రిస్కీ షాట్…సిక్సరా…క్యాచ్…?

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అయినా ఎక్కడో తేడా కొడుతోంది. అధికారం ఖాయమే . కానీ అనుకున్నంత ఈజీ కాదు. వంద సీట్లను గెలుచుకుంటామన్నది వట్టి మాటే. కచ్చితంగా గెలిచే స్థానాలేమిటన్న విషయంలో సంఖ్యాపరమైన సందిగ్ధత. కేసీఆర్ సర్వేలు నిర్వహించింది వాస్తవమే. కానీ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో సానుకూలత వ్యక్తమవుతోందన్న విషయంలో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. పూర్తిగా కేసీఆర్ ఇమేజ్ పై ఆధారపడే నెగ్గుకురావాల్సి వస్తుంది. ఈ విషయం పై ఆయనకు స్పష్టత ఉంది. అభ్యర్థులను మారిస్తే గెలుపు సాధ్యమవుతుందనుకుంటున్న నియోజకవర్గాలలో సైతం పాతవాళ్లనే అభ్యర్థులుగా ప్రకటించారు. దీని పర్యవసానాలపై పూర్తిగా అవగాహన ఉండి కూడా కేసీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. సర్దుబాట్లు, దిద్దుబాట్లు లేకుండా బుజ్జగింపుల ద్వారా పరిస్థితులను కొలిక్కి తేవచ్చనే యోచనలో ఉన్నారు.

సాహసమే…

అసెంబ్లీ రద్దు నాడే 105 మంది అభ్యర్థులను ఏక్ దమ్ ప్రకటించడమంటే మాటలు కాదు. పెద్ద సాహసమే. కేసీఆర్ కు సాహసాలు చేయడం అలవాటే. ఇంకా తొమ్మిదినెలల సమయం ఉండగానే బరిలోకి దిగుతున్నారు. అధికారాన్ని చివరి వరకూ అనుభవించిన తర్వాత ఎన్నికలకు వెళ్లి గెలుపోటములను తేల్చుకోవడం కాకుండా మధ్యలోనే ప్రజల వద్దకు వెళుతున్నారు. రిస్కు తో కూడుకున్నప్పటికీ ముందస్తుకు వెళితే భారీ రాజకీయ లాభం సమకూరుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నిజానికి సర్వేల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత క్రమేపీ పెరుగుతూ వస్తోందని తేలింది. అలాగని పూర్తిగా వారిని పక్కనపెట్టే పరిస్థితులు లేవు . వారు కొంతమేరకు ఓటు బ్యాంకును ఏర్పరచుకోగలిగారు. తాము సొంతంగా గెలిచేంత సత్తా లేదు. గెలుపు అవకాశాలను మాత్రం ప్రభావితం చేయగలరు. ఇప్పుడు ఎమ్మెల్యే లకు సీట్లు ఇవ్వకపోతే ఇతర పార్టీలను ఆశ్రయించే ప్రమాదం ఉంది. ఇది నష్టం చేకూరుస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రజల్లో అంతగా మంచి పేరు లేకపోయినప్పటికీ పాత వారికే పట్టం కట్టారు. వీరిలో చాలా మంది పట్ల స్థానిక నేతల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కులాల కుంపటి…

సామాజిక సమీకరణల విషయంలోనూ తెలంగాణ రాష్ట్రసమితి ఇబ్బందులు పడుతోంది. జనాభాలో పదిశాతానికి పరిమితమైన రెడ్లకు 30శాతం పైచిలుకు సీట్లను కట్టబెట్టారు. 45 శాతానికి పైగా ఉన్న బీసీలకు సీట్ల సంఖ్యపరంగా చూస్తే 20 శాతం లోపునకే పరిమితం చేశారు. వెలమలకు పదిసీట్లు, కమ్మ కులస్థులకు ఆరు సీట్లు ఇవ్వడమూ అగ్రకులాలకు పెద్ద పీట వేసేందుకు ఉద్దేశించినవనే విమర్శలున్నాయి. బీసీలకు సాధికారత కల్పిస్తామంటూ కొంతకాలంగా టీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. కులవృత్తులకు వివిధ రూపాల్లో సహాయ కార్యక్రమాలనూ చేపట్టింది. ఆర్థికంగా వారిని పైకి తేవడమే ప్రభుత్వ కర్తవ్యమని కేసీఆర్ చెబుతూ వచ్చారు. కులాల వారీ సామాజిక భవనాలకు నిధులను ప్రకటించారు. వారితో నేరుగా సమావేశాలు నిర్వహించారు. ఇవన్నీ ఒక ఎత్తు. పథకాలు అమలు చేస్తే ఓటు బ్యాంకుగా మారతారని ఆశించారు. కానీ పొలిటికల్ గా కొంత చైతన్యం ఉన్న ప్రాంతం కావడంతో తెలంగాణలో బీసీలు రాజకీయ సాధికారత కోరుతున్నారు. సీట్ల కేటాయింపులో ఆరకమైన సమతులనం లోపించింది. ఫలితాలపై దీని ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మైనారిటీ ఓట్లకూ ఎసరు…

మైనారిటీ ఓట్లు గంపగుత్తగా అధికారపార్టీకి దక్కుతాయని నిన్నామొన్నటివరకూ కేసీఆర్ భావించారు. ముస్లిం రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అసెంబ్లీ తీర్మానాన్ని సమర్పించారు. దీనివల్ల 12 శాతం వరకూ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారనుకున్నారు. అయితే అది ఫలించే సూచనలు కనిపించడం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక గూటి పక్షులే అన్న విపక్షాల వాదనకు బాగానే ప్రచారం లభిస్తోంది. ఎంఐఎం సైతం కారు పార్టీని కౌగిలించుకోలేకపోతోంది. తమ రాజకీయ అవసరాలకోసం టీఆర్ఎస్ పై ఆధారపడి ఉంది. కానీ బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కలిసి నడుస్తున్నాయన్న విషయాన్ని మెజార్టీ ముస్లింలు విశ్వసిస్తున్నారు. ఇది తమకు ఇబ్బందికరమని గ్రహించిన ఎంఐఎం ఎక్కడా బహిరంగంగా కారు పార్టీ పట్ల సానుకూలతను కనబరచడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ తాజాగా బహిరంగసభలో ముఖ్యమంత్రి పదవికి తమ పార్టీ సైతం పోటీలో ఉందంటూ చెప్పడం దీనికి కొసమెరుపు. మైనారిటీ ఓట్లు దెబ్బతింటే టీఆర్ఎస్ కు జిల్లాల్లో ఎదురుదెబ్బలు తప్పవు. ఆయా పరిస్థితులన్నిటినీ మదింపు చేసుకుని చూస్తే కేసీఆర్, టీఆర్ఎస్ హవా ఏకపక్షంగా లేదని తెలుస్తోంది. గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేటతెల్లమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్