ఆ ఇద్దరికీ ఇక కేసీఆర్ దిక్కు…!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార టీఆర్ఎస్ లో అప్పుడే టికెట్లు హ‌డావుడి మొద‌లైంది. సిట్టింగుల‌తోపాటు ఆశావ‌హులూ ఎవ‌రికివారుగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎక్క‌డి నుంచి పోటీ చేయాలి..? పార్ల‌మెంటుకా.. లేక అసెంబ్లీకా అనే ఊగిస‌లాట‌లో ప‌డిపోయారు. ఇందులో ఇద్ద‌రు ఎంపీలు మాత్రం ముందువ‌రుస‌లో ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వారు మ‌రెవ‌రో కాదు.. ఆదిలాబాద్ ఎంపీ గొడం న‌గేశ్. మ‌రొక‌రు పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క‌సుమ‌న్‌.

వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో…..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ కూడా అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేసేందుకు ఇప్ప‌టి నుంచి పావులు క‌దుపుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ గొడం న‌గేశ్ గ‌తంలో బోథ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగు ప‌ర్యాయాలు గెలుపొందారు. టీడీపీ హ‌యాంలో రాష్ట్ర గిరిజ‌న శాఖ‌ మంత్రిగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. ఆయ‌న తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వ‌చ్చిన న‌గేశ్‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి గుర్తింపు ఉంది. వ్యూహ ర‌చ‌న‌లోనూ ఆయ‌న పంథా వేర‌ని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బోథ్ నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపు తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంలో ప‌రోక్షంగా సంకేతాలు కూడా ఆయ‌న ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ త‌న క్యాడ‌ర్‌ను కాపాడుకునేందుకు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెలిచిన బోథ్ ఎమ్మెల్యే బాపూరావు అప్ర‌మ‌త్తం అయ్యారు. న‌గేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌న్న టార్గెట్‌తో ఉన్నారు.

సుమన్ కూడా అదే దారిలో…..

ఇక 2014ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి ఎంపీగా గెలిచిన బాల్క సుమ‌న్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న చొప్ప‌దండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తార‌ని అనుక‌న్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న పెద్ద‌ప‌ల్లి ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దిగి కాంగ్రెస్ అభ్య‌ర్థి వివేక్‌పై విజ‌య‌ సాధించారు. త త‌ర్వాత వివేక్ కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి ఎంపీ టికెట్ వివేక్‌కే ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బాల్క సుమన్ అప్ర‌మ‌త్త‌మై చొప్ప‌దండి నుంచి బ‌రిలోకి దిగేందుకు మొగ్గుచూపుతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాద‌ని వీరికి సీఎం కేసీఆర్ టికెట్లు ఇస్తారా ..? అన్న‌ది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*