కేటీఆర్ ఎస్ అంటే….కేసీఆర్ నో…!

ముందస్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌తీసిన తెలంగాణాలో టికెట్ల ర‌గ‌డ ప్రారంభ‌మైంది. ఈ ఏడాది నవంబ‌రు లేదా డిసెంబ‌రులోనే జ‌రుగుతాయ‌ని భావిస్తున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ త‌న నాలుగ‌న్న‌రేళ్ల పాల‌న‌కు సంబంధించి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ప్ర‌భుత్వం ఇన్నాళ్లుగా సాధించిన ప్ర‌గ‌తిని వివ‌రించి… ముంద‌స్తుకు ఆయ‌న సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. మ‌రి ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వ‌డంతో స‌హ‌జంగానే అధికార పార్టీలో టిక్కెట్ల యుద్ధం ప్రారంభ‌మ‌వుతుంది. టీఆర్ఎస్‌లో ఇప్పుడు టికెట్ల ర‌గ‌డ రాష్ట్రంలో తార స్థాయిని చేరింది. అధికార పార్టీ త‌ర‌ఫున టికెట్లు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారు రెండుగా చీలిపోయారు.

ఇద్దరిలో ఒకరిని మంచి చేసుకుంటూ…..

ఓ వ‌ర్గం సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. మ‌రో వ‌ర్గం కేటీఆర్‌కు అనుకూలంగా పావులు క‌దుపుతోంది. వీరిద్ద‌రిలో ఎవ‌రినో ఒక‌రిని మంచి చేసుకోకుండా టికెట్లు పొంద‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇది వివాదానికి దారితీస్తోంద‌ని తెలుస్తోంది. ఈ రేసులో నిన్న‌టి వ‌ర‌కు కేటీఆర్‌కు గ‌ట్టి పోటీ అనుకున్న మంత్రి హ‌రీశ్‌రావు పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. మ‌రోప‌క్క‌, వారం ప‌దిరోజుల్లోనే తొలి విడ‌త‌లో 70 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేయాల‌ని టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ జాబితాలోని అభ్య‌ర్థుల‌కు సంబంధించిన పార్టీ అధినేత కేసీఆర్ ఆయ‌న వారసుడు, మంత్రి కేటీఆర్‌కు మ‌ధ్య అంగీకారం కుదరడం లేదని తెలుస్తోంది. ఆ జాబితాలో మార్పులు, చేర్పులు చేయాల‌ని కేటీఆర్ కోరిన‌ట్టు స‌మాచారం.

కేటీఆర్ అభ్యర్థనను…..

అయితే, తాను గెలుపు గుర్ర‌ల‌కే అవ‌కాశం ఇస్తున్నాన‌ని పేర్కొంటూ కెసీఆర్ త‌న త‌న‌యుడి అభ్య‌ర్థ‌న‌ను తిప్పికొట్టిన‌ట్టు స‌మాచారం. రెండు రోజుల క్రితం ఈ అంశంపై వీరిద్దరి మధ్య ఒకింత వాదన కూడా జరిగినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికల సంగతి ఏమో కానీ..అభ్యర్దుల ప్రకటన..సిట్టింగ్ ల కు సీట్ల కటింగ్ రాజకీయంగా పెద్ద దుమారం రేపటం ఖాయమ‌ని అంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితి, తెప్పించుకున్న స‌ర్వే నివేదిక‌లు.. కార‌ణంగా దాదాపు ఐదుగురికి సీట్లు దక్కవని తెలుస్తోంది. అయితే, అభిజ్ఞ వ‌ర్గాల క‌థ‌నం మేరకు ఈ సంఖ్య రెండు ప‌దుల‌కు పైమాటేన‌ని తెలుస్తోంది.

సిట్టింగ్ లు రెబెల్స్ గా మారితే…..

అయితే, ఇలా టికెట్ గ‌ల్లంతైన సిట్టింగులు రెబ‌ల్స్‌గా మారితే? ఇది ఊహించ‌డానికి కూడా చాలా క‌ష్టంగా మారింది. ఎందుకంటే.. ఈ ప్రభావం ఖచ్చితంగా పార్టీపై ఉంటుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రారంభం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి.. నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్ రావును ప్రగతి నివేదన సభ విషయంలో పూర్తిగా పక్కన పెట్టడంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక టిక్కెట్ల విష‌యానికి వ‌స్తే త‌న అనుచ‌రుల్లో ఎక్కువ మందికి సీట్లు ఇప్పించుకోవాల‌ని కేటీఆర్ చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు కేసీఆర్ చెక్ పెడుతున్న‌ట్టే తెలుస్తోంది. మ‌రి ఇది ఏ ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*