ఈ ఇద్దరూ….??

k-chandrasekharrao-ntramarao

ప్రజాకర్షక శక్తి కలిగిన నేతలు తీసుకునే నిర్ణయాలు ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తాయి. నియంతృత్వాన్ని తలపిస్తాయి. సర్వం సహా తామే కర్త,కర్మ,క్రియగా భావిస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శోభకలిగించకపోయినా తమ వైఖరిని మాత్రం వారు మార్చుకోరు. జాతీయస్థాయిలో చూస్తే ఇందిర, మోడీ వంటివారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. ప్రాంతీయపార్టీల అధినేతలందరిలోనూ ఇంచుమించు అదే ధోరణి కనిపిస్తుంది. రాజకీయంగా ఎత్తుపల్లాలను చూస్తూ ఒక పద్ధతి ప్రకారం ఎదిగిన నాయకుల ధోరణి లో కొంత భిన్నత్వం ఉంటుంది. జనసమ్మోహక శక్తితో ప్రభంజనంలా ఎగసిన నాయకులు మాత్రం ముందు వెనకలు చూసుకోరు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అంగీకరిస్తారనే భావిస్తారు. అధికారయంత్రాంగం పాటించాల్సిందేనని శాసిస్తారు. ఈ కోణానికి చెందిన వారే ఎన్టీరామారావు, కె.చంద్రశేఖరరావు. ఆంధ్రుల ఆత్మాభిమానం పేరుతో చరిత్ర సృష్టించిన ఎన్టీయార్ అనేక దుందుడుకు నిర్ణయాలకు పెట్టింది పేరు. ఉద్యమంతో తెలంగాణ దశను మార్చి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ దీ దూకుడే. కేబినెట్ అవసరం లేని ఒక చరిత్రను వీరిద్దరూ తిరగరాశారు. ముఫ్ఫైఏళ్ల తర్వాత ఎన్టీయార్ రికార్డును కేసీఆర్ బద్దలు గొట్టారు.

అప్రజాస్వామికమా..?

నిజానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తుల నియంత్రణ నుంచి వ్యవస్థ బాధ్యత తీసుకోవాలంటుంది పార్లమెంటరీ సిస్టమ్. అధ్యక్షతరహా పాలనలో చట్టసభలకు సైతం జవాబుదారీతనం వహించరు. కానీ మన సిస్టమ్ లో మాత్రం ఎంత పెద్ద నాయకుడు అయినా చట్టసభకు సమాధానం చెప్పాల్సిందే. నిజానికి తెలంగాణలో ఎన్నికలు జరిగి దాదాపు నెల రోజులు గడిచిపోయాయి. ఫలితాలు వచ్చి మూడు వారాలు దాటిపోయింది. అయినా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సాగలేదు. కొత్తగా ఎన్నికైనవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ లో కూర్చొనే ఘడియ కోసం ఉత్కంఠను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ అధినేత ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వారి కుతూహలాన్ని పక్కన పెట్టేసి జాతీయ అజెండాతో రాష్ట్రపర్యటనలు, ఢిల్లీ యాత్ర చేసి వచ్చారు. ఎన్నికైన ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మళ్లీ దుబాయ్ పర్యటనకూ సిద్ధమవుతున్నట్లు అధికారయంత్రాంగం చెబుతోంది. అందువల్ల ప్రజాప్రతినిధులు చట్టసభల్లో రంగప్రవేశం చేసే ముహూర్తం ఖరారు కావడం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఇది మరింత ఇబ్బంది పెట్టే పరిణామంగానే చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలు అంతర్గతంగా తామంతా నామమాత్రమనే భావనకు లోనవ్వడం ప్రజాస్వామ్యానికి వెలుగునివ్వదు.

అధికారుల రాజ్యమేనా…?

మంత్రివర్గం లేకపోవడం, శాసనసభ సమావేశం కాకపోవడంతో దిశానిర్దేశం కరవు అవుతుంది. ప్రజలకు సంబంధించి ఉన్నత స్థాయిలో చెప్పుకోవడానికి యంత్రాంగం లేనట్లే చెప్పుకోవాలి. అధికారులు ఒక స్థాయి వరకే కలిసేందుకు ఇష్టపడతారు. సామాన్యులకు అందుబాటులో ఉండేది ప్రజాప్రతినిధులే. తమ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు . అయినా వారిని దిగువస్థాయి అధికారులు గుర్తిస్తారు. పెద్దగా సమస్య ఉండదు. కానీ సెక్రటేరియట్ స్థాయిలో పట్టించుకునేవారుండరు. అన్ని సమస్యలనూ కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లలేరు. కేటీఆర్ ను కలిసి విన్నవించేంత సాహసమూ ఉండదు. తమ జిల్లాలకు చెందిన మంత్రులను కలిసి ఎమ్మెల్యేలు తమ గోడు వెళ్లబుచ్చుకుంటారు. ఇప్పుడు ఆ అవకాశం లోపించింది. ఈనేపథ్యంలో కొత్త ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. అధికారులు మాత్రం పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారనే వాదన వినవస్తోంది. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలు, విధివిధానాలు , లక్ష్యాల వంటివాటిపై ఇంకా వారికి అవగాహన కల్పించలేదు. శాఖల వారీ సమీక్షలు లేవు. ప్రధానంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే తరుణం. శాఖలవారీగా మంత్రులు భాగస్వామ్యం వహిస్తే ప్రజల అవసరాలకు సంబంధించి కొంతమేరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అవకాశమున్నప్పటికీ రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని సమకూర్చకపోవడం వల్ల మొత్తం వ్యవస్థ ను అధికార యంత్రాంగానికి వదిలేసినట్లవుతోంది.

కేబినెట్.. కిట్…

ఎన్టీరామారావు, కేసీఆర్ లు సృష్టించిన రికార్డు పై చర్చోపచర్చలు సాగుతున్నాయి. 1989లో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కేబినెట్ వివరాలు ముందుగా మీడియాలో వచ్చేశాయనే సాకుతో ఎన్టీయార్ మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసేశారు. 31 మంది మంత్రులను ఒకే సంతకంతో ఇంటికి పంపేశారు. జానారెడ్డి వంటివారు పార్టీ నుంచి నిష్క్రమించారు. 17 రోజుల పాటు రాష్ట్రంలో తాను ఒక్కరే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రివర్గమే లేని పాలన సాగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ దుందుడుకు ఆధిపత్య వైఖరి ప్రభావం పడిందనే చెప్పాలి. టీడీపీ ఓటమిని చవిచూసింది. తాజాగా తెలంగాణలో మూడింట రెండు వంతుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది తెలంగాణ రాష్ట్రసమితి. పార్టీకి సంబంధించి సమర్థులెవరనే దానిపై కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణలోని సమీకరణలూ ఆయనకు కొట్టిన పిండే. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, బాధ్యతలు వారికి అప్పగించి జాతీయంగా తాను పోషించాల్సిన పాత్రపై దృష్టి సారించి ఉంటే విమర్శలకు అతీతంగా ఉండేది. ఇప్పటికే 22 రోజులు గడిచిపోయాయి. కనీసం మరో పదిరోజులవరకూ మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి దేశం పేరిట తిరగడం తెలంగాణ వాదులకు పెద్దగా నచ్చడం లేదు. అందులోనూ జాతీయ పాత్రకు వెళ్లాల్సి వస్తే కొన్ని చోట్ల రాజీ పడాల్సి వస్తుందనే భావన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో జలపరమైన వివాదాలున్నాయి. వాటిపై సర్దుబాట పట్టాల్సి ఉంటుంది. బలమైన ప్రజామద్దతుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను ఎవరూ నిలదీసే సాహసం చేయకపోవచ్చు. కానీ అంతర్గత అసంతృప్తి మాత్రం రగులుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*