ఇక్కడ ముందే చేతులు ఎత్తేశారా..!

తెలంగాణలో ఓ కీలక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ చేతిలో నిర్వీర్యం అయిపోయిన టీడీపీ దెబ్బకు టీఆర్‌ఎస్ కుదేలు అవుతుందా ? అక్కడ టీడీపీ వేస్తున్న రాజకీయ వ్యూహాలకు ఆ పార్టీ అభ్యర్థి దూకుడు ముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముందే చేతులు ఎత్తేశాడా ? అంటే ఆ నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఆ పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఒకటి. ఆంధ్రాకు సరిహద్దుగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచే మాజీ ముఖ్య మంత్రి జలగం వెంగళరావు తన హవా చెలాయించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక‌ తెలంగాణ తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హవా కొనసాగింది. సత్తుపల్లి నియోజకవర్గాన్ని మూడున్నర దశాబ్దాలుగా తుమ్మల తన కనుసైగలతో శాసిస్తూ వచ్చారు.

తుమ్మల పార్టీని వీడిన తర్వాత……

2009లో నియోజకవర్గాల పున‌ర్విభజన జరిగే వరకు కూడా ఇక్కడ ఆయన ఏం చెబితే అదే జరిగేది. పున‌ర్విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా సత్తుపల్లిలో మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో సత్తుపల్లి నియోజకవర్గంలోని ఆయన అనుచర గణం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, డీసీసీబీ చైర్మ‌న్ మువ్వా విజయ్‌బాబుతో పాటు పలువురు కీలక నాయకులు గులాబి గూటికి చేరిపోయారు. తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీ, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దూకుడు ముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మ‌న్‌ పిడమర్తి రవి ముందే చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కీలక నాయకులు టీడీపీలోకి జంప్‌ చేసేస్తున్నారు.

బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా……

సత్తుపల్లి నగర పంచాయ‌తీ వైస్ చైర్మ‌న్‌ కొత్తూరు ఉమా మహేశ్వరరావుతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొందరు కౌన్సెలర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తన సొంత సామాజికవర్గంలో మంచి పట్టున్న తుమ్మల పలువురు కీలక నేతలను పిలిపించుకుని పార్టీ మారకుండా ఉండాలని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా… అవి మాత్రం ఫేల్‌ అవుతున్నాయి. చివరకు తుమ్మల ఇక్కడ ప్రత్యేక కాన్‌సెంట్రేషన్‌ చేస్తున్నా పరిస్థితి చేయిదాటి పోతోంది. ఇటీవల ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి నాకంటే మంచివాడు… సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవకపోతే కేబినేట్‌లో తనకు స్థానం ఉండదని కార్యకర్తలందరు ఇక్కడ కలిసికట్టుగా పని చేసి పిడమర్తి రవిని గెలిపించాలని తుమ్మల చెప్పినా సరే అప్పటి వరకు ఆయన వెంట ఉన్న వాళ్లు… టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లు సైకిల్‌ ఎక్కేస్తున్నారు.

స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని….

ఇక పిడమర్తి రవి అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేసినప్పటి నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ నియోజకవర్గంలో స్థానికుడికే టిక్కెట్‌ ఇవ్వాలని పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మట్టా దయానంద్‌ రెండో స్థానంలో నిలిచి సండ్రకు గట్టి పోటీ ఇచ్చారు. మరో వైపు కేటీఆర్‌ జోక్యంతో మట్టా దయానంద్‌, పిడమర్తి రవి కలిసి పని చేయాలని సూచించినా జ్వరం కారణంగా మట్టా ఇంకా ప్రచారానికి రాలేదు. ఇటీవల మట్టా దయానంద్‌ టీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేసేందుకు రూ. 7 కోట్లు ముడుపులు తీసుకున్నారని పిడమర్తి వర్గం నుంచి ప్రచారం జరగడంతో ఆయన మరింత ఆవేదనతో ఉన్నట్టు తెలస్తోంది. ఇక ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సత్తుపల్లి సొంత నియోజకవర్గం అయినా ఆయన జిల్లాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నా ఇప్పటి వరకు పిడమర్తి రవి తరపున ప్రచారం చెయ్యలేదు.

గ్రూపు తగాదాలతో……

ఒకపక్క రెండు వర్గాలు కలిపామని పార్టీ అధిష్టానం భావిస్తున్నా ఇటు మట్టా దయానంద్‌ వర్గానికి, రవి వర్గానికి పొసగ‌డం లేదు. అటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇక్కడ గ్రూపు తగాదాలను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యడం లేదు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరుతున్నా… తుమ్మల మౌనంగా ఉండడంతో పిడమర్తి రవి సైతం అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఈ పరిణామాలపై అధిష్టానానికి సైతం ఆయన పిర్యాదు చేయనున్నారని సమాచారం. మరో విచిత్రం ఏంటంటే టీఆర్‌ఎస్‌లోని పలువురు కీలక నాయకులు తాజా మాజీ ఎమ్మెల్యే సండ్రతో ఫోన్‌లో మాట్లాడుతూ ఎన్నికల వేళ‌ పరోక్షంగా కూడా తమ మద్దతు ఉంటుందని ఆయనకు చెబుతున్నట్టు సమాచారం. ఏదేమైనా సత్తుపల్లిలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే టీడీపీ దూకుడు ముందు టీఆర్‌ఎస్‌ ఏటికి ఎదురు ఈదుతున్నట్టే కనపడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*