ఇద్దరికీ నో మొహమాటం….!

ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన భేటీ సందిగ్ధంగానే ముగిసింది. స్పష్టత కరవైంది. కేవలం 20 నిముషాలకే అయిపోయింది. అందులో ఏం జరిగిందన్న ఆసక్తి రాజకీయవర్గాలకు నిదుర పట్టనివ్వడం లేదు. సాధారణంగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడని ముఖ్యమంత్రి తన ఆనవాయితీ మీరలేదు. కేవలం సాంకేతిక,పరిపాలన అంశాలపై మాత్రమే ప్రభుత్వ పరంగావివరణ ఇప్పించారు. ఎంపీ వినోద్ సీఎం కేసీఆర్, మోడీ ల సంభాషణల సారాంశాన్ని వెల్లడించారు. నిజానికి సమావేశం ఏకాంతంగా, ఆంతరంగికంగా జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలోని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ వాటినే మీడియాకు వెల్లడించారు. ముందస్తు ఎన్నికల వంటి కీలక విషయాలపై కేసీఆర్ అంతరంగాన్ని కనిపెట్టడం అంతసులభంగా సాధ్యం కాదు. అదేవిధంగా ప్రధాని మోడీ సైతం ఎదుటివారిని అంచనా వేయకుండా అంతరంగం బయటపెట్టరు. ఈవిషయంలోనే ఇద్దరూ పూర్తి స్థాయిలో రాజకీయంగా మనసు విప్పుకోలేకపోయారనేది ఢిల్లీ వర్గాల సమాచారం.

తగ్గినట్టా? నెగ్గినట్టా?….

తెలంగాణ ముందస్తు ఎన్నికలనేవి రాజకీయంగా దుమ్ము రేపుతున్నాయి. అన్నిపార్టీలు అదే కోణంలో ఆలోచన చేస్తున్నాయి. చిలువలు,పలువలు చేసి మీడియా తమకు తోచిన తేదీలను సైతం ప్రకటించేస్తోంది. దానికి ఊతమిచ్చేలా అధికార టీఆర్ఎస్ కార్యాచరణ కనిపిస్తోంది. సెప్టెంబరు రెండో తేదీ సభ దీనికి పెద్ద ఉదాహరణ. ప్రతి నియోజకవర్గం నుంచి 25 వేల వరకూ జనాభాను తరలించాలంటూ అధినేత ఆదేశించారు. నేతల పోటాపోటీ అప్పుడే మొదలైంది. ఎమ్మెల్యేలు తమ సీట్లు కాపాడుకోవడానికి, కొత్తవారు టిక్కెట్లు తెచ్చుకోవడానికి ఈ ప్రగతి నివేదన సభను ఆసరాగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు, ప్రగతి నివేదన సభకు సైతం లింకు పెట్టారు టీఆర్ఎస్ అధినేత. తాను ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చేటప్పటికి పక్కాగా ఏర్పాట్లు పూర్తి కావాలని సూచించారు. అయితే ప్రధానిని కలిసిన తర్వాత సభ ఏర్పాట్లపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. ఎన్నికల భేరీగా సాగే సభలో ఏర్పాటు చేయాల్సిన నినాదాలు, అజెండా వంటివాటిలో కొన్నిమార్పులు సూచించినట్లుగా సమాచారం. భారీ బహిరంగ సభను సద్వినియోగం చేసుకుంటూనే ముందస్తుకు వెళ్లిపోతున్నామన్న భావన రాకుండా చూడాలని అధినేత ఆదేశించారు. దీనిని బట్టి ప్రధాని మోడీ భేటీలో ఏదో జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. అది కేసీఆర్ పార్టీకి సానుకూలంగా కాకుండా ప్రతికూలమనేది రాజకీయవర్గాల అంచనా. అందువల్లనే ప్రధాని భేటీ తర్వాత కేసీఆర్ లో జోష్ లోపించిందని ఢిల్లీ మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సాంకేతికంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న విషయాలను మాత్రమే ప్రస్తావించినట్లుగా రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. కేవలం 20 రోజుల క్రితం ప్రధానిని కలిసినప్పుడు సైతం కేసీఆర్ వద్ద ఇదే అజెండా ఉంది. రాజకీయపరమైన అజెండా లేకుండా పరిపాలన పరమైన విషయాలకోసమే అయితే వెంటవెంటనే భేటీలు నడపాల్సిన అవసరం ఉండదు.

మోడీ ‘నో’ మొహమాటం…

రాజకీయ విషయాల్లో మోడీ కరాఖండిగా ఉంటారు. జరిగేది మాత్రమే చెప్పడం ఆయన స్పెషాలిటీ. రాజకీయంగా నష్టం జరిగినా తాను అనుకున్నది చేసి తీరతారు. పరిపాలనపరమైన విషయాల్లో చట్టవిరుద్దమైన తోడ్పాటునందిస్తానని ఎవరికీ హామీ ఇవ్వరు. ఆంధ్రపద్రేశ్ కు చెందిన వైసీపీ నేతలకు సైతం జగన్ విషయంలో మోడీ ఎటువంటి హామీ ఇవ్వలేదనేది కమలనాథుల స్పష్టీకరణ. కేసీఆర్ ను తెలివైన రాజకీయవేత్తగా మోడీ గుర్తిస్తారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో అత్యంత ప్రాధాన్యమున్న రాష్ట్రంగా తెలంగాణకు మోడీ స్థానమిస్తారు. ఇది భవిష్యత్తులో బీజేపీ సారధ్యంలోని కేంద్రానికి సహకరించేందుకు సానుకూలత ఏర్పరచుకునేందుకు ఉద్దేశించిందే. ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రం ఎన్నికల కమిషన్ ను ఆదేశించలేదు. రాజకీయపరమైన ఒత్తిడి మాత్రమే చేయగలుగుతుంది. రాజ్యాంగ బద్దమైన సంస్థ కావడంతో కేంద్రం మాట వినాలనేమీ లేదు. ఇదే విషయాన్ని కేంద్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలోనే స్పష్టం చేసింది.

మోదీతో మాత్రం…..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కొంతమేరకు సహకరిస్తామనే హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ పెద్దలు టీఆర్ఎస్ ను పూర్తిగా విశ్వసించడం లేదు. అమిత్ షా, మోడీ మాత్రమే నిర్ణయాధికారం కలిగి ఉండటం వల్ల రాజకీయపరమైన పొత్తులు, అనధికార ఒప్పందాల విషయంలో కొంత సాగదీత చోటు చేసుకుంటోంది. అమిత్ షా తో కేసీఆర్ కు సుహృద్భావ సంబంధాలు లేవు. మోడీని మాత్రం తన మాటకారితనంతో ఆకట్టుకోగలిగారు. అమిత్ షా రాజకీయపరమైన ఈక్వేషన్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాటకు విలువనిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ చెప్పినట్లు వింటే బీజేపీ పుట్టి మునిగిపోతుందని స్థానిక నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ విజృంభించి బీజేపీని కూడా రాజకీయంగా నామమాత్రం చేసే ప్రమాదం కూడా ఉందనే సమాచారాన్ని మోడీ, అమిత్ షాలకు పంపించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ తో మోడీ మర్యాదపూర్వకంగా మాట్లాడి పంపించేశారనేది సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*