వార‌సుల‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్‌.. !

అయ్య‌య్యో.. ఇలా అయిందేమిటి..! ఈ సారి ఎలాగైనా త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్న ప‌లువురు నేత‌ల‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్‌. అంతేగాకుండా.. ప‌లువురు నేత‌ల వార‌సుల ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని హ‌డావుడి చేసిన ప‌లువురు వార‌సులు కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఉసూరుమ‌న్నారు. తండ్రుల రాజ‌కీయ వార‌సులుగా ఈ ఎన్నిక‌ల్లో అరంగేట్రం చేద్దామ‌ని ఊపుమీదున్న ఆ నాయ‌కుల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ నేడు కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో సొంత పార్టీ నేత‌లే కాదు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులూ ఏం జ‌రుగుతుందో తెలియ‌ని అయోమ‌యంలో ప‌డిపోయారు. శుక్ర‌వారం హుస్నాబాద్‌లో జ‌రినే ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పార్టీ అభ్య‌ర్థుల తొలి జాబితాను ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. గురువారమే ఏకంగా 105మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

తమ వారసులను……

వీరిలో చాలా మంది సిట్టింగ్‌ల‌కు టిక్కెట్ రాద‌ని భావించారు. అయితే అంద‌రూ ఊహించిన‌ట్టే చేస్తే కేసీఆర్ ఎందుకు అవుతారు. ఇదిలా ఉంటే ప‌లువురు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల వార‌సులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తెగ హ‌డావుడి చేశారు. ఇక త‌మ‌కు టికెట్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేసుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ప‌లువురు నాయ‌కులు కూడా ఈసారి త‌మ వార‌సుల‌కు టికెట్లు ఇవ్వాల‌నే కోరిక‌ను కూడా కేసీఆర్ వ‌ద్ద బ‌య‌ట‌పెట్టారు. ఇందులో ప్ర‌ధానంగా అనారోగ్యంగా ఉన్న‌, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని విశ్రాంతి తీసువాల‌ని నిర్ణ‌యించుకున్న ప‌లువురు నేత‌ల కుమారులు, కూతుళ్ల పేర్లు బాగా వినిపించాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ములుగు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌ర్యాట‌క శాఖ మంత్రి చందూలాల్‌కు టికెట్ వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఎందుకంటే.. ఆయ‌న చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడు ప్ర‌హ్లాద్ టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. అనూహ్యంగా ఈసారి కూడా చందూలాల్‌కే కేసీఆర్ టికెట్ కేటాయించి, ప్ర‌హ్లాద్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు.

కొండా పరిస్థితి కూడా…….

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌తోపాటు త‌న కూతురు సుష్మిత‌ప‌టేల్‌కూడా టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరును ఏకంగా పెండింగ్‌లో పెట్టి పెద్ద షాక్ ఇచ్చారు. అంతేగాకుండా.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ కుమారుడు ర‌విచంద్ర‌కూడా ఈసారి త‌న‌కు టికెట్ ఇప్పించాల‌ని ఇంట్లో పెద్ద లొల్లి చేసిన‌ట్లు తెలిసింది. కానీ..రెడ్యాకే టికెట్ ఇచ్చారు కేసీఆర్‌. ఇక రెడ్యానాయ‌క్ త‌న కుమార్తె కోసం మ‌హ‌బూబాబాద్ సీటు ఇప్పించుకునేందుకు విఫల ప్ర‌య‌త్నం చేశారు.

మంత్రుల కుమారులకు……

అలాగే.. ఉమ్మ‌డి నిజామాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి కుమారుడు కూడా టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కుమారుడు కూడా టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో ఏ ఒక్క‌రికి అవ‌కాశం ఇచ్చినా.. వివాద‌స్ప‌దం అవుతుంద‌ని ముందే ఊహించిన కేసీఆర్ సిట్టింగుల‌కే టికెట్లు ఇచ్చి.. తన మార్క్ రాజ‌కీయాన్ని వారసుల‌కు రుచి చూపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*