ఇక ఊరుకుంటే ఎలా?

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలోనే ముందస్తు వ్యూహాన్ని రచిస్తారని చెబుతున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్టీ శ్రేణులకు ముందస్తు ఎన్నికలపై సంకేతాలిచ్చారు. సెప్టంబరులోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పడం, సెప్టంబరు 2న హైదరాబాద్ లో ఇరవై ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంకూడా ఇందులో భాగమే.

నేడు కీలక భేటీ…..

దీంతో మరోసారి ఈరోజు కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే తాను ఇటవల చేయించిన సర్వే ఫలితాలను కూడా వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపు టిక్కెట్ ఖాయమనిచెప్పిన కేసీఆర్ ఒక ఇరవై మంది వరకూ తన పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆ ఇరవై మంది ఎవరనేది నేటి సమావేశంలో తేలనుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో వారి పనితీరు మెరుగుపర్చుకోవాలని గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలున్నాయి.

పొలిట్ బ్యూరో ఎంపికపై…..

దీంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుల ఎంపికపై కూడా ఈ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లేవిధంగా కేసీఆర్ దాదాపు సిద్దమయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కె.కేశవరావు నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఎంపిక మాత్రం గులాబీ బాస్ కే అప్పగిస్తూ ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరోలో ఇప్పటికే సభ్యులను కేసీఆర్ నియమించలేదు. ఎప్పటికప్పుడు దానిని పక్కన పెట్టేస్తూ వచ్చారు.

కీలక నిర్ణయాల దిశగా…..

అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిట్ బ్యూరోను నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనావళి ప్రకారం అది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే పొలిట్ బ్యూరోను రద్దు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్టీలోని పదవులన్నింటినీ భర్తీచేయాలి. ఆ విషయాలను ఎన్నికల కమిషన్ కు తెలియజేయాలి. అందువల్లే ఈ సమావేశంలో పొలిట్ బ్యూరోపై కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పార్టీకి పొలిట్ బ్యూరోయే కీలకం కావడంతో దానిపై ఈరోజు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు పథకాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, గ్రామస్థాయిలో నేతలు పర్యటించడం వంటి వాటిపైనా గులాబీ బాస్ చర్చిస్తారని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*