ఫాస్ట్….ఫాస్ట్ గా ఎందుకు?

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నదే కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లుంది. అందుకే ఆయన మంత్రివర్గ సమావేశాన్ని హడావిడిగా ఏర్పాటు చేశారా? ఢిల్లీలోనే ఉండి మంత్రి వర్గ సమావేశం ఏర్పాటుకు కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఇదే ఇప్పడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. దాదాపు ఎన్నికలు వచ్చినట్లే కన్పిస్తోంది. ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నట్లే ప్రకటనలు చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఒక అడుగు ముందు ఉన్నారని పిస్తోంది.

మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో…..

కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన కూడా ఇందుకు ఊతమిస్తోంది. ముందస్తు ఎన్నికలపైనే కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు వార్తలు అందుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే సెప్టంబరు నెలలోనే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేయాల్సి ఉంటుంది. సెప్టంబరులో అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబరులో జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ మూడునెలలు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించే వీలుంటుంది.

కేంద్రం సహకరిస్తుందా?

అయితే ఇందుకు కేంద్రం పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే కేంద్రం రాష్ట్ర పతి పాలన విధించకుండా ముందుగానే పెద్దలతో మాట్లాడి కేసీఆర్ ఢిల్లీలో అంతా సెట్ చేసుకుని వచ్చారని చెబుతున్నారు. కేంద్రం పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే సెప్టంబరు నెల మొదటి వారంలోనే అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని గులాబీ పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది.

వ్యతిరేకత లేనప్పుడే…..

ప్రభుత్వంపై వ్యతిరేక లేనప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అప్పటికి ఇంకా బలపడలేదని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. దీనికితోడు రైతు బీమా, పెట్టుబడి పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్ ఉందని సర్వేల ద్వారా తెలియడంతో కేసీఆర్ షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు సిద్ధమయ్యారు. విపక్షాలు బలపడక ముందే ఎన్నికలకు వెళితే గెలుపు సునాయాసమని కేసీఆర్ నమ్ముతున్నారు. తాను చేయించిన సర్వేలో కూడా వంద సీట్లు ఖాయమని తేలడం కూడా ఒక కారణం. అంతేకాకుండా వర్షాలు సకాలంలో పడుతుండటం కూడా ముందస్తు ఎన్నికలు కలసి వస్తాయని భావిస్తున్నారు. మరి ఏం జరగనుందోనన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*