కేటీఆర్ రూట్ క్లియర్ చేస్తున్నారా?

శత్రువులు మేల్కొనకుండా ముందస్తుతో విరుచుకుపడిన గులాబీ పార్టీకి అసంతృప్తులు, అలకలు, రెబెల్స్ బెడద వెన్నాడుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ దాదాపు ప్రకటించి అందరికన్నా ముందంజలో దూసుకుపోతుంది. కారు వేగం ఎంత స్పీడ్ తో సాగుతుందో అంతే వేగంగా పార్టీలో లుకలుకలు మొదలై పోవడం గులాబీ దళానికి గుబులు రేపుతోంది. షెడ్యూల్ ప్రకటన వచ్చేలోగా వీలైనంత వరకు అందరిని బుజ్జగించి జోలపాడి పడుకోబెట్టాలన్న వ్యూహంతో టీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ రంగంలోకి దిగిపోయారు. ప్రధానమైన అసంతృప్త నేతల వద్దకు సిఎం తనయుడు కెటిఆర్ స్వయంగా వెళ్ళి చర్చలు జరిపి వారి ఆగ్రహ జ్వలను చల్లారుస్తున్నారు.

కెటిఆర్ ద్విముఖ వ్యూహం …

ఇప్పటికే ఖమ్మం జిల్లా మధిర స్థానం ఆశించి భంగపడ్డ రామ్మూర్తితో పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేసేలా ఒప్పించారు కెటిఆర్. ఇలా పలువురిని సామదాన ఉపాయలతో దారికి తెచ్చుకుంటుంది గులాబీ పార్టీ. ఒక పక్క తమ పార్టీలో అసంతృప్తులను బుజ్జగిస్తూ మరో వ్యూహానికి తెరతీశారు కెటిఆర్. విపక్షాల్లో అలకబూనిన టికెట్లు ఆశిస్తూ భంగపడ్డ వారికి గాలం వేసే పనిని సీనియర్లకు అప్పగించారు కేటిఆర్. దాంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి సొంత గూటిని చక్కదిద్దుకోవడంతో పాటు పక్క పార్టీల్లో గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పని గులాబీ దళం చకచకా చేసుకుపోవడం విశేషం.