతో శివకుమార్ రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. నియోజకవర్గంలోనూ ఆయనను పట్టించుకోకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శివకుమార్ రెడ్డి పార్టీని వీడితే కారు పార్టీకి ఇక్కడ కష్టాలేనంటున్నారు. ఇక దేవరకద్ర నియోజకవర్గం నుంచి మధుసూదన్ రెడ్డి కూడా గాంధీభవన్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గ బీజేపీ నేత అనిరుధ్ రెడ్డి కూడా హస్తం పార్టీవైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల ఆయన తన గ్రామంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు హాజరవ్వడం ఇందుకు అద్దం పడుతుంది. ఉద్యమంలో పనిచేసిన వారికి సరైన ప్రాధాన్యత లభించకపోవడం వల్లనే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తం మీద పాలమూరు జిల్లాలో రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలుంటాయని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*