కేసీఆర్…ఆ నిర్ణయం తీసుకుంటే….?

కాంగ్రెస్ పార్టీ కుదురుకోకుండా….. మహాకూటమి ఏర్పాటు కాకముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారా? ముందస్తు ఎన్నికలు వచ్చినా…రాకున్నా…తాను మాత్రం ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారా? అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. ఆగస్టు నెలలో శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ వ్యూహంగా కన్పిస్తుంది. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలతోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు తగ్గ సంకేతాలు కూడా కేసీఆర్ నుంచి వెలువడటంతో టీఆర్ఎస్ యంత్రాంగం ఎన్నికలకు సిద్ధమయింది.

కుదురుకోక ముందే…..

కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. రాష్ట్రంలో విపక్షాలన్నీ ఐక్యతగా వెళ్లేందుకు ఇంకా సమయం ఉంది. వారికి సమయం ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. కోదండరామ్ పార్టీ ఇంకా బలపడకముందే ఎన్నికలకు వెళితే మంచిదని భావిస్తున్నారాయన.   అందుకోసమే వివిధ సంక్షేమ పథకాలను త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అధికారులతో పాటు పార్టీ యంత్రాంగాన్ని కూడా కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. డిసెంబరులో ఎన్నికలు జరిగితే అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల సీనియర్ నేతలతో కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు.

యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ…..

ఇందుకోసం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో నియోజకవర్గాల వారీగా సమాచారాన్నికేసీఆర్ ఇప్పటికే తెప్పించుకున్నారు. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తి తీరును సర్వేల ద్వారా అంచనా వేస్తున్నారు. అలాగే సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మూడు దఫాలు సర్వేలు చేయించిన కేసీఆర్ మరోసారి సర్వే చేయిస్తున్నారని చెబుతున్నారు. ఇదే ఫైనల్ సర్వే అని తెలియడంతో సిట్టింగ్ ఎమ్మెల్యలు బిక్కుబిక్కుమంటూ కేసీఆర్ వెల్లడించే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

సీనియర్ నేతలకు బాధ్యతలు…..

ప్రభుత్వ పథకాలైన కంటి వెలుగు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు వెంటనే గ్రౌండ్ అయ్యేందుకు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రచార సామగ్రిని రెండు నెలల్లో సిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. కరపత్రాలు, ప్రచార రథాలను సిద్ధం చేసే బాధ్యతను ఒక సీనియర్ నేతకు అప్పగించారు. అలాగే గత ఎన్నికల్లో సాంస్కృతక రంగమే కేసీఆర్ కు విజయాన్ని సాధించిపెట్టింది. తెలంగాణ ఉద్యమ పాటలు ఆయన విజయానికి దోహదపడ్డాయి. ఇప్పుడు అదే బాటలో ప్రభుత్వం సాధించిన విజయాలపై పాటలను రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ బాధ్యతలన్నింటినీ సీనియర్ నేతలకే అప్పగించారు. మరి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకంటే ముందుగా వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు లో అసెంబ్లీ సమావేశాల తర్వాత శాసనసభను రద్దు చేసి వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచనగా విన్పిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*