ఆశా..నిరాశేనా?

ఆ వేడి లేదు. ఆ దాడి లేదు. ఉత్సాహం, ఉప్పెనలాంటి వాక్ప్రవాహం లేదు. సాధారణ పత్రికా విలేఖరుల సమావేశాలలోనే గంటన్నర మాట్టాడుతారు కేసీఆర్. అటువంటిది రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రజలను సమీకరించిన భారీ బహిరంగ సభలో 45 నిముషాల ప్రసంగానికే పరిమితమయ్యారు. ఉద్దేశించిన సమయం కంటే గంటన్నర ఆలస్యంగా మొదలుపెట్టిన స్పీచ్ ఊహించినంత ఉత్సుకతను నింపలేదు. అనుకున్నదానికంటే అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఇంతటి పేలవ విన్యాసానికి ఎందుకంత హడావిడి చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోజుల తరబడి శ్రమించి చేసిన ఏర్పాట్లు , కోట్ల రూపాయల వ్యయం, ప్రభుత్వయంత్రాంగ దుర్వినియోగం వంటివన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయనేది ప్రతిపక్షాల విమర్శ. కేసీఆర్ సాధారణ శైలికి భిన్నంగా ప్రగతినివేదన సభ కొనసాగిందనవచ్చు. కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారా? లేదా ముందస్తుపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయా? ఇంతకీ సభ సక్సెస్సా? ఫెయిల్యూరా? అన్నిటా సందేహాలు నెలకొన్నాయి.

ఎందుకు తగ్గారు..?

25 లక్షల జనసమీకరణ లక్ష్యం నెరవేరలేని విషయాన్ని కేసీఆర్ స్వయంగా గమనించారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి కేవలం మూడు లక్షల లోపు మాత్రమే జనాభా బహిరంగసభకు చేరుకున్నట్లుగా ఇంటిలిజెన్సు నివేదికలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఆ సమయానికే కొంగరకలాన్ చేరుకోవాలనేది కేసీఆర్ ప్లాన్. అందుకు అనుగుణంగానే కేబినెట్ సమావేశాన్ని కూడా ముగించేశారు. ఆశించిన సంఖ్యలో సభాప్రాంగణం నిండలేదని తెలిసి సీఎం కొంత నిరుత్సాహానికి గురైనట్లుగా తెలిసింది. దాదాపు రెండు గంటలపాటు ప్రగతి భవన్ లోనే వేచి చూశారు. ఆరుగంటల సమయానికి అదనంగా మరో రెండు లక్షల జనాభా చేరుకున్నట్లు సీఎంకు సమాచారం చేరింది. ఆతర్వాతనే ఆయన సభాప్రాంగణానికి బయలుదేరారు. కొంగరకలాన్ చేరుకున్న తర్వాత హెలికాప్టర్ పైనుంచే నాలుగైదు రౌండ్లు తిరుగుతూ వచ్చిన వారికి అభివాదం చేసే నెపంతో జనసంఖ్యను అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆశించినంతగా లేరని గ్రహించారు. మొత్తం గంటన్నరపాటు ప్రసంగించాలని ముందుగా నిర్దేశించుకున్నప్పటికీ దానిని కుదించి వేసుకున్నారు. సగం సమయంలోనే ముగించేశారు.

ఏవి ఆ చెణుకులు ..మెరుపులు…

కేసీఆర్ అంటే చెణుకులు విసరడంలో దిట్ట. ప్రత్యర్థులను భాషాపాటవంతో ఆటపట్టించడంలో గడుసరి. తిట్టు తిట్టాలన్నా, పొగడాలన్నా ఆయనే చేయాలి. కానీ ప్రగతి నివేదనలో అవన్నీ కరవయ్యాయి. పేలవంగా కనిపించింది. ప్రత్యర్థి కాంగ్రెసుపై విరుచుకుపడలేదు.సాధారణ విమర్శలకే పరిమితమయ్యారు. భాషాపరమైన ఘాటు కనిపించలేదు. మెరుపులు లేవని అందరూ పెదవి విరిచారు. అనర్గళంగా మాట్లాడే కేసీఆర్ ఆచితూచి మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఢిల్లీకి గులాములము కాదు, మన తోటలో గులాబీలుగా ఉందామని చెప్పడమొక్కటే కొసమెరుపు. మిగిలిన స్పీచ్ మూస తరహాలోనే సాగింది. ఇంతకీ అధినేత ప్రసంగాన్ని పక్కనపెడితే ప్రజలెందుకు రాలేదనేది టీఆర్ఎస్ లో చర్చనీయమైంది. ముందు రోజు నుంచే వాతావరణం అనుకూలించకపోవడానికి తోడు మీడియా చూపిన అత్యుత్సాహమూ ప్రజలకు కళ్లెం వేసింది. నాయకులు నియోజకవర్గాల వారీగా వాహనాలు సమకూర్చినప్పటికీ ఎక్కేందుకు ప్రజలు లేక అవస్థలు పడ్డారు. సగం నిండిన వాహనాలే ఎక్కువగా హైదరాబాదుకు వచ్చాయి. జనసమీకరణలో వైఫల్యాన్ని అధినేత స్వయంగా గ్రహించారు. అయితే ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలో తెలియక నాయకులు తలలు పట్టుకున్నారు. మొత్తమ్మీద ‘మమ’ అనిపించేశారు. గత ఏడాది ఏప్రిల్ లో వరంగల్లులో జరిగిన ప్రగతినివేదన సభే బాగా జరిగిందనే వ్యాఖ్యలు వినవచ్చాయి.

త్రిశంకు స్వర్గంలో…

ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో వెనకంజ లేదని టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నుంచి సైతం సానుకూలత వచ్చిందంటున్నారు. కానీ ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న సందేహం. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఉందా? అంటే అవునని చెప్పలేకపోతున్నారు. అదే సంశయం కేసీఆర్ నూ వెన్నాడుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీకి దేశంలో కొంత ప్రాబల్యం పెరుగుతుందనేది అంచనా. అక్కడ బీజేపీ దెబ్బతినే సూచనలున్నాయి. అదే జరిగితే టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెసు తెలంగాణలో సైతం బలం పుంజుకుంటుంది. ఇది బీజేపీకి, టీఆర్ఎస్ కు ఇబ్బందికరమే. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా చూపించి కేంద్రప్రభుత్వాన్ని కేసీఆర్ ఒప్పించగలిగారు. తెలంగాణ రాష్ట్రసమితికి సహకరించినంతమాత్రాన బీజేపీకి సాంకేతికంగా కలిసివచ్చేదేమీలేదు. తెలంగాణలో బలపడే అవకాశమూ లేదు. కానీ కాంగ్రెసును నిరోధించడమనే ఉమ్మడి లక్ష్యం మాత్రమే నెరవేరుతుంది. ఆతర్వాత కేంద్రప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ సహకరిస్తారనే విశ్వాసంతో ముందడుగు వేయాల్సిందే. బీజేపీ రాష్ట్ర నాయకత్వం భిన్నమైన ఆలోచనతో ఉంది. ఇన్ని శషభిషలు ఉండటంతోనే త్వరలోనే రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానంటూ ముగించేశారు కేసీఆర్. ఆ స్పష్టత కోసం తెలంగాణ యావత్తు ఎదురుచూసేలా మళ్లీ ఉత్కంఠనే రేకెత్తించారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*