బాస్….ఏంటీ…టెన్షన్….?

ఊపిరి సలపనంత ఉత్కంఠ. రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, రాజకీయపార్టీలకు పరీక్ష పెట్టారు కేసీఆర్. అంతకుమించి తన కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను అగ్నిగుండం మీద కూర్చోబెట్టారు. జరగబోయే మంత్రివర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది?. ప్రజల్లోకి వెళ్లడానికి వేసుకున్న ప్రణాళిక ఎంతవరకూ అమలవుతుంది? ఈ పోరాటం లో విజయం సాధించగలమా? లేమా? పదినెలల సమయం ఉండగానే మనకీ పరీక్ష ఎందుకనే ప్రశ్నతో సతమతమవుతున్నారు. తీరా రద్దు చేసిన తర్వాత మళ్లీ టిక్కెట్లు ఇస్తారనే నమ్మకం ఎంతవరకనే అనుమానాలూ వెన్నాడుతున్నాయి. ఏదేమైనా మిగిలిన పార్టీలు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఆర్థికంగా , అంగబలం రీత్యా సంపన్నంగా ఉన్న అధికారపార్టీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినా పోరాటం తప్పదు. బలాబలాలు తేల్చుకోవాల్సిందే. తమ చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆయన తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని విపక్షాలు సన్నాయి నొక్కులు పోతున్నాయి. నిజానికి టీఆర్ఎస్ సహా ఏ పార్టీకీ ముందస్తు ఎన్నికలు ఇష్టం లేదు. కానీ బలవంతంగా అధినేత రుద్దుతున్నారు.

కర్త,కర్మ,క్రియ…

ముందస్తు ఎన్నికల పేరిట సాగుతున్న హడావిడికి కర్త,కర్మ,క్రియ అంతా తానే. కేంద్రప్రభుత్వం, ఎన్నికల కమిషన్ , రాజ్యాంగ నిబంధనల వంటివన్నీ కొంత ఆటంకంగా ఉన్నప్పటికీ తన రాజకీయ నైపుణ్యంతో వాటన్నిటినీ అధిగమించగలనన్న భరోసాతో ముందడుగు వేస్తున్నారు. జాతకాలు, జ్యోతిష్యాలు, ముహూర్తాలు అన్నీ చూసుకుని ఆయన ఎన్నికల గంట మోగించబోతున్నారు. నిజానికి టీఆర్ఎస్ కొంత ఉత్సాహంగా ఉంది. మిగిలిన పార్టీలు దరిదాపుల్లో కూడా లేవు. ఉప ఎన్నికల సరళిని అనుసరించి చూస్తే 50 శాతం వరకూ ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అనేక రకాల అంశాలు ప్రభావం చూపుతాయి. అందువల్లనే గ్యారంటీ గా సగానికి పైగా ఓట్లు వస్తాయనే భరోసా లోపించింది. వివిధ పథకాల రూపంలో ఇంటింటికీ లబ్ధి చేకూర్చినందువల్ల ఆ మేరకు ఫలితం కచ్చితంగా వస్తుందనే కేసీఆర్ విశ్వసిస్తున్నారు. క్యాడర్ కు కూడా ఆ నమ్మకాన్ని కలిగించగలిగారు. భారీ బహిరంగసభలు, నియోజకవర్గ సభలు, ర్యాలీలు, ధూంధాం లతో కొంత హడావిడి మొదలు పెట్టబోతున్నారు. అది ఎన్నికల సంగ్రామం వరకూ కొనసాగించగలరా? అనేది వేచి చూడాలి.

వారంలో తయార్…

టీఆర్ఎస్ జాబితాలను సిద్దం చేసే పని మొదలైంది. మెజార్టీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం ఖాయమని ఇప్పటికే అధినేత స్పష్టం చేశారు. తొలి జాబితాలో దాదాపు 25 మంది కి టిక్కెట్లు ప్రకటించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంటున్నారు. హుస్నాబాద్ లో తొలి బహిరంగ సభ సందర్బంగా కొందరిని అభ్యర్థులుగా వెల్లడించవచ్చనేది సమాచారం. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులే ఎక్కువగా ఉంటారు. అయితే బహిరంగ సభలో హుస్నాబాద్ క్యాండిడేట్ పేరు మాత్రమే చెప్పి మిగిలిన పేర్లపై పార్టీ జిల్లా నాయకత్వానికి క్లారిటీ ఇస్తారనేది మరో సమాచారం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పేర్లు ప్రకటించకుండా స్థానికంగానే చెబితే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు ఉంటే అభ్యర్థుల పేర్లు ప్రజల్లోకి వెంటనే వెళ్లడం మంచిదనే భావన ఉంది. అందువల్ల గ్రౌండ్ వర్క్ చేసుకోగలుగుతారు. కేసీఆర్ వంద నియోజకవర్గాల్లో సభలు పెట్టడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. అంత వరకూ వేచి చూడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అసెంబ్లీ రద్దు అయితే ఒక వారం లోపుగానే అభ్యర్థులందరికీ సమాచారం ఇచ్చి నియోజకవర్గాల్లో పనిచేసుకోమని చెప్పేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

పరుగే పరుగు ….

అన్నిపార్టీల్లోనూ పరుగు పందెం మొదలైంది. ముందుగా కాంగ్రెసు పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రకటించేసింది. తనకు పోయిందేముందన్నట్లుగా భారతదేశ బడ్జెట్ మొత్తాన్ని తెచ్చి పెడితే తప్ప ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించేసింది. అభ్యర్థుల జాబితానూ ఖరారు చేసుకుంది. రాహుల్ ఆమోదముద్ర కోసం తొలిజాబితాను పంపేశారు. సానుకూల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు అమిత్ షా సలహాలను కోరారు. రంగంలో బలమైన అభ్యర్థులను దింపమని ఆయన సూచించారు. తానే స్వయంగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి 19 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 17 వ తేదీన అభ్యర్థులను ఖరారు చేయబోతోంది. జనసేననూ తమలో భాగం చేసుకోవాలని బీఎల్ఎఫ్ చూస్తోంది. ఇంకా చిన్నాచితక పార్టీలు తాము ఉన్నామంటున్నాయి. ఏదేమైనప్పటికీ పరుగు మొదలైంది.

 

-ఎడిటోరియల్ డెస్క్