పక్క నుండి పొగ పెడుతున్నారే….!

పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకునే ప్రతి నిర్ణయమూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారుతుంది. కేసీఆర్ ఉద్యోగులకు భత్యాలు పెంచినా….ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించినా….ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు ప్రకటించినా పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు షాక్ లమీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ కానుకలు ప్రకటించడమూ విధిలేని పరిస్థితుల్లో అక్కడ కూడా అమలు చేయాల్సి వస్తోంది. 5 రూపాయల భోజనమైనా, కల్యాణ లక్ష్మి, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా వంటివి కేసీఆర్ అమలుపర్చడంతో బాబు ఆఘమేఘాల మీద ప్రకటించాల్సి వచ్చింది.

కేసీఆర్ స్కీములన్నీ……

ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు తాజా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడమూ బాబులో అసహనం రేపుతోంది. ఎన్నికలకు కేసీఆర్ వెళితే చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే గత ఎన్నికల్లో వివిధ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. గులాబీ పార్టీ కండువాను కప్పి కొందరిని మంత్రులుగా కూడా చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీలో నుంచి చేర్చుకుని మంత్రిని చేయడాన్ని స్వయంగా తప్పు పట్టిన చంద్రబాబు ఏపీలో కూడా కేసీఆర్ విధానాన్నే కొనసాగించాల్సి వచ్చింది. వైసీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు.

జంప్ జిలానీలందరికీ సీట్లిచ్చి…..

సరే…ఇది ఇలా ఉంటే కొత్తగా బాబుకు ఒక చిక్కు వచ్చి పడింది. కేసీఆర్ ఎన్నికలకు వెళుతూ..వెళుతూ.. 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో వివిధ పార్టీల నుంచి ఫిరాయించిన దాదాపు ఇరవై ఆరు మందిఎమ్మెల్యేలకు మళ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చేశారు. జంప్ చేసి వచ్చిన వారికి తగిన రీతిలో గౌరవమిచ్చారు. తాను వారిని గెలిపించుకుంటాననే నమ్మకంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు అదే చోట సీట్లు ఖారరు చేసి విపక్షాలకు సవాల్ విసిరారు. తన లీడర్ షిప్ మీద ఆయన అయితే వారు గెలుస్తారా? లేదా? అన్నది వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కూడా…..

ఇక ఏపీలో కూడా చంద్రబాబుకు ఇది సమస్యగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ 22 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు గెలిచే ప్రసక్తి లేదని చంద్రబాబుకు వివిధ సర్వేల ద్వారా అందిన రిపోర్ట్ లు ఆధారంగా వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ ఇచ్చినట్లుగానే పార్టీ మారి వచ్చిన వారందరికీ తిరిగి సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకునే అవకాశం ఉంది. ఇలా కేసీఆర్ తన స్కీమ్ లతోనూ…. సిట్టింగ్ ల లిస్ట్ లతోనూ చంద్రబాబును పదే పదే ఇరకాటంలోకి నెడుతున్నారన్నది వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*