ఆయన అంతే మరి….!

తెలంగాణ ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి నుంచి పోరాటమే ఆయన ఊపిరి గా ప్రస్థానం సాగించారు. తెలుగుదేశం పార్టీలో 1985 లో రాజకీయ అరంగేట్రం చేసిన కెసిఆర్ ఇప్పటివరకు శాసన సభకు నాలుగు సార్లు ఎన్నికైతే, పార్లమెంట్ సభ్యుడిగా కూడా మూడు సార్లు గెలుపొందారు. 2004, 2006, 2009, లలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామాలు చేస్తూ ఎన్నికలు ఎదుర్కొంటు ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ సాగిపోయారు. 1987-88 లో టిడిపి సర్కార్ లో సహాయ మంత్రిగా, 92 -93 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా, 97-99 లో కేబినెట్ మంత్రిగా,99-2001 లో ఉప సభాపతిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరించారు. 2001 ఏప్రియల్ 21 న టిడిపి కి రాజీనామా చేసిన కెసిఆర్ అదే ఏడాది అదే నెల 27 న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర రాజకీయాలనుంచి ఢిల్లీ కి …

తెలంగాణ రావాలంటే కేంద్రంలో చక్రం తిప్పాలని భావించిన ఆయన 2004 లో పార్లమెంట్ కి పోటీ చేసి కేంద్రంలోని సంకీర్ణ సర్కార్ లో కార్మిక శాఖామంత్రిగా రెండేళ్ళు పని చేశారు. ఆ తరువాత మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్ళీ 2008 లో తన పదవికి రాజీనామా చేసి 2009 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. కొంత కాలం రూల్స్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి యుపిఎ సర్కార్ ఎపి విభజనకు అంగీకరించేలా వత్తిడి తెచ్చి విజయం సాధించారు. విభజన అనంతరం 2014 లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి పోటీ చేసి నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అదే దూకుడు ….

క్లుప్తంగా కెసిఆర్ రాజకీయ గమనం అది. ఏటికి ఎదురీదే స్వభావం తొలినుంచి ఆయనకు వరం గా మారుతూ వచ్చింది. ఎన్నికల్లో గెలిచాక తన పంతం కోసం రాజీనామాలు చేస్తూ తిరిగి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి రావడం అనుకున్నది సాధించడానికి ఆయనకు బాగా కలిసొచ్చింది. పూర్తి పదవీకాలం పదవిలో ఉండకుండా సెంటిమెంట్ అస్త్రాలతో ప్రజల్లో మమేకమై విజయలక్ష్మిని సొంతం చేసుకోవడం కెసిఆర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ గా ముద్ర పడింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీకి మరింత గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజా తీర్పుని కోరుతున్నారు కెసిఆర్. ఇలా ఆయన చేయడానికి అనేక కారణాలు ఉన్నప్పటికి, పదవీకాలం మరింత ఉండగానే దిగిపోయి తిరిగి ప్రజల తీర్పు కోరడం ఆయనకు కలిసొచ్చే అంశం గా భావించడం కూడా ప్రస్తుత పరిణామాలకు మరో కారణంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికి సెట్ కానీ ప్రత్యర్ధులు …

ప్రత్యర్ధులు అందుకోలేనంత వేగంగా రాజకీయ వ్యూహాలు రచించడం లో దిట్ట అయిన కెసిఆర్ తాజాగా ఎన్నికలకు సర్వ సన్నద్ధం అయిపోయారు. అభ్యర్థులను సైతం కొన్ని స్థానాలు తప్ప ప్రకటించేశారు. తదనంతరం ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ బాస్ తనకారును అంత స్పీడ్ గా నడుపుతుంటే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, ఉనికి కోల్పోయిన టిడిపి, కొత్తగా ఆవిర్భవించిన కోదండరాం పార్టీ, బిజెపి తదితర చిన్నా చితక పార్టీలు ఇప్పటికి తొలి ప్రక్రియను కూడా పూర్తి చేయలేకపోయాయి అంటే కెసిఆర్ ఎంత వేగవంతంగా ముందుకు సాగుతున్నారో తేలిపోతుంది. కెసిఆర్ ఏదైతే కోరుకున్నారో అదే జరుగుతుంది. అన్ని పార్టీలు ఇప్పుడు గందరగోళం లో పడ్డాయి. ఏ పార్టీ కూడా టీఆరెస్ కు సవాల్ విసురుతూ ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో రాబోయే ఎన్నికల్లో గులాబీ బాస్ సెంటిమెంట్ పండుతుందో లేదో తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*