ఆ….14 నియోజకవర్గాల మాటేమిటి…..?

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. శాసనసభ రద్దు చేసిన నిమిషాల్లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి విపక్షాలకు సవాల్ విసిరారు. అయితే ఈ 105 నియోజకవర్గాల్లో రెండింటిలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఒకటి కేసీఆర్ సొంత జిల్లాలోని ఆంథోల్ నియోజకవర్గం. ఇక్కడ సినీనటుడు బాబుమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బాబు మోహన్ కు కాకుండా జర్నలిస్ట్ క్రాంతికి సీటును కేటాయించారు. బాబూ మోహన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లనే మార్చాల్సి వచ్చిందని చెప్పారు.

ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా….

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు దక్కలేదు. నల్లాల ఓదేలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఆయనను మార్చి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బాల్క సుమన్ కు కేటాయించారు. ఈ రెండు సీట్లు మినహా మిగిలిన 103 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులనే ఖరారు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలందరికీ కేసీఆర్ సీట్లు కేటాయించారు. వారిపై ఎటువంటి వ్యతిరేకత లేదని జాబితా ద్వారా తేల్చి చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ లోనే……

ఇక టీఆర్ఎస్ ప్రకటించాల్సింది కేవలం 14 స్థానాల్లోనే. ఇవి ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. ఉప్పల్ టిక్కెట్ ను ఆశించిన నగర మేయర్ రామ్మోహన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక టీఆర్ఎస్ ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో అంబర్ పేట్, ముషీర్ బాద్, కోదాడ, హుజూర్ నగర్, చొప్పదండి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, చార్మినార్, మలక్ పేట, వరంగల్ తూర్పు, ఖైరతాబాద్, గోషామహల్ నియోజవకర్గాలున్నాయి.

కొందరిపై అసంతృప్తి……

ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగ శోభపై తీవ్రస్థాయిలో పార్టీలోనే అసంతృప్తి ఉంది. టిక్కెట్లు ఖారారు చేస్తారని తెలిసి నిన్ననే పెద్దయెత్తున కార్యకర్తలు, నేతలు వచ్చి శోభకు టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. దీంతో కేసీఆర్ ఈ సీటును పెండింగ్ లో పెట్టారు. ఇక వరంగల్ తూర్పులోనూ కొండా సురేఖ విషయంలోనే గులాబీ బాస్ సందిగ్దంలో ఉన్నారు. వారు పార్టీ వీడతారన్న ప్రచారంతో ప్రకటిన నిలిపేసినట్లు సమాచారం. మిగిలిన చోట్ల బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్నామని, కొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉండటంతో అందరితో చర్చించి అభ్యర్థులపై ఒక వారంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. కేవలం 14 స్థానాలకే అభ్యర్థుల ప్రకటన నిలిపేయడం వెనక అనేక కారణాలున్నాయన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*