ఆ విష‌యంలో వ‌ణికిపోతున్న కేసీఆర్‌..!

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా టీఆర్ఎస్ వంద‌కుపైగా సీట్లు గెలుచుకుంటుంద‌ని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. ఆ ఒక్క విష‌యంలో మాత్రం వ‌ణికిపోతున్నార‌ట‌. త‌న‌దైన వ్యూహంతో ప్ర‌త్య‌ర్థిని ముప్పు తిప్ప‌లు పెట్టే కేసీఆర్ వ‌ణికిపోవ‌డ‌మా..? అని అనుకుంటున్నారా..? అయితే.. ఇక్క‌డ కేసీఆర్ భ‌య‌ప‌డుతున్న‌ది.. ఆందోళ‌న చెందుతున్న‌ది ప్ర‌త్య‌ర్థి గురించి కాద‌ట‌.. గులాబీ గూటిలో కొన్ని లుక‌లుక‌లు.. ఆయ‌న‌ను వెంటాడుతున్నాయి. ఇవి ఏవో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంటే ఏం కాదులే అని అనుకోవ‌చ్చు.. కానీ.. తెలంగాణ‌లో ఉన్న 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో తాము గెలుచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోన్న‌ వంద స్థానాల్లో స‌గానికి పైగా స్థానాల్లో ఈ లుక‌లుక‌లు ఉన్నాయి. అందుకే సొంత పార్టీలో గ్రూపు రాజ‌కీయాల నేప‌థ్యంలో లోలోప‌ల కేసీఆర్‌కు టెన్ష‌న్ స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓవైపు ముంద‌స్తు రాగం వినిపిస్తున్న కేసీఆర్ వాటిని అధిగ‌మించ‌డంపైనే పార్టీ గెలుపు అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఆశావహుల మధ్య…….

ఓవైపు ముగ్గురు న‌లుగురికి త‌ప్ప సిట్టింగులంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కేటాయిస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి మ‌ధ్య పోరు మొదలైంది. తెలంగాణ‌లో ఎవ‌రి అంచనాలు ఎలా ఉన్నా ప్ర‌స్తుత పొలిటిక‌ల్ ట్రెండ్ ప్ర‌కారం చూస్తే అధికార టీఆర్ఎస్‌కు కాస్త ఎడ్జ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ ఎలాగూ ఆ పార్టీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించే వాళ్లు టీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ఏం చేసేందుకు అయినా రెడీగా ఉన్నారు. అయితే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీట్ల కోసం కాచుకుని కూర్చొన్న వారు ఈసారి ఆ సిట్టింగుల‌కు టికెట్లు ఇస్తే తాము స‌హ‌క‌రించేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌పై గెలిచిన కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఆయా పార్టీల నాయ‌కుల్లో ఎక్కువ‌గా ఇప్పుడు గులాబీ గూటిలోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో టికెట్ల కోసం వీరిమ‌ధ్య పోరు హోరెత్తుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఒక‌రికి టికెట్ ఇస్తే.. మ‌రొక‌రు స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు.

చాలా నియోజకవర్గాల్లో……

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు వ్య‌తిరేకంగా రాజార‌పు ప్ర‌తాప్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఈసారి త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌ని చెప్పుకుంటున్నారు. దీంతో వీరిమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇక మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు వ్య‌తిరేకంగా మాజీ ఎమ్మెల్యే మాలోత్ క‌విత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. వ‌రంగ‌ల్ తూర్పులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావుతోపాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురి నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల‌ప‌ల్లిలోనూ ఇదే గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇక్క‌డ కొండా దంప‌తులు త‌మ కుమార్తెకు సీటు ఇప్పించుకోవాల‌ని చూస్తుంటే, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ నేత తాను రేసులో ఉన్నాన‌ని చెపుతున్నారు. ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీఆర్ఎస్ ప‌రిస్థితి ఇలాగే ఉంది.

ఇలా అయితే డిపాజిట్ రాదని…..

క‌రీంనగర్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్ప‌డిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యతిరేక వర్గీయులు – సత్యనారాయణకు టిక్కెట్టు ఇస్తే ఆయనకు తాము మద్దతు ఇవ్వబోమని బ‌హిరంగంగానే చెబుతున్నారు. మాజీ మేయర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో టీఆర్ ఎస్ నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేసారు. గ‌తంలోనూ సోమార‌పు స‌త్యనారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని, తాను ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌లేన‌ని పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన కొంత మంది టీఆర్ఎస్ నాయ‌కులు కూడా ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సీ. హేచ్ .రమేశ్‌కు బాబుకు టికెట్‌ ఇస్తే టీఆర్ ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాద‌ని అంటుండ‌డం గ‌మానార్హం. ఇక ఖ‌మ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసే క్ర‌మంలో జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్ల‌పై క‌న్నేసి ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు పొగ ఎలా పెట్టాలా ? అని ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పార్టీలో నెల‌కొన్న ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితితో ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాలు త‌ప్ప‌వ‌ని పార్టీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*