ఇద్దరికీ ఎంత తేడా…?

తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు చంద్రులు ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌డికి తెర‌లేపారు. ఇంకా ఏడాది గ‌డువు ఉండ‌గానే.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధంగా ఉండాల‌ని పార్టీల శ్రేణుల‌కు పిలుపునిస్తున్నారు. అయితే, ఉన్న‌ట్టుండి.. ఒక్క‌సారిగా ఈ ముంద‌స్తు రాగం ఎందుకు ఎత్తుకున్నారు..? ముంద‌స్తులో ఇద్ద‌రు చంద్రుల ద‌మ్మెంత‌న్న‌దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. రాష్ట్ర విభ‌జ‌న‌లో త‌ర్వాత ఏపీలో టీడీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికార ప‌గ్గ‌లు చేప‌ట్టాయి. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో పోటీప‌డుతూ ముందుకు సాగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నాయి.

ఎవరికి వారే సాటి…….

అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్న‌ప‌రిస్థితులు ఉన్నాయి. వ్యూహాల్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు ఎవ‌రికివారే సాటి. ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన నీతి ఆయోగ్ స‌మావేశం అనంత‌రం ముంద‌స్తు ముచ్చ‌ట ముందుకొచ్చింది. ఢిల్లీ నుంచి తిరిగిరాగానే.. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌, ఏపీలో సీఎం చంద్ర‌బాబులు పార్టీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో ప్ర‌స్తుతం టీడీపీకే అనుకూల ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

వెళ్లాలా? వద్దా?

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసిందంటూ బీజేపీని, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో అంట‌కాగుతున్నారంటూ వైసీపీని ప్ర‌జ‌ల ముందుకు దోషులుగా నిల‌బెట్ట‌డంలో చంద్ర‌బాబు కొంత‌మేర‌కు స‌క్సెస్ అయ్యార‌నే చెప్పొచ్చు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు ఇప్ప‌టివ‌ర‌కూ క్షేత్ర‌స్థాయిలో ఇంకా కుదురుకోలేదు. ఇదే అదునుగా ముంద‌స్తుకు వెళ్తే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌చ్చ‌న్న భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయినా ఎక్కడో అనుమానం. ముందస్తు కు వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలో అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే లోకేష్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. పూర్తి కాలం ప్రభుత్వం ఉంటుందని చెప్పడం విశేషం.

కేసీఆర్ రెడీ అయిపోయినట్లే……

తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలే త‌మ‌ను మ‌ళ్లీ గెలిపిస్తాయ‌న్న ధీమాలో కేసీఆర్ ఉన్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీలు ప్ర‌భుత్వం దాడిని ముమ్మ‌రం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌తంతో పోల్చితే ఈసారి కొంత పుంజు కుంటున్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. అయితే పార్టీలో గ్రూపు త‌గాదాలు వెంటాడుతున్నాయి. పార్టీని వీడే నేత‌ల సంఖ్య పెరుగుతోంది. దీనికి అడ్డుక‌ట్ట‌వేయ‌డంలో అధిష్టానం విఫ‌లమైంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ, తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీలు ఇంకా క్షేత్ర‌స్థాయిలో కుద‌రుకోలేదు. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనంగా ఉన్ప‌ప్పుడే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంద‌కుపైగా సీట్లు గెలుస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ముంద‌స్తుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామ‌ని కాంగ్రెస్ పార్టీ కౌంట‌ర్ ఇచ్చింది. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ అయితే స్టార్ట్ అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*