తెలంగాణలో చారిత్రాత్మక పథకం ప్రారంభం

రైతు బంధుపథకాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి రైతుకు ఎకరాకు నాలుగువేల రూపాయల పంట పెట్టుబడి కింద ప్రభుత్వం ఈ సాయం చేయనుంది. దీంతో ఈ పథకాన్ని అనుకూలంగా మలచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ నేడు జరిగే రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాలకు చేరుకున్నారు. నేటి ఉదయం నుంచే రైతుబంధు పథకంకింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకుని…..

ఈ పథకాన్నికేసీఆర్ ప్రతిష్టాత్మకంగాతీసుకున్నారు. తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని తనవైపునకు తిప్పుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎకరానికి నాలుగువేల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. 25 ఎకరాలున్న రైతులను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది. తొలుత భూరికార్డులను ప్రక్షాళన చేసిన సర్కార్, రైతులందరికీ పాస్ బుక్ లను పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమానికి స్వయంగా రైతే హాజరుకావాల్సి ఉంది. ఎవరిపేరు మీద చెక్కు ఉందో వారికే అందిస్తారు. వారు రాకుంటే ఎమ్మార్వో కార్యాలయంలో మూడు నెలలవరకూ ఆచెక్కు భద్రంగా ఉంటుంది. రైతు వచ్చి ఆధారాలను చూపి తన చెక్కును తీసుకెళ్లే వీలు కల్పించారు.

మండల కేంద్రాల్లో….

నేడు మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే తెలంగాణాలో ఈ పథకం కింద అర్హులైన వారిని గుర్తించింది. సుమారు 12 వేల కోట్ల రూపాయలను ఈ పధకం కోసం కేటాయించింది. ఎన్నికలు వచ్చే ఏడాది ఉండటంతో ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్. కోటి ఎకరాలకు సంబంధించిన రైతాంగానికి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం వచ్చే ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తుందని టీఆర్ఎస్ నేతలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా….

నేడు జరిగే చెక్కుల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. తమకు చెక్కులు అందలేదని కొందరు, చెక్కుపై పేరు తప్పుపడిందని మరికొందరు ఇలా గొడవ చేసే అవకాశమున్నందున ముందుగానే అన్నీ పరిశీలించి సక్రమంగా ఉన్న తర్వాతనే చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అంతేకాదు పార్టీ సర్పంచ్ నుంచి మంత్రుల వరకూ విధిగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని కూడా కోరారు. ఈ పథకం సజావుగా అమలయ్యే బాధ్యతను ప్రజాప్రతినిధులపైనే కేసీఆర్ పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు మండలాలను పంచుకుని పథకాన్ని పర్యవేక్షించనున్నారు. నేడు తెలంగాణలో చారిత్రాత్మకమైన పథకం అమలుకాబోతోంది.