గులాబి న‌యా ఆప‌రేష‌న్‌… బిగ్ వికెట్స్ డౌన్‌..!

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మ‌ళ్లీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ స్టార్ట్ చేశారా..? రోజురోజుకూ ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీని కకావిక‌లం చేసేందుకు స‌రికొత్త వ్యూహ ర‌చ‌న చేస్తున్నారా..? బ‌ల‌ప‌డుతున్న హ‌స్తం పార్టీ విస్తుపోయేలా పావులు క‌దుతున్నారా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు నిజ‌మేన‌ని చెబుతున్నాయి. కొన్ని నెల‌లపాటు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ఆపేసిన కేసీఆర్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. దీనిని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా నుంచే మొద‌లుపెట్టినట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే కొంద‌రు పాల‌మూరు కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

బలమైన నిర్మాణం లేకపోయినా…..

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌చ్చిన మొట్ట‌మొద‌టి అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉద్య‌మ పార్టీగా టీఆర్ఎస్ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగి విజ‌యం సాధించింది. ప‌లు జిల్లాల్లో అన్నింటికి అన్ని సీట్ల‌నూ కైవ‌సం చేసుకుంది. నిజానికి అప్పుడు..క్షేత్ర స్థాయిలో పార్టీకి బ‌ల‌మైన నిర్మాణం లేదు. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టి కాంగ్రెస్‌, టీడీపీల‌ను టార్గెట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారిని సైతం గులాబీ గూటికి చేర్చుకున్నారు.

వలసలతోనే బలపడి….

దీంతో ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, టీడీపీలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌గా, ఆర్ కృష్ణ‌య్య స్వ‌తంత్రంగా ఉండ‌గా, సండ్ర వెంక‌ట‌వీర‌య్య ఒక్క‌రే పార్టీకి మిగిలారు. త‌ప్ప మిగ‌తా వారంద‌రూ టీఆర్ఎస్‌లో చేరారు. ఇక ఖ‌మ్మంలోనైతే ఒకే ఒక్క కొత్త‌గూడెం సీటు గెల్చుకుంది టీఆర్ఎస్‌. ఆ త‌ర్వాత వ‌ల‌స‌ల‌తోనే గులాబీ పార్టీ బ‌ల‌ప‌డింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో కారు కిట‌కిట‌లాడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్కో టికెట్‌కు ముగ్గురు న‌లుగురు పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నారు.

కాంగ్రెస్ బలపడుతోందని…..

ఇక ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర‌తో కొన్ని నెల‌లుగా తెలంగాణ‌లో రాజ‌కీయ పరిణామాలు మారుతున్నాయి. రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డుతోంది. కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు కోదండ రాం నుంచి కూడా టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మ‌ళ్లీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లుపెట్టారు. దీంతో క‌ర‌డుగ‌ట్టిన కాంగ్రెస్ నేత‌లు గులాబీ గూటికి చేరుతున్నారు.

కిటకిటలాడుతున్న కారులో…..

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న గంద‌ర‌గోళ ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మలుచుకుంటున్నారు టీఆర్ఎస్ బాస్‌. నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి  గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా కారెక్కనున్నారు.. అయితే ఇప్ప‌టికే కిట‌కిట‌లాడుతున్న కారులో వీరిని కూడా చేర్చుకుని సీఎం కేసీఆర్ ఎక్క‌డ కూర్చోబెడుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మరికొందరు సీనియర్ నేతలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు.