కేసీఆర్ క‌ద‌లిక‌ల్లో క‌థేమిటంటే..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ద‌లిక‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి. నెల ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు మోడీతో ఆయ‌న భేటీ కావ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని చెబుతున్నా..లోప‌ల క‌థ వేరే ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. మోడీని టార్గెట్ చేస్తూ ఇష్టారీతిన మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు అదే మోడీ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే వాద‌న రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది.

నెలన్నర సమయంలో రెండుసార్లు…

సుమారు 45రోజుల వ్య‌వ‌ధిలోనే ప్ర‌ధాని మోడీతో సీఎం కేసీఆర్ రెండుసార్లు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి కేటీఆర్ ఒక‌సారి.. మ‌ధ్య‌లో మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు కూడా అలా ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేసి వ‌చ్చేసి రావ‌డం గ‌మ‌నార్హం. జూన్ 16న నిర్వ‌హించిన నీతి ఆయోగ్ స‌మావేశానికి ఒర‌రోజు ముందే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీతో సుమారు గంట‌న్న‌ర‌సేపు భేటీ అయ్యారు. తాజాగా.. ఢిల్లీలో కాంగ్ర‌స్ అధినేత రాహుల్‌, యూపీఏ చైర్‌ప‌ర్స‌న్ సోనియాగాంధీల‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ భేటీ కావ‌డం.. బీజేపీయేత‌ర కూట‌మిపై చ‌ర్చించ‌డం.. విప‌క్షాల ఐక్య‌త‌కు అనుస‌రించాల్సిన వ్యూహంపై చర్చించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన రెండు రోజుల్లోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాని మోడీతో స‌మావేశం కావ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటున్నా…..

కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌, హైకోర్టు విభ‌జ‌న‌, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల పెంపు త‌దిత‌ర అంశాల‌పై విన‌తులు ఇచ్చిన‌ట్లు చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం రాజ‌కీయ అంశాలే ప్ర‌ధాన ఎజెండాగా చ‌ర్చి జ‌రిగి ఉండ‌వ‌చ్చున‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, తృణ‌మూల్ కాంగ్రెస్ త‌దిత‌ర విప‌క్షాల‌తో మోడీ వ్య‌తిరేక కూట‌మి బ‌లోపేతం దిశ‌గా ముందుకు వెళ్తున్న‌వేళ కేసీఆర్ క‌ద‌లిక‌ల్లో మ‌త‌ల‌బు మాత్రం ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ఫ్రంట్ ఏర్పాటు విష‌యాన్ని లేవ‌నెత్త‌కుండా కేసీఆర్ మోడీ వ‌ద్ద మెత్త‌ప‌డ‌డంలో ఆంత‌ర్య‌మేమిటోన‌ని మిగ‌తా రాజ‌కీయ వ‌ర్గాలు త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నాయి.

కాంగ్రెస్ ను అడ్డుకోవడానికే…..

అయితే ఓ విష‌యంలో మాత్రం ఒకింత అంచానాకు వ‌స్తున్నాయి. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే.. ఇక ఆ పార్టీ సంగ‌తులు అంతేన‌నీ, కాల‌గ‌ర్భంలో క‌లిసిపోవాల్సిందేన‌నీ.. ఏకైక జాతీయ పార్టీగా బీజేపీ ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో క‌మ‌ల‌ద‌ళం ఉన్న‌ట్లు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు తెలంగాణ‌లో, అటు కేంద్రంలో కాంగ్రెస్ అడ్డుకోవ‌డానికే అనుస‌రించాల్సిన వ్యూహంపై మోడీ, కేసీఆర్‌ల మ‌ధ్య ప్ర‌ధాన ఎజెండాగా చ‌ర్చ జ‌రిగి ఉండ‌వ‌చ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు.