అక్కడ పాసయితేనే జాక్ పాట్…!!!

k.chandrasekharrao cabinet expansion

ఇప్పుడూ అప్పుడూ అంటున్నారు. కానీ ఎప్పుడో చెప్ప‌డం లేదు! అదుగో ఇదుగో అంటున్నారు. కానీ స్ప‌ష్టంగా ఎవ‌రికీ సంకేతాలు ఇవ్వ‌డం లేదు! ఆశావహుల సంఖ్య అధిక‌మ‌వుతోంది. కానీ ఎవ‌రికి మంత్రి యోగం ఉందో.. ఎవ‌రిని ఆ అదృష్టం వ‌రిస్తుందోన‌నే టెన్ష‌న్ అంద‌రిలోనూ రోజురోజుకూ పెరిగిపోతోంది. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకునే అధినేత‌.. మ‌న‌సులో ఏముందో ఎవ‌రికీ తెలియడం లేదు. ఆ చాణక్యం వెనుక ఉన్న ఆలోచ‌న ఏమై ఉంటుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి 30 రోజులు దాటిపోయింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి.. త‌న వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను చిత్తుచిత్తుగా ఓడించి.. రెండోసారి సీఎం అయిన కేసీఆర్‌.. ఇంకా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై దృష్టిసారించ‌కోవ‌డం వెనుక అస‌లు వ్యూహమేంట‌నే చ‌ర్చ తీవ్రంగా జ‌రుగుతోంది. చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ మౌనం వెనుక అస‌లు వ్యూహం మాత్రం వేరే ఉందంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు!

జాబితాలో పేరు ఉందా?

మంత్రి ఆశ‌ల్లో ఎమ్మెల్యేలు తేలిపోతున్నారు. కేసీఆర్ రూపొందిస్తున్న జాబితాలో త‌మ పేరు ఉందో లేదో తెలుసుకో వాల‌ని ఒక‌టికి ప‌ది సార్లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళుతున్నారు. త‌మ‌కు తెలిసిన వాళ్ల ద్వారా ఇంకా లాబీయింగులు చేయిస్తు న్నారు. కానీ అక్క‌డి నుంచి ఎటువంటి లీకులు రావ‌ట్లేదు. ఏ చిన్న స‌మాచారం ప్ర‌గ‌తిభ‌వ‌న్ దాటి బ‌య‌ట‌కు పొక్క‌డం లేదు. అయితే పూర్తిస్థాయిలో కాక‌.. ముందుగా ఆరుగురు, ఏడుగురిని కేటినెట్‌లోకి తీసుకోవాలనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రికి ఏ శాఖ ఇస్తార‌నే ఊహాగానాలు కూడా ఇప్పుడు లేకుండా పోయాయి! కానీ, 18వ తేదీన ఓ ఏడుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి, ప్ర‌మాణం చేయిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభానికి ముందే వారితో ప్ర‌మాణం చేయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలా ప్ర‌మాణం చేయ‌బోతున్న‌ది ఎవ‌రితో అనేది కూడా స్ప‌ష్ట‌త లేని ప‌రిస్థితి.

ముందస్తు వ్యూహంతోనే…

మంత్రి వ‌ర్గ కూర్పుపై కేసీఆర్ ముంద‌స్తు వ్యూహంతో ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అన్ని ఎంపీ స్థానాలు గెలుపొంది.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో కీల‌కంగా వ్య‌హ‌రించాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. ఆ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్‌ రావు, కేటీఆర్ పైనే వేస్తార‌నడంలో సందేహం లేదు. దీంతో ఇక వీరు ఈ ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కూ ఎటువంటి ప‌ద‌వులు చేప‌ట్ట‌రు. ఈ విష‌యంపై దాదాపు క్లారిటీ వ‌చ్చేసింది. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో పాక్షికంగా కొంద‌రికి ప‌ద‌వులు ఇచ్చి.. పూర్తిస్థాయి విస్త‌ర‌ణ‌ను లోక్ స‌భ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ వాయిదా వేస్తారేమో అనే చ‌ర్చ కూడా తెరాస వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. త్వ‌ర‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఎమ్మెల్యేలు క్రియాశీల పాత్ర పోషించి, తెరాస అభ్య‌ర్థుల గెలుపున‌కు బాగా కృషి చేస్తే… అలాంటివారికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ఒక ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అవి పూర్తయిన తర్వాతే….

`బాగా ప‌నిచేస్తేనే ప‌ద‌వి` అనే సంకేతాలు కేసీఆర్ ఇస్తున్న‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ ముందే కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగిపోతే.. ప‌ద‌వులు ద‌క్క‌నివారు కొంత నిరాశ చెందుతార‌ని, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌నస్ఫూర్తిగా ప‌నిచేయ‌ర‌నే అభిప్రాయం ఉన్న‌ట్టుగా ఉంది. ఇక మంత్రి ప‌దవులు ఇచ్చేస్తే.. ప్రోటోకాల్ అమ‌ల్లోకి వ‌చ్చేస్తుంది కాబ‌ట్టి, ఎంపీ ఎన్నిక‌ల్లో పూర్తిస్థాయిలో పార్టీపై దృష్టి పెట్టే స‌మ‌యం కూడా నేతలకు కొంత త‌గ్గుతుంద‌నే లెక్క‌లు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం! మొత్తానికి కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌వ‌నేది మ‌రోసారి రుజువ‌వుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*