
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు. గెలుపు గుర్రాలను వెతికిపట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రత్యర్థులు బెదిరిపోయేలా.. గులాబీ జెండా రెపరెపలాడేలా అదిరిపోయే స్కెచ్ వేస్తున్నారు. గులుపు గుర్రాలను సమగ్ర కుటుంబ సర్వేలో వెతుకుతున్నారట సీఎం కేసీఆర్. అదేమిటీ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఒకేరోజు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు, అభ్యర్థులకు లింకేమిటని ఆలోచిస్తున్నారా..? అక్కడే ఉంది ట్విస్ట్. ఆ సర్వే వివరాలు బయటపెట్టాలంటూ ప్రతిపక్షాలు మొత్తుకున్నా.. పెద్దగా పట్టించుకోని కేసీఆర్ దానిని మాత్రం తన ఎన్నికల అస్త్రంగా వినియోగించునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సిట్టింగ్ లు అందరికీ…..
నిజానికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కీలక నాయకుల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. వారికి ర్యాంకులు కూడా ఇస్తున్నారు. అయితే, ఇందులో కొందరు మంచి మార్కులు సంపాదిస్తుండగా చాలా వరకు పూర్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ కొంత ఆగ్రహంతో కూడిన ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని ఆయన ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ, కొద్దిరోజులుగా ఆయన కదలికలను బట్టి చూస్తే.. ఆ అవకాశం లేన్నట్టేనని తెలుస్తోంది. పెద్దసంఖ్యలోనే అభ్యర్థులను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే.. పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా.. ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంక్షేమ పథకాలను…..
సమగ్ర కుటుంబ సర్వే అనంతరం సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చాలావరకు వృత్తులు, కులాల వారీగానే కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ కులం బలంగా ఉంది..? ఏయే సామాజికవర్గాలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి..? అన్న విషయాలను సమగ్రకుటుంబ సర్వే ఆధారంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాకుండా.. ప్రభుత్వం పథకాల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం వారికి ఎక్కువ లబ్ధి జరిగింది..? అన్న విషయాలను ఇప్పుడు బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు ఉంటుందనే అంశాన్ని కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, సిట్టింగ్‌లను మార్చే నియోజకవర్గాల్లో ఈ వ్యూహాన్నే ఆయన అమలు చేసేందుకు సన్నద్ధమవతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎంపీలను ఎమ్మెల్యేలుగా…..
ఇందులో భాగంగానే.. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న జీతేందర్ రెడ్డిని చేవెళ్లకు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని మాల్కాజిగిరికి పంపే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను అసెంబ్లీకి పోటి చేయించి, అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మహబూబ్ర్ నగర్ అసెంబ్లీని ముదిరాజ్ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో చాలా మంది సిట్టింగుల్లో మళ్లీ కలకలం మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కులాల వారీగా…..
కులాల వారీగా మద్దతు కూటగట్టేందుకు సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే వ్యవహరిస్తున్నారు. ఈ నాలుగేళ్లో అనేక కులసంఘాలతో ఆయన భేటీ అయ్యారు. ఆయా కులాలకు హైదరాబాద్‌లో స్థలం కేటాయించడం.. భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నారు. ఇటీవల పద్మశాలి, రజక సంఘాల నేతలతోనూ ఆయన సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్‌లో భాగమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పలు పథకాలతో కూడా జనాన్ని తనవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే గొర్రెలు, బర్రెలు పంపిణీ చేశారు. రైతులకు ముందస్తు పెట్టుబడి అందిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి రైతుబీమా పథకం అమలు చేస్తున్నారు. వినూత్నంగా కంటివెలుగు పథకానికి రూపకల్పన చేశారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా కేసీఆర్ మామూలు స్కెచ్‌లు వేయండం లేదు.
Leave a Reply