కడియం కథ మామూలుగా లేదే…!

తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తీరుతో ఓరుగ‌ల్లు గులాబీ నేత‌లు గుర్రుగా ఉన్నారా..? పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌లేపుతున్నారా..? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న పార్టీలో ప‌ట్టుకోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు పార్టీలో చిచ్చురేపుతున్నాయా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం నిజ‌మ‌నే అంటున్నాయి. పార్టీలో పెత్త‌నం చెలాయించేందుకు క‌డియం ఎంచుకున్న మార్గంపై ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో హాట్‌హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల నాటికి ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియని ప‌రిస్థితి నెల‌కొంద‌ని మ‌రికొంద‌రు నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఎమ్మెల్యేలను తనవైపునకు…..

ముఖ్యంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌ జిల్లాకు చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే జిల్లాలోని ఎమ్మెల్యేలు రెండుమూడు వ‌ర్గాలుగా చీలిపోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి.. 2014ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ఎంపీగా క‌డియం శ్రీ‌హ‌రి గెలిచారు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నుంచి గెలిచిన తాటికొండ రాజ‌య్య‌కు గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌య్య‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసి, ఆ ప‌ద‌విని క‌డియం శ్రీ‌హ‌రికి అప్ప‌గించారు.

తరచూ సమీక్షలతో….

ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌డియం ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గం లేక‌పోవ‌డంతో ఆయ‌న కొంత నిరుత్సాహానికి గురైన‌ట్లు అప్ప‌ట్లో కాదు.. ఇప్ప‌టికీ ప్ర‌చారం ఉంది. ఎమ్మెల్యేల అనుమ‌తి లేకుండా ఆయ‌న ఎక్క‌డికీ వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప‌లువురు ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను పిలువ‌డం కూడా మ‌రిచిపోయార‌నే టాక్ కూడా ఉంది. ఒకానొక ద‌శ‌లో క‌డియం శ్రీ‌హ‌రి కూడా తీవ్ర అస‌హ‌నానికి గురైన‌ట్లు తెలిసింది. ఈ ప్రతికూల ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేంద‌ుకు క‌డియం శ్రీ‌హ‌రి స‌రికొత్త వ్యూహానికి తెర‌లేపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేమిటంటే.. ఉమ్మ‌డి అభివృద్ధి, సంక్షేమ అంశాల‌పై త‌ర‌చూ అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్ప‌డిన ఐదు జిల్లాల అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించి, అధికార యంత్రాంగంపై ప‌ట్టుసాధించ‌డం. ఈ క్ర‌మంలోనే త‌న‌కు తెలియ‌కుండా.. ఎవ‌రికీ ఏ ప‌నీ చేయ‌వ‌ద్ద‌నే స్థాయికి క‌డియం చేరుకున్నారు. ఈ క్ర‌మంలోనే అటు ప‌లువురు ఎమ్మెల్యేల‌ను త‌న‌దారిలోకి తెచ్చుకుంటున్న‌ట్లు స‌మాచారం.

రెండు నియోజకవర్గాల్లో పట్టుకోసం….

జిల్లాలో రెండు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు అయిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌, వ‌ర్థ‌న్న‌పేట‌లో ప‌ట్టుకోసం ఆయ‌న విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ఘ‌న్‌పూర్ నుంచి త‌న కుమార్తె డాక్ట‌ర్ కావ్య‌ను పోటీ చేయించాల‌ని ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నాలు అంత సులువుగా వ‌ర్క‌వుట్ అయ్యేలా లేవు. ఇక అసెంబ్లీకి కుద‌ర‌క‌పోతే క‌నీసం వ‌రంగ‌ల్ ఎంపీగా అయినా ఆమెను పోటీ చేయించాల‌ని చూస్తున్నారు. ఇక్క‌డ సిట్టింగ్‌ల‌కు ఎర్త్ పెడితే కాని త‌న‌కు లేదా త‌న కుమార్తెకు సీటు వ‌చ్చ‌ే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ్రూప్ పాలిటిక్స్‌కు తెర‌దీసిన‌ట్టు తెలుస్తోంది.అయితే క‌డియం తీరుపై పులువురు నేత‌లు గుర్రుగా ఉన్న‌ట్లు తెలిసింది. ఆయ‌న‌తో లొల్లి ఎందుకంటూ ప‌లువురు ఎమ్మెల్యేలు క‌డియం బ్యాచ్‌లో చేరిపోయిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు అధికారులు కూడా క‌డియం తీరుపై అసంతృప్తితో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*