సెప్టంబర్ మాత్రమే ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల దిశగా కదులుతోంది. రెండు ప్రధాన పార్టీలు గతంలో విసురుకున్న సవాళ్లు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సిద్దమా? మేము రెడీ అంటూ ఏడాదికాలం క్రితమే కాంగ్రెసు సవాల్ విసిరింది. దానిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాజాగా రండి తేల్చుకుందామంటూ రంకె వేశారు. దాంతోపాటే చాలా వేగంగా పావులు కదపడమూ ప్రారంభించారు . ఇందుకు కారణాలేమైనప్పటికీ రాజకీయ వేడి బాగా పుంజుకొంది. రాహుల్ పర్యటనతో కాంగ్రెసు సైతం సిద్దమవుతున్నట్లుగా ప్రజలకు సంకేతాలు పంపేసింది. బస్సుయాత్ర వంటి కార్యక్రమాలతో ఇప్పటికే కాంగ్రెసు నాయకులు ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు. పదవుల్లో ఉన్నవారందరికీ టిక్కెట్లు ఖాయమని చెబుతూనే మీ పనితీరును అంచనా వేస్తామంటూ ఒక హెచ్చరికనూ జారీ చేశారు.

చురుకు పుట్టించిన కేసీఆర్…

రాజకీయంగా అన్నిపార్టీలు చాలాకాలంగా హడావిడి చేస్తున్నాయి. చిన్నాచితక పార్టీలూ తామున్నామంటున్నాయి. ప్రదానపార్టీలను ఘాటెక్కించిన ఘనత మాత్రం కేసీఆర్ కే దక్కుతుంది. బీజేపీ,టీడీపీ వంటిపార్టీలు ఇంకా పట్టాలకెక్కలేదు. ప్రధానప్రత్యర్థులైన కాంగ్రెసు, టీఆర్ఎస్ లు బరిలోకి వచ్చేశాయి. వామపక్షాలు ఏడాది క్రితమే పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహించాయి. వివిధ ప్రజాసంఘాలతో రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టాయి. టీమాస్ పేరిట సీపీఎం తొట్టతొలి ప్రయోగం చేసింది. అనేక సంఘాలను ఒకే తాటిపైకి తెచ్చి యాక్టివిటీకి శ్రీకారం చుట్టింది. తన రాజకీయ ముఖచిత్రాన్ని బయటపెట్టకుండా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించడమే లక్ష్యంగా టీమాస్ పనిచేసింది. పొలిటికల్ పార్టీలు నేరుగా భాగస్వామ్యం వహించకపోవడంతో కొంతకాలానికే మాస్ నిస్తేజమై పోయింది. దాని స్థానంలో బహుజన లెప్ట్ ఫ్రంట్ పేరిట కొత్త కూటమి కట్టారు. అత్యధిక సంఖ్యలో పార్టీలను కలిగిన కూటమి ఇదే. అయితే ఓట్ల సంఖ్యాపరంగా ప్రభావం చూపగల శక్తిగా దీనిని పరిశీలకులు భావించడం లేదు. అందువల్ల కాంగ్రెసు, టీఆర్ఎస్ ల ముఖాముఖిపైనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

కాంగ్రెసులో కదలిక…

తెలుగుదేశం పార్టీ సహా ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని బలమైన కూటమిని నిర్మించాలని కాంగ్రెసు ఆశిస్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అంతో ఇంతో బలమున్న వామపక్షాలనూ కలుపుకోవాలని భావిస్తోంది. కానీ సీపీఎం ఇప్పటికే బీఎల్ఎఫ్ పేరిట సొంతకుంపటి పెట్టుకుంది. పదమూడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి ఈకూటమి తోడ్పడుతుందని టీఆర్ఎస్ అంచనా. సీపీఎం,సీపీఐలు సహకరిస్తే కాంగ్రెసు అనాయాసంగా గట్టెక్కే సీట్లు ఆ పదమూడు. బీఎల్ఎఫ్ ప్రయోగం వల్ల టీఆర్ఎస్ , కాంగ్రెసుల మధ్య గట్టిపోటీ నెలకొంటుంది. సీపీఐ చిత్తశుద్ధితో హస్తం పార్టీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆపార్టీ బలం అంతంతమాత్రంగానే ఉంది. రాహుల్ రాక కొంత వేగం పెంచింది. నాయకుల విభేదాలు పూర్తిగా సమసిపోయాయని ఎవరూ చెప్పలేరు. కానీ సమస్య తీవ్రమై రోడ్డున పడితే తామే నష్టపోతామన్న విషయం నాయకులకు అవగతమైంది. ఆ మేరకు రాహుల్ పార్టీ శ్రేణులకు గట్టి సంకేతాలే పంపగలిగారు.

సెప్టెంబరు సేఫ్…..

అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటే సెప్టెంబరు నెల మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. అదే నెల రెండో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఎన్నికల శంఖారావమే. ఆ సభలోనే టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీకి బరిలో నిలిచే ఎనభైమందికిపైగా అభ్యర్థుల పేర్లు ప్రకటించవచ్చనేది సమాచారం. కాంగ్రెసు సైతం సెప్టెంబరులో అభ్యర్థులను ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించారు. అయితే దీనిలో అనేక చిక్కుముడులు ఉన్నాయి. కాంగ్రెసు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే ఎన్నిసీట్లు భాగస్వాములకు ఇవ్వాలనేది ఒక ప్రధానాంశం. ఏయే స్థానాలనేదీ అంతే కీలకం. మరోవైపు కేసీఆర్ లెక్కలు ఆయనకున్నాయి. సెప్టెంబరు లోపు అయితే మాత్రమే ముందస్తుగా ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబరు దాటితే సాధారణ ఎన్నికలతో కలిపేయవచ్చు. దేశవ్యాప్తంగా ఏడెనిమిది విడతల్లో జరిగే ఎన్నికలు మార్చి నుంచే మొదలవుతాయి. అక్టోబర్ మాసం వచ్చిందంటే ఆరునెలలవరకూ వ్యవధి తీసుకోవచ్చు కాబట్టి సార్వత్రికంలో భాగమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల కచ్చితంగా సెప్టెంబరులోనే అసెంబ్లీ రద్దు చేసి ఖాళీలను నోటిఫై చేసేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ పక్కాగా అడుగులు వేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్