గులాబీ పార్టీ కొత్త స్లోగన్ తో…?

తెలంగాణాలో మహాకూటమి గెలిస్తే అన్ని ప్రాజెక్టులకు మంగళం పాడేస్తుందా …? అవునంటుంది టీఆర్ఎస్. ఈ స్లోగన్ బాగా ప్రజల్లోకి చొప్పించే పని గట్టిగా మొదలు పెట్టింది. కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు వంటి వారంతా ఈ తరహా ప్రచారానికి ప్రతిచోటా పెద్ద పీట వేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తూ తాము తప్ప ఎవరు అధికారంలోకి వచ్చినా సాగునీటి కష్టాలు కోరి తెచ్చుకుంటారని హెచ్చరిస్తుంది టీఆర్ఎస్.

ఎపి ఫిర్యాదులు ప్రధాన అస్త్రాలుగా …

గతంలో సాగునీటి ప్రాజెక్టులపై ఎపి చేసిన ఫిర్యాదులు టీఆర్ఎస్ కు అస్త్రాలుగా మారాయి. ఆంధ్రా పార్టీలు తెలంగాణ నీటిపై కన్నేశాయని అడుగడుగునా ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుతగులుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి ఉదాహరణగా కాళేశ్వరంపై చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదులను ప్రచార అస్త్రాలుగా గులాబీ పార్టీ మలుచుకుంది. ఈ తరహా ప్రచారం కాంగ్రెస్ కి కొంత ఇబ్బందిగా మారింది. టిడీపి బురద తమకు కూడా అంటుకుంటుందని కొందరు లోలోన మధనపడుతున్నారు.

చంద్రబాబు పెత్తనం చేస్తారని…….

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లిపోయిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులపై వేస్తున్న కొర్రీలను టీఆర్ఎస్ హైలెట్ చేస్తోంది. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణపై చంద్రబాబు పెత్తనం కొనసాగుతుందన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ ఉధృతం చేసింది. ఏపీ నుంచే తెలంగాణను చంద్రబాబు శాసిస్తారన్న స్లోగన్ తో గులాబీ పార్టీ ప్రజల ముందుకు వెళుతోంది. టీడిపి శ్రేణులు ఈ ఆరోపణలకు ధీటుగా జవాబు చెప్పలేక పోతున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*