
ఇలా అసెంబ్లీని రద్దు చేసి.. అలా పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ కు అసమ్మతి రూపంలో సెద్ద సవాలే ఎదురవుతోంది. సగానికిపైగా నియోజకవర్గాల్లో అసమ్మతివర్గం భగ్గుమంటోంది. ఈ క్రమంలో చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించి, చికిత్స పొందుతూ మృతి చెందడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే.. టికెట్ల దక్కని వారికి కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తున్నారన్నదానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నల్లాల ఓదెలుకు ఏం కేసీఆర్ ఏం చెప్పారో.. ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదుగానీ.. చివరకు ఆయన చల్లబడ్డారు. ఇలానే పలు నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజయ్యకు ఇవ్వడంతో……
ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అందులోనూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యేకే కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో ఇక్కడ టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్ తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలో తన అనుచరులతో పర్యటిస్తున్నారు. ఇక ఇదే టికెట్‌ను తన కూతురు కావ్యకు ఇప్పించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా మొదటి నుంచీ ప్రయత్నం చేశారు. ఆఖరికి తనకైనా ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుసింది. కానీ.. చివరకు కేసీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ.. రాజయ్యకే ఇచ్చారు. అయితే దీనిపై కడియం కూడా అలకబూనినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడునాలుగు రోజుల కిందట తన బలప్రదర్శన కూడా చేపట్టారు.
వరంగల్ ఎంపీ స్థానంలో……
తాను కేసీఆర్ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా పని చేయాలని పైకి కడియం చెబుతున్నా..లోలోపల మాత్రం మ్యాటర్ వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. అయతే.. దీనిని గమనించిన కేసీఆర్ కడియంకు ఓ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడియం కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ సీటును ఇచ్చేందుకు మాట ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అందుకే కడియం కూడా చల్లబడినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సిట్టింగ్ ఎంపీ దయాకర్‌ను తప్పిస్తే.. ఆ పరిణామాలు ఎలా ఉంటాయోనని పార్టీ వర్గాలు కొంత ఆందోళనకు గురవుతున్నాయి. ఇదిలా ఉండగా.. వరంగల్ ఎంపీ సీటును వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తన సతీమణికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Leave a Reply