కేసీఆర్ అలా … నేత‌లు ఇలా… డిసైడ్ చేశారు..!

రాజ‌కీయాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్నాయి. నేత‌లు కూడా నాయ‌కులు అయిపోతున్నారు. ఒక‌ప్పుడు పార్టీ అధిష్టానం మాట‌ల‌కునాయ‌కులు విలువ ఇచ్చేవారు. కానీ, నేడు ప‌రిస్థితి అలా లేదు. నాయ‌కులు కూడా అధిష్టానాలు తీసుకునే నిర్ణ‌యాల స్థాయిలో స‌మాంత‌రంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌లకు తెర‌దీసిన తెలంగాణాలో అధిష్టానం త‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటే స‌రేస‌రి! లేదంటే.. తామే సొంత నిర్ణ‌యాలు తీసుకుని అదిష్టానాల‌కు చుక్క‌లు చూపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు నాయ‌కులు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మార‌నుంది. ప్ర‌స్తుతం తెలంగాణాలో అధికార పార్టీలో టికెట్లు ల‌భించ‌ని నాయ‌కులు పార్టీ అధిష్టానానికి చుక్క‌లు చూపిస్తున్నారు. యాంటీ ప్ర‌చారాన్ని చాప‌కింద నీరులాగా చేస్తున్నారు.

లోపాయికారీగా సహాయ నిరాకరణకు….

రాజకీయ వలసలు నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాలుగున్నరేళ్లు అప్రతిహతంగా కొనసాగిన గులాబీ హవాకు సొంత పార్టీలోని కొందరు నాయకులే గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు భవిష్య త్‌ రాజకీయాలను అంచనా వేస్తూ మరికొందరు నాయకులు టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లలో కొందరు ఇప్పటికే పార్టీకి దూరం కాగా, మరికొందరు లోపాయికారిగా సహాయ నిరాకరణ కార్యక్రమంలో మునిగిపోయారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే ఎక్కువ మంది నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నాలుగున్న రేళ్లుగా జిల్లాల‌ను శాసించిన నేతలు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఎదురైంది.

ఊహించని రీతిలో……

తాజాగా ఆదిలాబాద్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ టీఆర్ఎస్ ప్ర‌భావం రాను రాను దిగ‌జారే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్క‌డి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశించిన వారికి కాకుండా టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ వేరేవారికి టికెట్లు ఇచ్చారు. దీంతో ఇక్క‌డ సొంత పార్టీలోనే నేత‌ల మ‌ధ్య అస‌మ్మ‌తి పొగ‌లు సెగ‌లు క‌క్కుతోంది. దీంతో టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా నాయ‌కులు చ‌క్రం తిప్పుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిర్మల్‌ నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన చేతిలో ఓడిపోయిన శ్రీహరిరావును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మచ్చిక చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. అయితే ఊహించని రీతిలో మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి కౌన్సిల్‌లోని 21 మంది కౌన్సిలర్లతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ముథోల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డిని మార్చాలని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గం డిమాండ్‌ చేస్తోంది.

ససేమిరా అంటున్న…..

అయితే, విఠల్‌రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేయాలని స్వయంగా కేటీఆర్‌ సూచించినా చారి వర్గీయులు ససేమిరా అం టున్నారు. అయితే కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వేణుగోపాలచారి ఇప్పటివరకు నోరు విప్పలేదు. సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు. తెలంగాణ సెంటి మెంట్‌ను రగిలిస్తూ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేయడం పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పకు మింగుడుప డడం లేదు. బోథ్‌ నియోజకవర్గంలో టికెట్టు మార్చాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ పట్టుపడుతున్నారు. పార్టీ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావుకు నగేష్‌ వర్గం సహాయ నిరాకరణ కొనసాగిస్తోంది. ప్రచారంలోకి వెళ్లకపోగా, బాపూరావు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నగేష్‌ ప్రచారానికి వెళ్లకుంటే ఇక్కడ బాపూరావుకు కష్టమని ఆపార్టీ కార్యకర్తలు చెపుతున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ ఎస్ ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంద‌న్న మాట‌!! మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*