సూపర్ సీన్లు…ఎవరికీ తెలియదనుకుంటే…?

ఇక తెలుగు రాష్ట్రాలు భిన్న రాజకీయ ధ్రువాలు. జాతీయంగా తమదైన పంథాను అనుసరించబోతున్నాయి. సొంత ప్రయోజనాల కోసం ఎన్డీఏ, యూపీఏ కూటములకు చేరువయ్యే విధంగా పాలకపక్షాల అధినేతలు పరోక్షమైన సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు. తెలంగాణ పాలకపార్టీ బీజేపీతో చెట్టపట్టాలకు సిగ్నల్స్ ఇస్తోంది. టీడీపీ కాంగ్రెసుకు కన్విన్సింగ్ పొజిషన్ తీసుకుంటోంది. లా కమిషన్ నిర్వహించిన చర్చల్లో ఈ రెండు పార్టీలు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడించాయి. నిజానికి తమకే మాత్రం పరఖ్ పడని జమిలీ ఎన్నికలపై భిన్నమైన నిర్ణయాలను ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీని హెచ్చరించాలనే ధోరణిని టీడీపీ కనబరుస్తోంది. కమలం కరుణ కోసం కాస్త మెతక వైఖరిని టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఈ రెండు పార్టీల నిర్ణయాల్లోని రాజకీయం జాతీయ పార్టీలకు ఆసక్తిగా మారింది.

టీడీపీ ససేమిరా…

1999 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు లోక్ సభ తో కలిపే జరుగుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఈతంతు కొనసాగుతోంది. రాష్ట్రం విడిపోయినా ఆ ఆనవాయితీనే కొనసాగుతోంది. సాగబోతోంది. లోక్ సభ, శాసనసభల ఏకకాల ఎన్నికలు అన్నవి ఇక్కడ పెద్ద చర్చనీయాంశం కాదు. పార్టీలు, ప్రజలు ఉమ్మడి ఎన్నికలకు అలవాటు పడిపోయారు. అందువల్ల తెలుగు రాష్ట్రాలకు ఇది పెద్ద ప్రాధాన్య అంశం కాదు. తమకేం ఇబ్బంది లేదు. 20 ఏళ్లుగా మేం అదే పద్ధతిలో పోతున్నామంటూ టీడీపీ తేల్చి చెప్పేయవచ్చు. కానీ అది కేంద్రప్రభుత్వానికి అడ్వాంటేజ్ గా మారుతుంది. తెలుగుదేశం పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు పలుకుతోందంటూ ఖాతాలో రాసేసుకునే అవకాశం ఉంది. అందువల్ల విధానపరంగా బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత కేంద్రం ముందరి కాళ్లకు బంధం వేయాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు కుదరవంటూ కుండబద్దలు కొట్టేశారు. పనిలో పనిగా ఈవీఎంలతో ఓటింగునే తప్పుపట్టేశారు. నిజానికి అధునాతన విధానాలను ప్రోత్సహించే నేతగా పేరున్న చంద్రబాబు నాయుడు మళ్లీ బ్యాలెట్ కు వెళ్లాలంటూ చేసిన సూచన తిరోగమన చర్యగానే చూడాలి. మెరిట్స్, డీమెరిట్స్ తో సంబంధం లేకుండా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటోంది. వీలుంటే సెక్యులర్ ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఫ్రంట్ వల్ల రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు దెబ్బతింటాయనుకుంటే మాత్రం దూరంగా ఉండే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ ..సై సై…

అవసరానికి మించి టీఆర్ఎస్ బీజేపీతో చెలిమికి తహతహలాడుతున్న వాతావరణం కనిపిస్తోంది. బీజేపీని పటిష్ఠపరచాలనే ఎత్తుగడతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ టీఆర్ఎస్ పై ఈమధ్యనే చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు టీఆర్ఎస్ నేతల్లో మగతనమే లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కిమ్మనకుండా మౌనం వహించింది. రాంమాధవ్ చిన్నాచితకా నాయకుడేం కాదు. మోడీ, అమిత్ షా ల తర్వాత బీజేపీలో ప్రాముఖ్యం వహించే అగ్రనాయకగణంలో ఒకరు. అనేక రాష్ట్రాలకు ఇన్ ఛార్జిగా పార్టీలో చక్రం తిప్పుతున్నాడు. అందుకే అతనితో వైరం పెట్టుకునేందుకు టీఆర్ఎస్ సాహసించడం లేదు. కనీసం ప్రతి విమర్శలను గుప్పించకుండా మౌనం వహించింది. తాజాగా లా కమిషన్ నిర్వహించిన జమిలీ విధానంపై సంపూర్ణ మద్దతు ప్రకటించింది. లిఖితపూర్వకంగా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. ఇదంతా కమలానికి కాసింత చేరువ అవుతున్న పరిస్థితికి అద్దం పడుతోంది. నీతి అయోగ్ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఆ సందర్బంగా రాజకీయంగా స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత పక్షం రోజులు గడవకుండానే మంత్రి కేటీఆర్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇవన్నీ బీజేపీతో సానుకూల పరిణామాలకు సూచికలుగా రాజకీయపరిశీలకులు చెబుతున్నారు. గతంలో థర్డ్ ఫ్రంట్ పేరిట చేసిన హడావిడిని కేసీఆర్ స్వచ్ఛందంగానే వదిలేసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర నిర్ణయానికి టీఆర్ఎస్ వత్తాసు పలుకుతూ సై ..సై.. అనడంలోని ఆంతర్యమిదేనంటున్నారు.

పార్టీ పట్టు కోసమే..?

ప్రధానిగా మోడీ ఎక్కువ సమయం ఎన్నికల ప్రచారానికే కేటాయించాల్సి వస్తోంది. గతంలో పార్టీ ఎక్కువ పాత్ర పోషించేది. రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికల వంటి సందర్బాలను అగ్రనాయకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. వాజపేయి, అద్వానీల హయాంలో ప్రాంతీయ నాయకులకు ప్రాధాన్యం ఉండేది.వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటివారు అలా ఎదిగివచ్చినవారే. ఇప్పుడు ఏకకేంద్రంగా మారిపోయింది పరిస్థితి. దేశంలో ఏ మూలనైనా బీజేపీ గెలుపోటములకు బాధ్యునిగా మోడీనే చూపించే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మోడీ, అమిత్ షాలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ జరిగితే పాలనపై ప్రధాని దృష్టి సారించగలుగుతారు. బీజేపీ అజెండాను అమలు చేయగలుగుతారు. ప్రస్తుతం ప్రధాని సమయమంతా ఎన్నికల ప్రచారానికే సరిపోతోంది. జమిలి ఎన్నికలైతే రెండు మూడు నెలల వ్యవధిలో మొత్తం తతంగం ముగిసిపోతుంది. బీజేపీ పట్టును సంఘటిత పరుచుకోవచ్చనేది మోడీ, అమిత్ షాల భావన. అయితే పార్టీలోని కొన్ని వర్గాలు దీనిపై పూర్తిస్థాయి సుముఖంగా లేవు. మోడీ, అమిత్ షాలు మరింతగా పట్టు బిగిస్తారేమోననే అనుమానాలు వారిలో నెలకొన్నాయి. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను రాష్ట్రాల అజెండాలో చేర్చడం ద్వారా జాతీయ పార్టీగా బీజేపీ ప్రాధాన్యం పెంచడం జమిలి ఎన్నికల లక్ష్యంగా బీజేపీ నాయకులు చెబుతున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్