మొదలయింది ఎక్స్ఛేంజ్ మేళా…!

నాయకుల కప్పగంతులు మొదలయ్యాయి. సీట్లు రాని వారు, అవకాశం లేని వారు కొత్త గొడుగు పట్టుకుంటున్నారు. అందలాన్ని ఆశించి గోడ దూకినవారు ఫలితం లభించక మళ్లీ పాత గూటికి చేరాలనుకుంటున్నారు. అప్పటి ప్రాధాన్యం దక్కుతుందో, లేదో తెలియక కిందుమీదులవుతున్నారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్రసమితిపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. పార్టీని బలపరుచుకునే క్రమంలో భాగంగా గడచిన నాలుగేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ ను విస్తృతంగా అమలు చేసింది టీఆర్ఎస్. ఎమ్మెల్యేలు , ఎంపీలతోపాటు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల పెద్ద నాయకులనూ వదలలేదు. అన్నిపార్టీలను అధికారపక్షం బలహీనపరిచింది. నాయకులు అధికారపార్టీ తీర్థం పుచ్చుకుని అందలం ఎక్కుదామనుకున్నారు. అందరికీ పదవులను హామీ ఇచ్చేశారు టీఆర్ఎస్ అగ్రనాయకులు. తీరా ఎన్నికల గడువు ముంచుకొచ్చే సమయానికి హామీ ఇచ్చిన వారందరికీ టిక్కెట్టు ఇవ్వలేక టీఆర్ఎస్ అధినాయకత్వం చేతులెత్తేసింది. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. పూర్వాశ్రమంలోకి వెళ్లేందుకు కొందరు సిద్దమవుతున్నారు.

కథ అడ్డం తిరిగింది…

చాలామంది టీడీపీ, కాంగ్రెసు నాయకులు 2014 తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలు ఎంపీల వరకూ ఉన్నారు. అందరూ టీఆర్ఎస్ అభ్యర్థిత్వాలపై ఆశలు పెంచుకున్నారు. కొందరికి స్వయంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. చర్చలు, సంప్రతింపుల ద్వారా పార్టీలోకి ఆహ్వానించిన చాలామందికి హరీశ్, కేటీఆర్, కవిత హామీలు గుప్పించారు. తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే ఇటీవలి కాలంలో సైతం అధికారపార్టీలో చేరారు. శాసనసభ టిక్కెట్లను ఆశించారు. మంత్రి పదవులు లేదా కీలకమైన కార్పొరేషన్ పదవులు దక్కుతాయనుకున్నారు. తొలి దశలో చేరిన వారికే ఇంతవరకూ ఎటువంటి పెద్ద పదవులు దక్కలేదు. ఏవో సాకులు చెబుతూ వచ్చారు. నిజానికి కేసీఆర్ పదవుల పంపిణీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వారికి న్యాయం చేయాలన్న అంశాన్నీ పట్టించుకోలేదు. పైపెచ్చు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తే నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకుని ఉన్నవారు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తారనే ఆందోళన ఉంది. దీంతో అర్హుల జాబితా పెండింగులో పడిపోయింది.

పీఛే ముడ్…

పదవులకు సైతం గ్రూపు విభేదాలు అడ్డంకిగా మారాయి. హరీశ్, కేటీఆర్, కవిత ముగ్గురూ చర్చలు జరిపి సామదానభేదోపాయాల ద్వారా పార్టీని బలోపేతం చేశారు. వారిచ్చిన హామీలు ఇప్పుడు నెరవేర లేదు. దీనికి ప్రధాన కారణం వర్గ వివాదాలే. తాము తెచ్చిన వారికి పదవులు ఇచ్చి న్యాయం చేయాలని ముగ్గురూ ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. వారందరికీ సమన్యాయం చేయకపోతే సమస్య ఉత్పన్నమవుతుందని అధినేత గ్రహించారు. అందువల్ల తాను నేరుగా ఎంపిక చేసుకున్న కొందరికి ఏదో రూపేణా న్యాయం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ రకంగానే రైతు సమన్వయ సమితి లభించింది. ఆ తర్వాత వారసులు చేసిన సూచనలు పక్కనపెట్టేశారు. ఒకరికి న్యాయం చేస్తే మరొకరికి అన్యాయం చేసినట్లవుతుంది. అందుకే కేసీఆర్ మౌనం వహించారు. అపాత్ర దానం చేయడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఏదో చిరు ఆశతో ఇంతకాలం ఓపిక పట్టారు. ఇప్పుడు ఇక తమకు ఎమ్మెల్యే యోగ్యత లేదని తేలడంతో తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. తమ పేరెంట్ పార్టీల్లో పున:ప్రవేశం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

కరివేపాకు…

తెలంగాణ రాష్ట్రసమితికి తాము కరివేపాకుల్లా మారిపోయామని వివిధ పార్టీల సీనియర్ నాయకులు వాపోతున్నారు. బొటాబొటి మెజార్టీతో గద్దెనెక్కినప్పుడు తమ అవసరం కనిపించింది. క్రమేపీ పార్టీ బలపడిన తర్వాత అవసరం తీరిపోయింది. కేసీఆర్ పేరు చెబితే చాలు ఓట్లు కురుస్తాయనే భరోసాతో తమను పక్కనపెట్టేశారని ఆవేదన చెందుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రశాసనసభలో ఎనిమిదిపార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. ఓట్ల చీలికతో టీఆర్ఎస్ బాగా లాభపడింది. ఆ తర్వాత కాలక్రమంలో అధికారపార్టీ తనంతతాను పుంజుకుంది. సంక్షేమపథకాలు, ప్రతిపక్షాల అనైక్యత ఇందుకు దోహదం చేసింది. కేసీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు అంతగా ప్రజాదరణ లేకపోయినప్పటికీ తనపై ఆధారపడి నెగ్గుతారనే సంపూర్ణ విశ్వాసం ఆయనకు ఏర్పడింది. దాంతో అసెంబ్లీని రద్దు చేసి వారికే మళ్లీ టిక్కెట్లు ఇచ్చే సాహసానికి పూనుకున్నారు. పార్టీ ఏదో తమకు మంచి చేస్తుందని ఆశించి పార్టీలు మారిన వారికి భంగపాటు తప్పలేదు. కూరలో కరివేపాకు మాదిరిగా తయారైంది వారి పరిస్థితి. అటు నుంచి ఇటు జంప్ చేసేందుకు ఇదే ప్రాతిపదికగా మారుతోంది. పార్టీలలో అభ్యర్థుల ఎక్స్చేంజ్ మేళా మొదలైంది.

 

-ఎడిటోరియల్ డెస్క్