గులాబీ బాస్ మ‌దిలో గుబులు…!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు దేశ‌రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌ను తీసుకొస్తున్నాయి. పార్టీల గ‌మ‌నాన్ని మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా క‌న్న‌డిగుల తీర్పుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుబులు చెందుతున్నార‌నే పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డ‌నాట సీన్ తెలంగాణ‌లోనూ రిపీట్ అవుతుందేమోన‌న్న ఆందోళ‌న‌లో గులాబీ బాస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. ఈ సారి భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అధికారంతో పార్టీ బ‌లోపేతానికి ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. అదే స్థాయిలో ప్ర‌తికూల అంశాలు కూడా ఉండ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని లోలోప‌ల మ‌ద‌న‌ప‌డుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

సిద్ధూ సంక్షేమ పథకాలు…..

క‌న్న‌డ‌నాట మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించినా.. అవి ఓట్ల రూపం దాల్చ‌క‌పోవ‌డంతో ఏర్ప‌డిన ఫ‌లితం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన మొద‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉద్య‌మ పార్టీగా టీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం గ‌ట్టారు. మొత్తం 119 అసెంబ్లీలో స్థానాల్లోని 63 స్థానాల్లో గులాబీ జెండా ఎగుర‌వేసింది. ఇక మిగ‌తా 56 స్థానాల్లో కాంగ్రెస్‌, టీడీపీ, ఇత‌రులు విజ‌యం సాధించారు. మొత్తంగా బోటాబోటీ మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నిజానికి ఆ ఎన్నిక‌ల్లో ఉద్య‌మ‌గాలితోనే ఆ స్థానాల్లో గులాబీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.

కాంగ్రెస్ పుంజుకుంటూ…..

ఆ త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. అంతేగాకుండా గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న నేత‌లూ టీఆర్ఎస్ కండువాలు క‌ప్పుకున్నారు. అయితే వ‌ల‌స‌ల‌తో, ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో పార్టీ కొంత‌మేర‌కు బ‌లోపేతం అయినా.. అదేస్థాయిలో కాంగ్రెస్ కూడా పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా… తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొత్త‌గా ఏర్పాటు చేసిన తెలంగాణ జ‌న‌స‌మితితో తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి.

కోదండరామ్ పార్టీ…..

మొద‌టి నుంచి కూడా టీఆర్ఎస్ స‌ర్కార్ అవ‌లంబిస్తున్న విధానాల‌పై కోదండ‌రాం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ ఏర్పాటు చేసి, ఆవిర్భావ స‌భ‌తో త‌న స‌త్తా చాటుకున్నారు. నిజానికి అప్ప‌టివ‌ర‌కు లైట్ తీసుకున్న కేసీఆర్ ఈ స‌భ‌తో త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నార‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌ధానంగా విద్యార్థులు, ఉద్యోగ‌, నిరుద్యోగ‌, రైతుల‌ను ఆధారంగా చేసుకుని కోదండ‌రాం ముందుకు వెళ్తున్నారు. వాస్త‌వానికి విద్యార్థి, నిరుద్యోగ లోకంపై సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొద్దిపాటి స్థానాల్లోనైనా కోదండ‌రాం త‌న బ‌లం నిరూపించుకుంటార‌నే వాద‌న మొద‌లైంది.

ఏ పార్టీకి పూర్తి……

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, కాంగ్రెస్ ప్ర‌ధానంగా బ‌రిలో ఉంటాయి. అలాగే సీపీఎం నేతృత్వంలో ఏర్ప‌డిన బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్ కూడా ప్ర‌భావితం చూపే అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. మ‌రోవైపు బీజేపీ రూపంలో టీఆర్ఎస్‌కు మ‌రోగండం పొంచి ఉంది. ఈసారి ఎలాగైనా తెలంగాణ‌లో మెజారిటీ స్థానాల్లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో గులాబీ ద‌ళం గ్రౌండ్ వ‌ర్క్ చేస్తోంది. ఒక‌వేళ కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌లు క‌లిసి న‌డిస్తే మాత్రం కేసీఆర్‌కు క‌ష్టాలేన‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అలాగాకుండా వేర్వేరుగా పోటీ చేసినా.. ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో మాదిరిగా మ్యాజిక్ ఫిగ‌ర్‌కు బీజేపీ కొద్దిపాటి దూరంలో ఆగిపోయిన‌ట్టుగానే.. తెలంగాణ‌లోనూ జ‌రిగే అవ‌కాశాలు ఉండే ఛాన్స్ కూడా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేయ‌డంతో ఇప్పుడు కేసీఆర్‌లో ఇదే టెన్ష‌న్ స్టార్ట్ అయిన‌ట్లు ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*