ఆమె ఎంట్రీతో కేఈ ఫ్యామిలీకి ద‌డ‌ద‌డ‌…!

కోట్ల సుజాత‌మ్మ‌.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ ఎమ్మెల్యే. మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్‌లో ఎలా ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించాల‌ని భావిస్తున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి ఫ్యామిలీ రాజ‌కీయాల్లో పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన రీ ఎంట్రీ గురించి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్పష్టత ఇచ్చారు. తాను మళ్లీ డోన్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నార‌ని తెలుస్తోంది.

సమరానికి రెడీ అవ్వాలని……

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సమరానికి సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు ఆమె సంకేతాలు ఇచ్చారు. దీంతో డోన్‌లో మళ్లీ త్రిముఖ పోరు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల ఫ్యామిలీ కొద్ది రోజులుగా పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. వైసీపీలోకి వ‌స్తే క‌ర్నూలు ఎంపీ సీటుతో పాటు రెండు అసెంబ్లీ సీట్లు సైతం ఇస్తామ‌ని వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇటు టీడీపీ నుంచి కూడా వారికి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే కోట్ల ఫ్యామిలీ మాత్రం ఈ రెండు పార్టీల‌కు దూరంగా కాంగ్రెస్‌లోనే ఉంటున్నారు. ఇక మొదటిసారిగా కోట్ల సుజాతమ్మ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డోన్‌ నియోజకవర్గ రాజకీయాల్లో అడుగు పెట్టారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్‌ను చిత్తుగా ఓడించారు.

కేఈ చేతిలో ఓటమి పాలై…..

తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో మరోసారి డోన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగానే పోటీ చేశారు. టీడీపీ త‌న అభ్యర్థిగా కేఈ కృష్ణమూర్తిని నిల‌బెట్టింది. దీంతో ఆయ‌న చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్‌ పార్టీ తరపున నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు రాష్ట్ర విభజన జరగడంతో.. కోట్ల సుజాతమ్మ డోన్‌ నియోజకవర్గ రాజకీయాలకు దూరమయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె ఆలూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. డోన్‌ నుంచి లక్కసాగరం లక్ష్మీరెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. అప్పటి నుంచి డోన్‌ బాధ్యతలను లక్ష్మీరెడ్డి చూస్తున్నారు.

గట్టి పోటీ తప్పదా….?

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో అంత తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్నా ఆమె డిపాజిట్ ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతుం డ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు సుజాత‌మ్మ‌. అయితే, అదే ఎన్నిక‌ల్లో కేఈ ఫ్యామిలీ డోన్ నుంచి కూడా పోటీ చేయాల‌ని భావిస్తోంది. చాలా రోజుల త‌ర్వాత‌ మ‌ళ్లీ డోన్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సుజాత‌మ్మ‌కు ఇక్క‌డ సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. ఆమె గెలుపు ఎలా ఉన్నా గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. దీంతో కేఈ ఫ్యామిలీ నుంచి ఎవ‌రు రంగంలోకి దిగినా ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, వైసీపీ కూడా గ‌ట్టిపోటీ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఇక్క‌డ నుంచి ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారో చూడాలి.