కంచుకోట‌లో గులాబి ప‌ట్టు ఎంత‌..!

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోరాటాల జిల్లా న‌ల్ల‌గొండ అంటేనే అధికార టీఆర్ఎస్ పార్టీకి మంచి ప‌ట్టున్న జిల్లా. 2001లో ఆ పార్టీ ఏర్ప‌డిన‌ప్పుడు స్థానిక సంస్థ‌ల్లో ఇక్క‌డ తిరుగులేని మెజార్టీ సాధించింది. అప్ప‌టి నుంచి కూడా జిల్లాలో టీఆర్ఎస్ బ‌లంగా వేళ్లూనుకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టు నిలుపుకునేంద‌ుకు ఇప్ప‌టి నుంచి పావులుక‌దుపుతున్నాయి. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి.

తక్కువ స్థానాలు గెలిచినా….

గ‌త ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో, సీపీఐ మ‌రోస్థానంలో విజ‌యం సాధించాయి. ఇక రెండు పార్ల‌మెంటు స్థానాలు భువ‌న‌గిరిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి బూర న‌ర్స‌య్య గౌడ్ విజ‌యం సాధించ‌గా, న‌ల్ల‌గొండ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి గెలిచారు. అయితే త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మిర్యాల గూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావు, న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, దేవ‌ర‌కొండ సీపీఐ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌కుమార్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సిట్టింగ్ స్థానాలను….

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌స్థానాల‌తోపాటు మిగ‌తా స్థానాల్లోనూ గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో గులాబీ నేత‌లు ఉన్నారు. కానీ, సిట్టింగ్ స్థానాల‌ను కాపాడుకోవ‌డం ఆ పార్టీ అంత‌సులువు కాద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. టికెట్ల రేసులో చాలామంది ఉండ‌డం, నేత‌లు గ్రూపులుగా విడిపోవ‌డం, ప‌లువురు ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉండ‌డం, అదే సమ‌యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవ‌డంతో అన్నిస్థానాల్లో గులాబీ జెండా ఎగుర‌వేయ‌డం క‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తోంది.

దేవరకొండలో….

దేవ‌రకొండ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌కుమార్‌కు టికెట్ రేసులో గ‌ట్టిపోటీనే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలునాయ‌క్‌కు టికెట్ రాక‌పోవ‌డంతో ఆయ‌న జెడ్పీటీసీగా గెలిచి, జెడ్పీచైర్మ‌న్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వీరిద్ద‌రిలో ఎవ‌రికి టికెట్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సూర్యాపేట‌లో ఆయ‌న‌కు వ్య‌తిరేక‌ప‌వ‌నాలే వీస్తున్నాయి. ఆయ‌న కీల‌క అనుచ‌రులుగా ముద్ర‌ప‌డిన న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాద‌రి కిశోర్‌కు ఈసారి టికెట్లు రావ‌డం క‌ష్ట‌మేన‌ని పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

మునుగోడులో…..

మునుగోడులో ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌రెడ్డికి టికెట్ రేసులో పోటీ త‌ప్ప‌డం లేదు. ఈసారి ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌, జ‌ర్న‌లిస్టు సంఘం నేత ప‌ల్లె ర‌వికుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్క‌డ కోమ‌టిరెడ్డి సోద‌రుడు రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే టీఆర్ఎస్‌కు క‌ష్ట‌మ‌నే టాక్ ఉంది. ఇక మిర్యాల‌గూడ‌లో గులాబీ ప‌రిస్థితి మ‌రింత గంద‌ర‌గోళంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావు గులాబీ తీర్థం పుచ్చుకోవ‌డంతో టీఆర్ఎస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి అమ‌రేంద‌ర్‌రెడ్డి అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్పుడు టికెట్ విష‌యం పార్టీపై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి. ఆలేరులో ప్ర‌భుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాత్రం ధీమాగా ఉన్నారు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నేత మోత్క‌ుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ లో చేరితే మాత్రం ఆయ‌న‌కే టికెట్ వ‌స్తుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*