సైకిల్ డేంజర్….కారు…కన్నింగ్….!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ . ఇద్దరూ మంచి నాయకులే. జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. మరొకరు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వెనకబడినతరగతులకు చెందినవారు. అయినా ఇద్దరూ ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొత్తులు మొదలు పార్టీలో ఏం జరుగుతుందో ఇద్దరికీ అర్థం కావడం లేదు. అధిష్ఠానాలు తమతో దొంగాట ఆడుతున్నాయేమో తెలియదు. తాము చివరికి బలిపశువులుగా మిగిలిపోతామేమో అంతుచిక్కదు. గమ్యం, లక్ష్యం తెలియని వీరిరువురూ ఒకరికొకరు ఓదార్పుగా మారారు. వీరి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుంటే చాలు ఆయా పార్టీల దురవస్థ అర్థమైపోతుంది. ద్వంద్వ ప్రమాణాలు తేటతెల్లమవుతాయి.

నాకూ ..నీకూ అదే కష్టం…

ఉప్పునిప్పులకు ప్రతీకలు కాంగ్రెసు, బీజేపీలు. అది జాతీయస్థాయిలో మాత్రమే. ఇక్కడ ఆపార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్,లక్ష్మణ్ లు స్నేహశీలురు. వ్యక్తిగత సంబంధాలను పార్టీలకు అతీతంగా నడుపుతుంటారు. వీరిద్దరూ తాజాగా ఒకే వేదికపై కలిశారు. ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిట్టిపోశారు. దాంతో సరిపుచ్చుకోలేదు. మాటామాటా కలుపుకున్నారు. ఒకరికష్టాలు మరొకరు చెప్పుకున్నారు. నిజానికి వీరిద్దరినీ అధిష్టానం పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. విశ్వాసంలోకి తీసుకుంటున్నారా? అంటే అనుమానమే. టీఆర్ఎస్ తో బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నారు. కేసీఆర్ మోడీలు స్వయంగా మాట్టాడుకుని ఒక అవగాహనకు వచ్చేసినట్టుగా ప్రచారం మొదలైంది. ఇక టీడీపీని ఆకట్టుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం సకల యత్నాలు చేస్తోంది. రాష్ట్రస్థాయి నాయకులైన ఉత్తమ్, లక్ష్మణ్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ వ్యవహారాలు నడిచిపోతున్నాయి.

సైకిల్ చాలా డేంజర్…

కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందనే సమీకరణలు వెలువడుతున్నాయి. తెలంగాణలో టీడీపీకి కొంతమేరకు ఓటు బ్యాంకు ఉంది. సొంతంగా గెలిచే స్థాయి లేదు. అలాగే చాలా చోట్ల కాంగ్రెసు బలంగానే ఉన్నప్పటికీ అధికార టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోగల సామర్థ్యం లేదు. అటువంటి నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలు చేయి కలిపితే అధికారపక్షానికి గట్టిపోటీ ఇవ్వవచ్చు. ఈ దృష్టితోనే టీడీపీ, కాంగ్రెసులు చేరువ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే టీడీపీకి పాత మిత్రపక్షమైన బీజేపీ సైకిల్ పార్టీ పేరు చెబితే కారాలు మిరియాలు నూరుతోంది. లక్ష్మణ్ మాటామంతిలో భాగంగా సైకిల్ పార్టీతో వెళితే చాలా డేంజర్ అని ఉత్తమ్ కు ఉచిత సలహా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద వైఖరితో స్టాండ్ మార్చుకుంటారని తెలిసిన విషయాన్నే మరోసారి గుర్తు చేశారు. ఈ సలహాను పాటించి అమలు చేయగల అధికారం ఉత్తమ్ కు లేదని తెలిసీ లక్ష్మణ్ సలహానివ్వడమే విచిత్రం.

కారుతో కష్టం…

బీజేపీ అధిష్టానం కారుతో చెలిమికి తహతహ లాడుతోంది. ‘కేసీఆర్ వ్యూహాల ముందు మీరు చిత్తయిపోతారు జాగ్రత్త’ అంటూ తన మిత్రుడు లక్ష్మణ్ ను అప్రమత్తం చేశారు ఉత్తమ్. రాష్ట్రవిభజన తర్వాత టీఆర్ఎస్ ను కాంగ్రెసులో కలిపేస్తారని భావించింది అధిష్ఠానం. కానీ కేసీఆర్ ఏకుమేకై పోయారు. పైపెచ్చు తన ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీతో చేతులు కలుపుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ చెవిలో కేసీఆర్ కమలం పెట్టే అవకాశం ఉంది. మీ అధిష్టానాన్ని హెచ్చరించండి అంటూ ఉత్తమ్ సలహానిచ్చారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రం సహకరించినంతమాత్రాన మీకు కేసీఆర్ పూర్తిగా సహకరిస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లేనని చెప్పేశారు. వీరిద్దరూ ఒకరి గురించి మరొకరు హితవు చెప్పుకున్నారు సరే . రోలు వచ్చి మద్దెలతో గోడు వెలిబుచ్చుకుంటే ఏమిటి ప్రయోజనం? అధిష్టానం అనే చెవిటి ముందు శంఖం ఊదినట్లే అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నాయి ఇరుపార్టీల శ్రేణులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*