`కారు`లో కుదుపు.. 15 మంది టికెట్ క్యాన్సిల్‌…?

ఎన్నిక‌లంటే అంద‌రిలోనూ ఉత్కంఠ‌. ఆశావ‌హులు ఎవరెవ‌రు అనే అంశం నుంచి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే వ‌ర‌కూ.. త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అనేలా ర‌స‌కందాయంగా ఉంటాయి. కానీ ఇవేమీ లేకుండా ఒకేసారి 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ సంచ‌ల‌నం సృష్టించారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ‌ సీఎం కేసీఆర్‌. `ఇదే ఫైనల్` అని తేల్చి చెప్పేశారు! గ‌తంలో నిర్వ‌హించిన స‌ర్వేల్లో భారీగా వ్య‌తిరేక‌త ఉన్న ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించారు. సీటు ఇవ్వ‌బోమ‌ని బెదిరించారు.. కానీ చివ‌ర‌కు అలాంటి వారిపైనా ద‌య చూపారు. దీంతో వారంతా పండ‌గ చేసుకున్నారు. కానీ ఇల్లు అల‌క‌గానే పండ‌గ కాదు అన్న చందంగా.. ఇప్పుడు ఒక పిడుగు లాంటి వార్త వినిపిస్తోంది. కొంద‌రు ఎమ్మెల్యేల‌కు గుండెల మీద కుంప‌టిలా మారిపోయింది. వారి ఆనందాన్ని ఆదిలోనే తుంచేస్తోంది.

పదిహేను మందికి……

ప్ర‌స్తుతం టికెట్లు కేటాయించిన 105 మందిలో సుమారు 15 మందికి బీ-ఫాంలు ఇచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. పేర్లు అయితే ప్ర‌క‌టించేశారు కానీ.. ఈ జాబితాలో మ‌ళ్లీ వ‌డ‌పోత‌లు జ‌రుగుతున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీంతో ఆ 15 మంది ఎవ‌రా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల జాత‌ర‌కు న‌గారా మోగించారు కేసీఆర్‌! ప్ర‌తిప‌క్షాలతో పాటు రాజ‌కీయ వ‌ర్గాలే విస్మ‌యం వ్య‌క్తంచేసేలా.. అవాక్క‌య్యేలా తొమ్మిది నెల‌ల ముందే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. అంతేగాక ప‌నిలో ప‌నిగా అభ్య‌ర్థుల జాబితా కూడా ఖ‌రారు చేసేశారు. కొన్ని స్థానాల మిన‌హా.. మిగిలిన వాటిలో సిట్టింగుల‌కే టికెట్లు కేటాయించేశారు. అభ్య‌ర్థుల ఎంపిక‌ల‌పై పూర్తిగా స‌ర్వేల పైనే ఆధార‌ప‌డిన కేసీఆర్‌.. మూడు సార్లు వ‌డ‌పోతల అనంత‌రం గెలుపు గుర్రాలుగా భావించిన 105 మందిని ప్ర‌క‌టించారు.

అలకలు…ఆగ్రహాలతో…….

ప్ర‌స్తుతం ఆయా నియోజ‌వ‌క‌ర్గాల్లో అల‌క‌లు.. ఆగ్ర‌హాలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరి బుజ్జ‌గింపుల కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం టికెట్ ద‌క్కిన అభ్య‌ర్థులు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న‌లు మొద‌లుపెట్టేశారు. అయితే స‌ర్వేల్లో కొంత‌మందిపై బాగా వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. వారికి కూడా టికెట్ ఇచ్చేశారు కేసీఆర్‌! వీరంతా బ‌తుకు జీవుడా అనుకుంటూ త‌మ పని తాము చేసుకుంటున్నారు. వీరిని ఇలా వ‌దిలేస్తే ఎలా అనుకున్నారో ఏమో! ఇప్పుడు మ‌ళ్లీ వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ దృష్టిపెట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలు సుమారు 15 మంది ఉంటార‌ని, వీరికి పార్టీ బీ- ఫాంలు ద‌క్కే అవ‌కాశాలు లేవ‌ని చెబుతున్నారు.

సర్వేల్లో కూడా వెనకబడిన……

ఈ నిర్ణయం వెనక కారణం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఒకటి అయితే..ఆయా అభ్యర్ధులు సర్వేల్లో కూడా వెనకబడి ఉండటం మరో కారణంగా చూపిస్తున్నారు. ఇక మిర్యాల‌గూడ అభ్య‌ర్థి న‌ల్ల‌మోతు భాస్క‌ర‌రావు లాంటి వాళ్లు అయితే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌ని చెపుతున్న‌ట్టు తెలుస్తోంది. అప్పటికే ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోనూ అభ్యర్దుల ఎంపిక పూర్తి అవుతుంది కాబట్టి.. టికెట్లు దక్కని వారు పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదనే అంచనాకు వస్తున్నారు నేతలు. ఇలా చివరి నిమిషంలో టిక్కెట్ దక్కని వారు రెబెల్స్ గా రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి? అనే అంశంపై కూడా చర్చ కూడా మొద‌లైంది. `సర్దుబాటు` చేసే అభ్యర్దులకు తలనొప్పి లేకుండా చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

నష్టం భారీగా ఉంటుందని….

రికార్డు స్థాయిలో ఒకేసారి 105 మంది అభ్యర్దులను ప్రకటించి.. తర్వాత జాబితాలో ఉన్న వారికి పదుల సంఖ్యలో బీఫాంలు నిరాకరిస్తే అది కెసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయమ‌ని భావిస్తున్నార‌ట‌. 105 మంది అభ్యర్దులను అలాగే కొనసాగిస్తే రాజకీయంగా నష్టం భారీగా ఉంటుందనే అభిప్రాయంతో కనీసం 15 మందికి అయినా చెక్ పెట్టేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ వెలువడి..నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి ఎన్ని మార్పులు..చేర్పులు ఉంటాయో వేచిచూడాల్సిందే. మ‌రి ఎన్నిక‌లు అయ్యేలోగా కేసీఆర్ ఇంకెన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారో ఏమో!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*