త్వరలోనే నిర్ణయం వింటారు….!

kchandrasekharrao-backstep

“ఈ సభను చూస్తుంటే జన సముద్రాన్ని తలపిస్తోంది. ప్రపంచం నివ్వెరపోయింది. ఈ సభలో రాజకీయ నిర్ణయాల గురించి మాట్లాడను. వచ్చే రోజుల్లో మీరే సంచలన నిర్ణయాలను వింటారు. ఈ సభను చూస్తుంటే 19 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి ఎడా పెడా కరెంట్ ‍ఛార్జీలు పెంచితే దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ నాటి ముఖ్యమంత్రిని తెలంగాణ బిడ్డగా బహిరంగ లేఖ ద్వారా కోరాను. పెంచిన కరెంటు ఛార్జీలు రైతుల పాలిట ఉరితాళ్ల వంటివి. తెలంగాణ ప్రజలు బతకలేరు. ఛార్జీలు తగ్గించాలి. సమైక్యాంధ్రలో తెలంగాణ బతుకులు బాగుపడవని నిర్ణయానికి వచ్చాను. అహంకార పూరితంగా ఉన్న సమైక్య పాలకులు నా మాటను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజలు గోడు పట్టించుకోలేదు. నా మాటలను ఖాతరు చేయలేదు. 2001 ఏప్రిల్ 27న నేను తెలంగాణ పార్టీ పెట్టినా…కరెంట్ ఛార్జిల పెంపుతో నేను రాసిన లేఖతోనే తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది.”

హింసలేని ఉద్యమంతో……

“ఎనిమిదినెలలు మదన పడ్డాను. ఎలా బయటపడాలని అనేక మందిని సంప్రదించా. ఎక్కని కొండ లేదు..మొక్కని బండ లేదు. ఇక గత్యంతరం లేదని తెలంగాణ పోరాటానికి దిగాను. నేను ఉద్యమం ప్రారంభించిన సమయంలో పిడికెడు మంది వ్యక్తులతో ఉద్యమాన్ని ప్రారంభించా. భగవంతుడిని స్మరించుకుని…న్యాయం నావైపు ఉంటే హింస లేని ఉద్యమానికి శ్రీకారం చుట్టా. ఆ ఉద్యమంలో మీరందరూ పాత్రధారులే. మీ త్యాగాలే ఆ ఉద్యమంలో ఉన్నాయి. యువత, మహిళలు అందరూ భాగస్వామ్యులయ్యారు. మొదట్లో వాగ్గానం చేసిన ఢిల్లీ పెద్దలు అహంకారంతో ఉద్యమాన్ని కాలరాచలనే కుట్రలు చేశారు. గులాబీ జెండా పని అయిపోయిందని ప్రచారం చేశారు. నన్ను అవహేళన చేశారు. అయినా అంకిత భావంతో మొండిపట్టుదలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ వచ్చే దాకా పనిచేయాలని నిర్ణయించుకున్నా. ప్రాణం పోయినా సరే…మడమ తిప్పను…ఉద్యమ బాట వీడను. ఎత్తిన జెండా దించను. ఒకవేళ దించితే నన్ను రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలను కోరా. ”

హస్తినలో కుస్తీలు……

“కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 36 పార్టీలను తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఒప్పించగలిగాను. సీపీఐ జాతీయ నేతను ఒప్పించడానికి 38 సార్లు ఆయన చుట్టూ తిరిగా. శ్రమ, ప్రయాస పడి అన్ని పార్టీల మద్దతును కూడ గట్టి 14 సంవత్సరాల కఠోర పరిశ్రమ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన వెంటనే ఎన్నికలకు వెళ్లాలి. ప్రజల మనసులో ఏముందో తెలియదు. ఈనగాసి నక్కల పాలు చేయవద్దని ఒంటరిపోరుకు పోదామని పార్టీ మిత్రులంతా నాకు సలహా ఇచ్చారు. 2014 లో ప్రజలు నన్ను దీవించారు. టీఆర్ఎస్ బిడ్డలే నాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అన్నీ సమస్యలే. ఆ సమస్యలతో నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నాం. కరెంటు సమస్యల నుంచి బయటపడ్డాం. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లందించాలన్న నిర్ణయం తీసుకున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే ముందుకు వెళుతున్నాం. ఈరోజు దేశంలో రైతాంగానికి 24గంటలు ఉచితంగా విద్యుత్తు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ”

విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా…..

“సమైక్య ఏలుబడిలో తెలంగాణలో జీవన విధ్వంసం జరిగింది. కూలి పోయిన కులవృత్తుల బాధ వర్ణనాతీతం. వారి బాధ చూసి కన్నీళ్లు ఆగలేదు. అందుకే వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. కల్యాణి లక్షి దగ్గర నుంచి గొర్రెల, బర్రెల పంపిణీ వరకూ కార్యక్రమాలను చేస్తున్నాం. ప్రతి కులం అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నా అనుభవాల నుంచే సంక్షేమ కార్యక్రమాలు రూపొందాయి. తండాలన్నింటినీ పంచాయతీలుగా చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు సరిపోవు. తెలంగాణ ప్రజలు శాశ్వతంగా జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవడానికి అనేక పథకాలను రూపొందించాలి. కోటి ఎకరాలకు నీరందించేందుకు కట్టుబడి ఉన్నా. రాబోయే రెండు సంవత్సరాల్లోనే కోటి ఎకరాలకు నీరందించి ఆకుపచ్చ తెలంగాణను చూపిస్తా. రైతును అప్పుల నుంచి బయటపడేసేందుకే పెట్టుబడి పథకం పెట్టామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకూ… రైతు ధనవంతులయ్యేంత వరకూ పెట్టుబడి పథకం కొనసాగుతుంది.”

అద్భుతమైన విజయం….

“ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లోపు మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగనని చెప్పా. నేను చెప్పా. మరో 1300 గ్రామాలకు ఏడెనిమిది నెలలో నీళ్లు చేరతాయి. నేను చెప్పిన గడువు కన్నా ముందుగానే ఇంటింటికి కృష్ణా, గోదావరి నీళ్లు అందుతాయి. అధ్భుతమైన విజయం. అనేక రాష్ట్రాల వాళ్లు వచ్చి చూసిపోతున్నారు. కేంద్ర మంత్రులతో సహా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పాలమూరు జిల్లాకు 9 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాం. భవిష్యత్తు ఉంది. రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉంది. ఆర్థిక ప్రగతిలో ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉంది. కొంతమంది నాయకులు ఇసుక మీద సిగ్గులేకుండా మాట్లాడుతుంటారు. ఇసుకమీద వచ్చిన లాభం చూస్తే వారి నోళ్లు మూత పడతాయి. నాలుగు సంవత్సరాల కాలంలో ఇసుకమీద తెలంగాణ రాష్ట్రానికి 1980 కోట్ల ఆదాయం వచ్చింది. పెంచిన సంపదను ప్రజలకు పంచుతాం. మైనారిటీల సంక్షేమంలో కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేశాం.”

ఏది మంచో అదే చేస్తా…..

” జరిగిన ప్రతి అభివృద్ధి మీ కంటి ముందే ఉంది. తవ్విన చెరువులు మీ ఊళ్లలోనే ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం చూస్తున్నారు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. సంక్షేమం పెరగాలి. అద్భుతంగా అభివృద్ది జరగాలి. పింఛన్లు పెంచుతాం. నిరుద్యోగుల గురించి కూడా ఆలోచన చేద్దాం. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్ కు, ప్రజలకు మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకోమని నాకు మంత్రివర్గం అప్పజెప్పింది. త్వరలోనే నిర్ణయాలు చూస్తారు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని ప్రకటిస్తామని అందరూ అనుకున్నారు. అది భావ్యంకాదు. ఎందుకంటే చేయగలిగినవే చెప్పాలి. మ్యానిఫేస్టో లో మొత్తం ఉంటాయి. తెలంగాణ వచ్చిన రోజు నాగుండెల నిండా ఎంత సంతోష పడ్డానో…. తెలంగాణ బిడ్డలకు 95 శాతం రిజర్వేషన్లు దక్కేందుకు కొత్త జోన్లు తెచ్చాను.” అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు. కొంతమంది తనను దించేస్తానని శపథాలు చేస్తామంటున్నారని, ప్రగతి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలా? ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద ఉండాలా? ఆలోచించుకోవాలన్నారు. ఢిల్లీకి గులాం కొట్టాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు తరహాలో ఇతర పార్టీలు రాకుండా వారు రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నారో…అలాగే ఇక్కడా ఉండాలని కేసీఆర్ చెప్పారు. మళ్లీ ప్రజలు దీవిస్తే ఆకుపచ్చ తెలంగాణ ను సాధిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*